Idream media
Idream media
తెలంగాణ జన సమితి.. కాంగ్రెస్ లో విలీనం కానుందా? 2024 ఎన్నికల్లో కేసీఆర్ ను ఎదుర్కోవడమే లక్ష్యంగా కోదండరాం, రేవంత్ రెడ్డి కలిసి పనిచేయనున్నారా? అంటే అవుననే కనిపిస్తున్నాయి ప్రస్తుత రాజకీయ సమీకరణాలు. సామాజిక తెలంగాణ పేరుతో పార్టీ పెట్టిన కోదండ రాం ఏ ఎన్నికలోనూ ప్రభావం చూపలేకపోయారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనే పోటీ చేసినప్పటికీ గెలవలేకపో్యారు. ప్రస్తుతం పరిస్థితుల్లో పార్టీ నడపడం అంటే ఆషామాషీ కాదు.. అని జనసేన అధినేత పవన్ కల్యాణే తాజాగా పేర్కొన్నారు. డబ్బులు లేక తెలంగాణలో పార్టీని బలోపేతం చేయలేకపోయానని అన్నారు. అలాంటిది కోదండరాం లాంటి వారికి మరింత కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో టీజేఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎంపికైన రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్లతో పాటు.. తనకు సహకరించాలని దిగ్గజ మీడియా సంస్థల అధినేతలను, మేధావులను పలు రాజకీయ ప్రముఖులను కూడా వ్యక్తిగతంగా కలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి ఫెయిల్ అయిపోయిన ఒకప్పటి ఉద్యమ సేనాని కోదండరాం తో మాట్లాడినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర సమితి సారథ్యంలో 2009లో మొదలైన ఉద్యమాన్ని నడిపించారు కోదండరాం. కేసీఆర్ కు తోడుగా జేఏసీ అధ్యక్షుడిగా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమానికి నాయకత్వం వహించి ముందుడి నడిపించారు. 2014లో తెలంగాణ ఏర్పాటు అయ్యే వరకు కోదండరాం ఒక శక్తిగా ఉన్నారు. కానీ తరువాత టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో విడిపోయారు. 2018 ఎన్నికలకు ముందు తన సొంత రాజకీయ పార్టీ ని ‘టీజేఎస్’ స్థాపించారు.
2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ సీపీఐలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీచేశారు.అయితే టీజేఎస్ ఆ ఎన్నికల్లో ఎటువంటి ముద్ర వేయలేకపోయింది. స్వయంగా కోదండరాం కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు. దీంతో టీజేఎస్ పార్టీలోని నాయకులందరూ పార్టీని ఒకరు తర్వాత ఒకరు విడిచిపెట్టారు. దీంతో టీజేఎస్ పార్టీనే కనుమరుగైన పరిస్థితి. కోదండరాం కూడా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్ఎస్ అండతో ఉధృతంగా నడిపించిన కోదండరాం.. తన సొంత పార్టీని మాత్రం సమర్థవంతంగా నడపడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఇటీవల జరిగిన వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కోదండరాం ఓడిపోవడం గమనార్హం.
తెలంగాణ ప్రజల్లో కోదండరాం పట్ల సానుభూతి గౌరవం ఉన్నప్పటికీ ఆయనకు ఆర్థిక బలం రాజకీయ పార్టీని నడిపించే శక్తి సామర్థ్యాలు అంతగా లేవని తేలింది. కాబట్టే ఇక పార్టీని నడిపించడంలో అర్థం లేదని కోదండరాం ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో టీజేఎస్ ను విలీనం చేయాలని గత కొన్ని నెలలుగా కోదండరాం ను రేవంత్ రెడ్డి కోరుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే వీరి మధ్య చర్చలు కూడా సాగాయని చెబుతున్నారు.దీనికి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాకే పరిశీలిస్తానని కోదండరాం అన్నట్టు సమాచారం. వాస్తవానికి టీఆర్ఎస్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నించారు. కానీ అది జరగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యారు. ఈ నేపథ్యంలో టీజేఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వెలువడుతున్నాయి.