Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టేందుకు రాహుల్ గాంధీ తెగ ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది కాలంలోనే రెండు సార్లు ఏపీ నేతలతో చర్చించారు. ఇటీవల రాహుల్ గాంధీ ఏపీకి చెందిన నేతలతో విడివిడిగా సమావేశం అయ్యారు. ముఖ్యమైన నాయకులను ఢిల్లీ పిలిపించుకుని మరీ.. ఆయన ఏపీ పరిణామాలు, పార్టీ పరిస్థితిపైనా చర్చించినట్టు తెలిసింది. ఇప్పుడు తాజాగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీసీసీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఏపీలో కాంగ్రెస్ రాష్ట్ర విభజన తర్వా త.. పూర్తిగా దెబ్బతింది. ఇద్దరు పార్టీ చీఫ్‌లను మార్చినా.. పార్టీ పుంజుకోలేదు. ముఖ్యంగా పార్టీకి బల మైన రెడ్డి సామాజిజక వర్గాన్ని ఎవరూ ఓన్ చేసుకోలేక పోయారు. ఈ క్రమంలోనే పార్టీ చీఫ్‌ను మార్చాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. దీనికి సాకే తరఫున వాదన కూడా బలంగా వినిపిస్తోంది. తనకు సీనియర్లు ఎవరూ సహకరించడం లేదని.. తాను చీఫ్‌గా ఉండి ఏం ప్రయోజనం ఏంటని రాహుల్ తో జరిగిన సమావేశంలో ప్రశ్నించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే సాకె రాజీనామాకు రెడీ అయ్యారని కాంగ్రెస్ లో చర్చ సాగుతోంది. మరీ ముఖ్యంగా సీనియర్ నేతలు కేంద్ర మాజీ మంత్రులు.. జేడీ శీలం ఎం.ఎం. పళ్లంరాజు మెగాస్టార్ చిరంజీవి వంటివారు.. యాక్టివ్ గా లేకపోవడాన్ని ఈ సందర్భంగా సాకే రాహుల్ దృష్టికి తీసుకెళ్లారట. జాతీయ నేతలు వచ్చినప్పుడు మాత్రమే కొందరు కనిపిస్తున్నాయని లేకపోతే.. ఇంటికే పరిమితం అవుతున్నారని.. కనీసం .. స్పందించడం లేదని సాకే వివరించినట్టు తెలిసింది. ఈ పరిణామాలు ఇలానే ఉంటే.. పార్టీ కోలుకోవడం కష్టమనే వాదనను ఆయన తెరమీదికి తీసుకువచ్చినట్టు తెలిసింది.
అయితే అనూహ్యంగా ఆయా అంశాలపై.. చర్చించి.. పరిష్కారం చూపించాల్సిన రాహుల్ గాంధీ.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ పేరు ను ప్రస్తావించారట. కిరణ్ కుమార్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేయడంపై ఆయన సీనియర్ల ను సలహా కోరినట్టు సమాచారం. దీనికి సీనియర్లు కూడా సరే అన్నారని.. ఆయన వస్తే.. రెడ్డి సామాజిక వర్గం.. పార్టీవైపు మొగ్గు చూపుతుందని.. చెప్పినట్టు తెలిసింది. అయితే.. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే.. ఆయన గత ఏడేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో ఆయన సోదరుడు టీడీపీలో ఉన్నారు. ఈ క్రమంలో కిరణ్ ను ఏపీసీసీ చీఫ్ చేస్తే ప్రయోజనం ఉంటుందా అనే వాదన కూడా వినిపిస్తోంది.
అయితే ,కిరణ్ కుమార్ రెడ్డిని ఏఐసీసీ జనరల్ సెక్రెటరీగా తీసుకొని,కెవిపి రామచంద్రరావు ను వర్కింగ్ కమిటీలోకి తీసుకొని పీసీసీ బీసీ సామజిక వర్గానికి చెందిన రఘువీరారెడ్డికి లేదా కాపు సామాజికవర్గానికి చెందిన యువ నేతకు ఎవరికైనా ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
రేపు 26 వ తారీఖున జరగనున్న పిసిసి అధ్యక్షుడు శైలజానాథ్ కుమారుడి పెళ్లికి కాంగ్రెస్ సీనియర్లందరూ హాజరవుతారు కాబట్టి పిసిసి మీద ఎక్కువ చర్చ జరిగే అవకాశం ఉన్నది.