Idream media
Idream media
లక్ష్య సాధన కోసం వ్యూహాలు పన్నడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎవరూ తీసిపోరు. తన తెగువ, వాక్చాతుర్యం, వ్యూహ రచన ద్వారా ఏకంగా రాష్ట్రాన్నే సాధించారు. ఏడేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. రెండు పర్యాయాలు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధించారు. సర్కారుపైనా, పార్టీపైనా వ్యతిరేకత వస్తోందని ఏ మాత్రం అనిపించినా వెంటనే రంగంలోకి దిగిపోతారు. తన మాటల ద్వారా వేడి రగిలిస్తారు. విపక్షాలకు షాక్ ఇస్తారు. తన రాజకీయ చతురతతో జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో గెలుపు కోసం వ్యూహకర్త కోసం చూస్తున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. పీకే టీం ముఖ్యమంత్రి కార్యాలయంలో కనిపించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ బృందం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో సందడి చేసింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది. ప్రశాంత్ కిషోర్ టీమ్‌తో కేసీఆర్ పని చేయనున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజగా ప్రగతిభవన్‌లో ఐప్యాక్ ప్రతినిధులతో టీఆర్ఎస్ నేతలు సమావేశం కావడం ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారింది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో మారుతున్న తాజా జాతీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజల అభిప్రాయాలు, సంక్షేమ పథకాలపై ఐప్యాక్ సర్వే చేయనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ను ప్రజల్లో బాగా ఫోకస్ చేసే పనిలో ఐ ప్యాక్ బృందం నిమగ్నమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. లేదా జాతీయ రాజకీయాల నేపథ్యంలో భేటీ అయి ఉంటారన్న ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి.
ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అంటూ అధికార పార్టీకి సవాళ్లు విసురుతోంది. అన్నట్లుగానే ఒక్కో ప్రాంతంలో విస్తరిస్తూ పోతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్.. పీకే టీంతో భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో కొత్త ఊహాగానాలకు తెరలేపింది. పీఏసీ నుంచి వచ్చిన టీమ్, పోల్ మాంత్రికుడు ప్రశాంత్ కిషోర్ నడుపుతున్న టీమ్.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనుకుంటున్న టీఆర్ఎస్‌కు అవసరం చాలా ఉంది. కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలోని ఓటర్ల మానసిక స్థితిని అంచనా వేసేందుకు ఐపాక్ సభ్యులు సర్వేలు చేయాలని సూచించారని ప్రచారం జరుగుతోంది.
ఎన్నికలు జరిగేందుకు ఇంకా ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. తమ ప్రభుత్వానికి ఆదరణ తగ్గుతోందని ఆందోళన చెందుతున్నారని చెబుతున్న కేసీఆర్.. తన వైఫల్యాలకు గల కారణాలను అర్థం చేసుకోవాలన్నారు. అధికార వ్యతిరేకత మరింత వేగం పుంజుకుంటోందని భావిస్తున్న తరుణంలో పీకే టీమ్ సర్వే టీఆర్‌ఎస్‌కు ఎంతగానో కలిసిరానుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను నిశితంగా విమర్శిస్తూ, దాని విధానాలను ప్రశ్నిస్తున్నారు. టీఆర్‌ఎస్ కు ఇంటా, బయటా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన కనిపెట్టారు.అలాగే. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలియాల్సి ఉంది.
నిజానికి కొంతకాలం క్రితం ప్రశాంత్ కిషోర్ తో కేటీఆర్ సమావేశమయ్యారు. మహారాష్ట్రలో శరద్ పవార్‌తో పీకే హై ప్రొఫైల్ సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ సమావేశం జరిగింది. అప్పటి నుంచి ఆయన సేవలను టీఆర్‌ఎస్ అభ్యర్థించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంకో విషయమేమిటంటే, వైఎస్ షర్మిలకు ఇప్పుడు పీకే టీమ్ మెంబర్ ప్రియా సలహాలు, సహాయం చేస్తున్నారు. పీకే స్వయంగా కేసీఆర్‌కు సలహా ఇస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అలాగే కేసీఆర్ కు ఒకరి సలహాలు అవసరం లేదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. మరి ఏం జరగనుందో వేచి చూడాలి.
Also Read : Janareddy- జానారెడ్డి వారసులు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటారా?