iDreamPost
iDreamPost
గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంత రాజకీయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. పల్నాటి పౌరుషాన్ని ఇప్పటికీ గుర్తు చేస్తుంటాయి. ఉన్నతమైన చరిత్ర కలిగిన పల్నాటి రాజకీయాలకు కేంద్రంగా ఉన్న నరసరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లు తయారవుతోంది. ఒకప్పుడు పూర్తి ఆధిపత్యం చెలాయించిన పార్టీని గత ఎన్నికల్లో పోటీ చేసిన అరవింద బాబు ముందుకు తీసుకెళ్లలేక పోతున్నారని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీనే ఆదరిస్తూ వచ్చిన ప్రజలు 2004 నుంచి దూరం పెట్టారు. అభ్యర్థులను మార్చినా ఫలితం మారకపోవడంతో నియోజకవర్గంలో టీడీపీ పూర్తిగా ఢీలాపడింది. దీంతో నియోజకవర్గ నాయకత్వాన్ని మళ్లీ కోడెల కుటుంబానికి అప్పగిస్తారన్న చర్చ జరుగుతోంది.
గతంలో కోడెల అడ్డా
టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి నరసరావుపేట అండగా ఉంటూ వచ్చింది. దాన్ని అవకాశంగా తీసుకుని పార్టీ నేత కోడెల శివప్రసాదరావు నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకున్నారు. 1983 నుంచి 1999 వరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత నుంచి క్రమంగా ఆయనతోపాటు టీడీపీపై వ్యతిరేకత మొదలైంది. 2004 ఎన్నికలనాటికి మరింత పెరిగి తొలిసారి కోడెలకు ఓటమి రుచి చూపించింది.
2009లోనూ అదే పరాభవం పునరావృతం అయ్యింది. ఈ రెండు ఎన్నికల్లోనూ వైఎస్ చరిష్మా కారణంగా కాంగ్రెస్ అభ్యర్థి కాసు వెంకట కృష్ణారెడ్డి గెలిచారు. రెండు వరుస ఓటములతో కోడెల పక్కనున్న నరసరావుపేట ను వీడి సత్తెనపల్లికి మారారు. దానికితోడు 2014లో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతిలో బీజేపీ అభ్యర్థి నల్లబోతు వెంకటరావు ఓడిపోయారు. 2019లో మళ్లీ టీడీపీ రంగంలోకి దిగి చదలవాడ అరవింద బాబును పోటీకి పెట్టింది. అయినా ఓటమి తప్పలేదు. వైఎస్సార్సీపీ సిటింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి వరుసగా రెండోసారి గెలిచారు.
అరవిందబాబుపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి
కోడెల శివప్రసాద్ నరసరావుపేటను వీడి సత్తెనపల్లి నుంచి పోటీ చేసినా ఇక్కడ పార్టీ వ్యవహారాలు కొంతవరకు చూసుకునేవారు. ఆయన మరణం తర్వాత పెద్ద దిక్కే లేకుండా పోయింది. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి అరవింద బాబు పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోవడంలేదని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇటీవల కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వద్దకు వెళ్లి పార్టీ దుస్థితిని వివరించారు. అరవింద బాబునే కొనసాగిస్తే వచ్చే ఎన్నికల నాటికి నరసరావుపేటలో టీడీపీ మరింత పతనం అవుతుందని స్పష్టంగా చెప్పారు. పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే రాయపాటి కుటుంబం కొంతకాలంగా సత్తెనపల్లి సీటు కోరుతోంది. నరసరావుపేటపై వారికి ఆసక్తి లేదు. మరోవైపు దివంగత కోడెల కుమారుడు శివరాం, కుమార్తె విజయ క్రియాశీలంగా ఉన్నారు. వారు కూడా సత్తెనపల్లి ఇంఛార్జి పదవి కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో పోటీకి అరవింద బాబు సరిపోరని కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నందున ఆయన స్థానంలో కోడెల కుటుంబాన్ని మళ్లీ నరసరావుపేటకు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.