Idream media
Idream media
జైలు జీవితం, అనారోగ్యం కారణంగా సుదీర్ఘకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు రాష్ట్రీయ జనతాదళ్(ఆర్‌జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్. పలు అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని తన కుమార్తె, ఎంపీ భారతి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రీయ జనతాదళ్ ఏర్పాటు చేసి 25 ఏళ్లయిన సందర్భంగా చాన్నాళ్ల తర్వాత ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. గతంతో పోల్చుకుంటే వేడి తగ్గినట్లు కనిపించినా, మాటల్లో మాత్రం వాడి తగ్గలేదు. ‘‘మేం చావనైనా చస్తాం కానీ వెనుకడుగుమాత్రం వేయం’’ అని అన్నారు.
వారి వల్లే బతికి ఉన్నా
బిహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్(ఎన్‌డీఏ) ప్రభుత్వంపై పోరాటంలో వెనుకంజవేసే ప్రసక్తేలేదని లాలూ ప్రసాద్ యాదవ్ ప్రతిజ్ఞ చేశారు. త్వరలోనే తాను, తన పార్టీ ఆట మొదలుపెడతామన్నారు. జనతాదళ్ నుంచి విడిపోయిన తర్వాత తాను రాష్ట్రీయ జనతాదళ్ ఏర్పాటు చేసి 25 ఏళ్లయిన సందర్భంగా రాజకీయాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. తాను ఊహించని స్థాయిలో తన కుమారుడు, ప్రతిపక్షనేత తేజస్వీయాదవ్ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతున్నాడని ప్రశంసించారు. గత ఏడాది పార్టీకి నాయకత్వం వహించిన తీరును కొనియాడారు. ఆర్జేడీకి మంచి భవిష్యత్ ఉందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ వల్లే తాను ఈ రోజు బతికి ఉన్నట్లు చెప్పారు. వారి కోసమే తాను రాంచీలో జైలు శిక్ష అనుభవించానన్నారు. పశుగ్రాసం కుంభకోణం కేసులో ఆయన అక్కడ జైలులో ఉన్నారు. ఇక్కడ ఎయిమ్స్‌లో వైద్యులు తనను బాగా చూసినట్లు చెప్పారు.
త్వరలో పర్యటన
అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న తరువాత త్వరలో తాను బిహార్ వస్తానని, అన్ని జిల్లాల్లో పర్యటిస్తారని ఆర్జేడీ నాయకులకు, కార్మికులకు లాలూ హామీ ఇచ్చారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం, బిహార్‌లో నితీశ్‌కుమార్ పాలన అనేక అంశాల్లో వైఫల్యం చెందినట్లు తీవ్రస్థాయిలో విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీ, కరోనా వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు. నేడు సామాజిక వ్యవస్థ నాశనమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్య తరువాత కొందరు మధుర గురించి మాట్లాడుతున్నారని బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ పేరు ఎత్తకుండా బీజేపీని తీవ్రస్థాయిలో విమర్శించారు. బిహార్‌లో రోజుకు నాలుగు హత్యలు జరుగుతున్నాయని, అవినీతి పెరిగిపోయిందని, కొవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని నితీశ్‌కుమార్‌పై దాడి చేశారు. ఉపాధిలేక లక్షలాది మంది వలసకూలీలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.