iDreamPost
android-app
ios-app

కిర‌ణ్‌కుమార్ రెడ్డి మ‌ళ్లీ లైన్‌లోకి రానున్నారా?

కిర‌ణ్‌కుమార్ రెడ్డి మ‌ళ్లీ లైన్‌లోకి రానున్నారా?

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ చివ‌రి ముఖ్య‌మంత్రిగా నిలిచిపోయారు. 2010 నవంబరు 25 నుంచి 2014 ఫిబ్రవరి 28 వ‌ర‌కు 3 సంవత్సరాల 96 రోజుల పాటు ఏపీ సీఎంగా కొన‌సాగిన ఆయ‌న చివ‌రి వ‌ర‌కు రాష్ట్ర విభ‌జ‌న‌కు వ్య‌తిరేకంగా పోరాడారు. దీంతో ఆయ‌న‌కు ఏపీలో కాస్త మంచిపేరే ఉంది. దీన్ని అవ‌కాశంగా మార్చుకుని రాష్ట్రంలో మ‌ళ్లీ ఎద‌గాల‌ని భావిస్తోంది కాంగ్రెస్ అధిష్ఠానం. ఏడేళ్లుగా ఏపీలో కాంగ్రెస్ ఉందా అంటే.. పేరుకు ఉంది కానీ దాన్ని గుర్తించే వారు లేరు. మాట్లాడే నాయ‌కుడు కూడా లేడు. పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న సాకే శైల‌జానాథ్ అప్పుడ‌ప్పుడు స్టేట్ మెంట్లు ఇచ్చి మ‌ళ్లీ మాయ‌మ‌వుతుంటారు. ఈ క్ర‌మంలో కిర‌ణ్‌కుమార్ రెడ్డికి ఏపీసీసీ ప‌గ్గాలు ఇవ్వాల‌ని కాంగ్రెస్ హైక‌మాండ్ భావిస్తోంద‌ట‌.

తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి ఇవ్వాలి అని ఆరేడు నెల‌లుగా తీవ్రంగా స‌ర్వేలు, ప‌రిశీల‌న‌లు చేసిన పార్టీ జాతీయ నాయకత్వం ఎన్నో ఆలోచనలు చేసి చేసి చివరకు దూకుడుగా ఉండే రేవంత్ రెడ్డికే పార్టీ పగ్గాలు ఇచ్చింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ దృష్టి ఏపీపై పడింది. ఏపీలో కూడా సమర్థుడు అయిన నేతకు పార్టీ పగ్గాలు ఇస్తే పార్టీ కొంత వరకు గాడిలో పడుతుందన్న ఆశ అధిష్టానంకు ఉంది. 2014 వరకు నాడు సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఇప్పుడు ఏపీ పీసీసీ రేసులో వినిపిస్తోంది.

కిర‌ణ్ కుమార్ రెడ్డి అంతలా ప్ర‌జాద‌ర‌ణ ఉండే ఫేమ్ కాదు కానీ.. అన్ని వర్గాలను ఆక‌ట్టుకున్న నాయ‌కుడే. సమైక్యాంధ్ర కోసం గట్టిగా పోరాటం చేయ‌డంతో ఆయ‌న‌పై ఏపీ వాసుల‌కు కాస్త మంచి అభిప్రాయ‌మే ఉంది. కాంగ్రెస్ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పట్లో కేసీఆర్ జగన్ చంద్రబాబులతో ఢీ అంటే ఢీ అనే రేంజ్లో ఫైట్ చేశారు. కానీ ఆవేశ‌పూరిత వ్యాఖ్య‌లు, రాజకీయాలు ఓట్ల‌ను రాల్చలేదు. జై సమైక్యాంధ్ర పార్టీ కి ప్ర‌జ‌లు జై కొట్ట లేదు. దీంతో ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చారు. అయితే రాజకీయంగా మాత్రం కిరణ్ నిశ్శ‌బ్దంగానే ఉన్నారు.

ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన కొన్ని పథకాలు రైతులు మహిళలు సామాన్యుల్లో ఇప్పటకీ నిలిచిపోయాయి. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్రారంభించిన రూపాయికే కిలో బియ్యం ప‌థ‌కాన్ని మ‌ళ్లీ తెర‌పైకి తెచ్చారు. ఇక సామాజిక సమీకరణల పరంగా 1956 నుంచి కూడా రెడ్లు అందరూ కాంగ్రెస్ వెన్నంటే ఉంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఈ వర్గం వాళ్లు అంతా జగన్ వైపు వెళ్లిపోయారు. ఇక్కడ కాంగ్రెస్కు బలమైన నాయకత్వం లేకపోవడం మైనస్. అటు తెలంగాణలో వీరంతా కేసీఆర్ వైపు మొగ్గు చూపగా.. ఇప్పుడు రేవంత్ ఎంట్రీతో మళ్లీ వీళ్లందరు కాంగ్రెస్ వైపే చూస్తోన్న పరిస్థితి.

ఇక ఇప్పుడు ఏపీలో కూడా అదే రెడ్డి వర్గానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ బాధ్యతలు ఇస్తే రెడ్లతో పాటు పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు తిరిగి పార్టీ వైపు వస్తుందన్న అంచనాలతో జాతీయ నాయకత్వం ఉంది. మధ్యలో ఏపీ పీసీసీ అధ్యక్షులుగా ఉన్న రఘువీరాతో పాటు ప్రస్తుత అధ్యక్షులు శైలజానాథ్తో ఉపయోగం లేదని సోనియా నిర్ణయానికి వచ్చారట. ఏదేమైనా మళ్లీ కిరణ్ కుమార్ ఏపీ రాజకీయాల్లో కీలకం కానున్నారనే వార్త‌లు వినిపిస్తున్నాయి.