iDreamPost
android-app
ios-app

ముఖ్యమంత్రి అనుకున్నదొక్కటి..! అయిందొక్కటి..!!

ముఖ్యమంత్రి అనుకున్నదొక్కటి..! అయిందొక్కటి..!!

కేంద్ర బడ్జెట్‌ను చూసిన తర్వాత మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. దేశ భవిష్యత్‌ కోసం కొత్త రాజ్యాంగం కావాల్సిన సమయం వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, బడ్జెట్‌లో రైతులు, దళితులు, గిరిజనుల సంక్షేమం మరిచారంటూ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు. అరకొరగా వనరులు ఉన్న దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. అన్ని వనరులు ఉన్నా మన దేశం మాత్రం వెనకబడిపోతోందన్నారు.

నాలుగు లక్షల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంటే.. రెండు లక్షల మెగా వాట్ల విద్యుత్‌ మాత్రమే వినియోగిస్తున్నామని, నదీ జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నామని, నదీ జలాలను సరైన విధంగా వినియోగించుకుంటే 40 కోట్ల ఎకరాలకు సాగునీరు అందింవచ్చని చెప్పారు. 75 ఏళ్ల తర్వాత కూడా దేశ బడ్జెట్‌ 40 లక్షల కోట్ల రూపాయలు దాటకపోవడం సిగ్గుచేటని కూడా అన్నారు. ఈ విషయాలపై దేశ యువత ఆలోచించాలని, చర్చ జరగాలంటూ కేసీఆర్‌ తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లోనూ మాట్లాడారు. తద్వారా తాను మాట్లాడే మాటలు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అర్థం కావాలనేది కేసీఆర్‌ లక్ష్యం.

సరైన సమయంలో.. రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌.. దేశ వ్యాప్తంగా తన గురించి చర్చ జరగాలని భావించారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నాలను కేసీఆర్‌ ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. పాలన సరిగా చేయడంలేదని, బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వాలు రావాలని చెబుతున్నారు. అన్ని సందర్భాల్లోనూ కేసీఆర్‌ సహజ వనరులు, విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగం, నదీ జలాల లభ్యత, సాగు భూమి.. అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఈ సారి కూడా అవే మాటలు కేసీఆర్‌ మాట్లాడారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ.. దేశం అభివృద్ధి చెందాలంటే కొత్త రాజ్యాంగం కావాలంటూ వ్యాఖ్యానించారు.

Also Read : వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌కు 95 నుంచి 105 : కేసీఆర్ చేతిలో ఉన్న ఆ మంత్రదండం ఏంటో?

అయితే కేసీఆర్‌ అనుకున్నది ఒకటైతే.. జరుగుతోంది మరొకటి. సహజ వనరుల లభ్యత, పరిపాలన, దళితులు, గిరిజనుల వెనుకబాటు, రైతుల బతుకులు మారేందుకు కొత్త రాజ్యాంగం కావాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ కొత్త రాజ్యాంగం కావాలంటే.. అది కాస్త.. మిస్‌ఫైర్‌ అయింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఈ తరహాలో మాట్లాడితే.. మొదటికే మోసం వచ్చింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రద్దు చేయాలంటారా..? కొత్త రాజ్యాంగం రాయాలంటారా..? అంటూ తెలంగాణలోని దళిత సంఘాలు, దళిత నేతలు, దళిత విద్యార్థి సంఘాల నేతలు కేసీఆర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తూ నినాదాలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, అంబేద్కర్‌ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

ఇక ప్రతిపక్షాలు కూడా కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నాయి. రాజ్యాంగాన్ని రద్దు చేసి, దళితులు, గిరిజనులకు ఉన్న రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్న బీజేపీ.. తన ఆలోచనను కేసీఆర్‌ ద్వారా చెప్పించిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని మార్చాలని చూసి భంగపడింది.. ఇక కేసీఆర్‌ ఎంత..? అంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. కొత్త రాజ్యాంగం కావాలంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా భీమ్‌ దీక్షలను బీజేపీ చేపట్టింది. దళిత కవి కంచె ఐలయ్య, రిటైర్ట్‌ ఐపీఎస్, బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సహా పలువురు దళిత నేతలు కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయం అంతా కేసీఆర్‌ కొత్త రాజ్యాంగం వ్యాఖ్యల చుట్టూనే తిరుగుతోంది. జాతీయ స్థాయి రాజకీయాల్లో ఆరంగేట్రం చేసేందుకు కేసీఆర్‌ చేసిన ప్రయత్నాలు ఆ దిశగా సాగకపోగా.. సొంత రాష్ట్రంలోనే దళిత సామాజికవర్గంలో వ్యతిరేకతను తెచ్చేలా పరిణామాలు మారడం కేసీఆర్‌ను ఇరుకునపెడుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే.. కొత్త రాజ్యాంగం వ్యాఖ్యలపై కేసీఆర్‌ స్పష్టత ఇవ్వాలేమో..!

Also Read : రేవంత్ లో ఇంత మార్పా…?కేసిఆర్ మీద కోపమా? మోడీ మీద ప్రేమనా?