Idream media
Idream media
ప్రతి ఎన్నికలోనూ ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంటున్న టీ.కాంగ్రెస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఏడేళ్లుగా ఆ పార్టీకి కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ సమయంలో బలోపేతం కోసం ప్రయత్నించాల్సిన వేళ.. సీనియర్ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
వారి మధ్య సయోధ్య కోసం అధిష్ఠానం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే.. కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. గతంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. అది పార్టీలో తీవ్ర దుమారం రేపింది. ఇప్పుడు ఏకంగా చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత అయిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని ప్రకటించిన ఆయన ఇప్పుడు అదే పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ ఎంసీ ఎన్నికల సమయంలోనే ఆయన బీజేపీ తెలంగాణ ఇన్ చార్జి భూపేందర్ యాదవ్ తో సమావేశమయ్యారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఇప్పటికే తన అనుచరులకు సమాచారమిచ్చేశారు. ఇక రేపో మాపో అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా చేవెళ్ల నుంచి కొండా గెలిచారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి చేవెళ్ల నుంచి పోటీ చేశారు. స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై ఓటమి పాలయ్యారు.
అధికార పార్టీ టీఆర్ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యమని పలు వేదికలపై ప్రకటించిన ఆయన టీఆర్ఎస్ పై తనదైన శైలిలో నిర్మాణాత్మక విమర్శలు చేయడంలో ముందుండేవారు. తెలంగాణ రాజకీయాల్లో కొండా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి నష్టం జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో.. కాంగ్రెస్ కు రాజీనామా చేయాలనే నిర్ణయాన్ని ఇప్పటి వరకూ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ఎమ్మెల్సీ పోలింగ్ ముగియడంతో… రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. బీజేపీలో చేరబోతున్నట్లు అనుచరులతో చెప్పారు. బీజేపీ వైపు కొండా చూస్తున్నట్లు ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారానికి ఇప్పుడు బ్రేక్ పడినట్లయింది.
కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై పెద్దగా అవినీతి ఆరోపణలు లేవు. మంచి విద్యావంతులుగా పేరుంది. అటువంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీలో చేరుతుండడం ఆ పార్టీ తెలంగాణ నేతల్లో కొత్త ఉత్సాహాన్నిస్తోంది. తెలంగాణ బీజేపీకి కచ్చితంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాక బలాన్నిస్తుందని బీజేపీ నేతలు, కార్యకర్తలు గట్టి నమ్మకంతో ఉన్నారు. జాతీయ స్థాయిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సముచిత స్థానం బీజేపీ ద్వారా దక్కుతుందని ఆయన అనుచరులు, అభిమానులు అభిలషిస్తున్నారు.
అయితే ప్రస్తుతం మూడు నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉండి తన వ్యాపార కార్యకలాలపై దృష్టి పెట్టే యోచనలో ఉన్నట్లు కొండా అనుచరుల ద్వారా తెలుస్తోంది. అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉంది. మరోసారి చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేయాలనే తన అభిప్రాయాన్ని అధిష్ఠానంతో ఇప్పటికే తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్థానం నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేసేందుకు బీజేపీ నాయకత్వం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకే ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. బీజేపీలో చేరే విషయం కొందరికి ఇప్పటికే ఆయన ఫోన్ చేసిన చెప్పారు.