iDreamPost
iDreamPost
కాంగ్రెసులో సంస్థాగత మార్పుల దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. రెండు రోజుల క్రితం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సోనియా, రాహుల్, ప్రియాంకలతో మంతనాలు జరిపిన తర్వాత ఇవి మరింత వేగం పుంజుకున్నాయి. ఈ నెల 19 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనుండటం, ఏడు నెలల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నందున పలు మార్పులకు పార్టీ అధిష్టానం సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం పీకేతో భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎవరుండాలన్న మీమాంసకు పరిష్కారం లభించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పంజాబ్ సంక్షోభాన్ని సర్దుబాటు చేసే రాజీ ఫార్ములానూ ఖరారు చేశారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ గా కమల్ నాథ్
తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమలనాథ్ పేరు ఖరారు చేశారు. గురువారం ఉదయం ఆయన సోనియాతో సమావేశమై గంటకుపైగా చర్చలు జరిపారు. ప్రశాంత్ కిశోర్ సూచన మేరకు ఆయన పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను కాంగ్రెసే సమన్వయం చేయాల్సి ఉంటుందని.. ఇందుకు కమలనాథ్ సమర్థుడని మొన్నటి భేటీలో పీకే పేర్కొన్నారు. అన్ని పార్టీల నేతలతోనూ కమల్ కు సత్సంబంధాలు ఉన్నాయని.. ఆయనే ఆ పని చేయగలరని చెప్పడంతో దానికి ఓకే చేశారు. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ పూర్తి స్థాయి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తారు.
Also Read : వివేక్ వెంకటస్వామి పార్టీ మారడం లేదట..! అదంతా ఫేక్ ప్రచారమట..!
మరోవైపు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా, లోకసభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరిస్తారు. దీనికి ఆయన అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజాన్ చౌదరి పెద్ద ప్రభావం చూపకపోవడం, రెండు పదవులు నిర్వహిస్తుండటాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన్ను పార్లమెంటరీ నేత పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు. ఈ మార్పులపై ఈరోజో రేపో అధికారిక ప్రకటన వెలువడనుంది.
సిద్ధూకు పంజాబ్ పీసీసీ పగ్గాలు
మరోవైపు పంజాబ్ కాంగ్రెసులో గత కొన్నాళ్లుగా చెలరేగుతున్న అసమ్మతిని చల్లార్చేందుకు పార్టీ అధిష్టానం ఎట్టకేలకు రాజీ ఫార్ములా రూపొందించింది. దీని ప్రకారం అసమ్మతి నేత నవజ్యోత్ సిద్ధూను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తారు. సీఎం అమరీందర్ సింగ్ తన పదవిలోనే కొనసాగుతారు. ఏఐసీసీ పంజాబ్ రాష్ట్ర ఇంచార్జి హరీష్ రావత్ ఈ విషయం చెప్పారు. బుధవారం సాయంత్రం రాహుల్, ప్రియాంకలతో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారికంగా ఈ నియామకాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తామని రావత్ వెల్లడించారు.
గత కొన్ని నెలలుగా సీఎం అమరీందర్, మాజీమంత్రి సిద్ధుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తరచూ సీఎంను, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా సిద్ధూ వ్యవహరిస్తున్నారు. ఇటీవల తలెత్తిన విద్యుత్ సంక్షోభంలోనూ ఉచిత విద్యుత్ ఇస్తామన్న కేజ్రీవాల్ ప్రకటనకు మద్దతుగా మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రావత్ సిద్ధూను సుతిమెత్తగా హెచ్చరించారు. రాష్ట్ర భవిష్యత్తు సిద్ధూ అని.. అందువల్ల మాటలు, చేతల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలను వీరిద్దరి నాయకత్వంలో ఎదుర్కొంటామని చెప్పారు.
Also Read : జగన్ పాలన గొప్పగా ఉంది.. బాబు మాటలతో ..