iDreamPost
android-app
ios-app

వైసీపీ సీనియర్‌ నేతతో బంధుత్వం.. ఆ మాజీ ఎమ్మెల్యేకు కలిసి రాబోతోందా..?

వైసీపీ సీనియర్‌ నేతతో బంధుత్వం.. ఆ మాజీ ఎమ్మెల్యేకు కలిసి రాబోతోందా..?

వియ్యంకులు అయిన ప్రజా ప్రతినిధులకు తెలుగు రాష్ట్రాల్లో కొదవలేదు. ఈ బంధుత్వాలు ఆయా నేతల రాజకీయ పయనానికి కూడా బాగానే ఉపయోగపడ్డాయి. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణతో ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు వియ్యం అందుకున్నారు. తన తమ్ముడి కుమార్తెను బొత్స కుమారుడికి ఇచ్చి వివాహం చేయడం ద్వారా బొత్సతో కదిరి బాబూరావుకు బంధుత్వం కలిసింది. ఇప్పటికే కదిరి బాబూరావు, వైసీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యలు వియ్యంకులు.

2019 ఎన్నికల తర్వాత కదిరి బాబూరావు వైసీపీలో చేరారు. కదిరి బాబూరావు రాజకీయ ప్రయాణం టీడీపీతో మొదలైంది. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో బాబూరావుకు మంచి స్నేహం ఉంది. ఆ స్నేహమే కదిరి బాబూరావుకు టీడీపీలో కలిసి వచ్చింది. కనిగిరి నియోజకవర్గానికి చెందిన కదిరి.. తొలిసారి 2004లో దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఆదినుంచి ఆయన కనిగిరి టిక్కెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే కనిగిరిలో సీనియర్‌ నేత, మాజీ మంత్రి, జెడ్పీ మాజీ చైర్మన్‌ అయిన ముక్కు కాశిరెడ్డి ఉండడంతో కదిరికి అవకాశం దక్కలేదు. టీడీపీ ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్న కాశిరెడ్డి.. సైకిల్‌పార్టీకి తొలి ఎన్నికలైన 1983 నుంచి 2004 వరకు ఆ పార్టీ అభ్యర్థిగా నిలిచారు. తన గురువు, టీడీపీ జిల్లా అధ్యక్షుడైన ఇరిగినేని తిరుపతి నాయుడు 1985లో టిక్కెట్‌ కోసం పోటీ వచ్చినా.. సామాజిక సమీకరణాలతో కాశిరెడ్డికే టిక్కెట్‌ దక్కింది. టీడీపీలో టిక్కెట్‌ రాకపోవడంతో 1985లో ఇరిగినేని తిరుపతి నాయుడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా మారారు. అప్పటి నుంచి 2004 వరకు వారిద్దరూ కనిగిరిలో తలపడ్డారు. 1983, 85, 94 ఎన్నికల్లో కాశిరెడ్డి గెలవగా.. తిరుపతి నాయుడు 1989, 1999, 2004లో గెలిచారు.

కనిగిరి టిక్కెట్‌ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న కదిరి బాబూరావుకు 2009లో అవకాశం దక్కింది. అంతకు ముందు రెండు ఎన్నికల్లో ముక్కు కాశిరెడ్డి ఓడిపోవడం, టీడీపీ ప్రభుత్వ హయాంలో జెడ్పీ చైర్మన్‌గా పని చేసిన కాలంలో ఉన్న పరపతి తగ్గేలా కాశిరెడ్డి పని చేయడం కదిరి బాబూరావుకు కలిసి వచ్చింది. వీటికి తోడు బాలకృష్ణ మద్ధతు కూడా ఉండడంతో కదిరికి 2009లో కనిగిరి టిక్కెట్‌ దక్కింది. టిక్కెట్‌ దక్కినా దురదృష్టం కదిరిని వెంటాడింది. పరిశీలనలో నామినేషన్‌ చెల్లకుండా పోయింది. ఆ సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన తన బంధువు సుంకర మధుసూధన్‌రావు (ఉంగరం గుర్తు)కు మద్ధతు ఇచ్చి.. కాంగ్రెస్‌ అభ్యర్థి ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి ముచ్చెమటలు పోయించారు. భారీ మెజారిటీతో గెలుస్తాడని భావించిన ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కేవలం 2,935 ఓట్ల స్వల్ప మెజారిటీతో చావు తప్పి కన్ను లొట్టపోయిన మాదిరిగా బయటపడ్డారు.

Also Read : వైభవంగా బొత్స కుమారుడి వివాహం.. వియ్యంకులైన వైసీపీ నేతలు.. హాజరైన జగన్‌

2014లో మరోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కదిరి బాబూరావు ఈ సారి విజయవంతంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూధన్‌ యాదవ్‌పై గెలిచారు.

2019 ఎన్నికలకు వచ్చే సరికి టీడీపీలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. వైసీపీలో టిక్కెట్‌ కోసం ప్రయత్నించిన ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి అది దక్కకపోవడంతో టీడీపీలో చేరారు. దర్శి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న శిద్ధా రాఘవరావు ఒంగోలు లోక్‌సభకు వెళ్లాల్సి రావడంతో దర్శిలో అభ్యర్థి కొరత ఏర్పడింది. కనిగిరి టిక్కెట్‌ కోసం కదిరి బాబూరావు, ఉగ్రనరసింహారెడ్డిల మధ్య పోటీ ఏర్పడింది. ఉగ్రను దర్శికి పంపేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. కానీ సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని ఉగ్రకు కనిగిరి టిక్కెట్‌ ఇచ్చారు. కనిగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కదిరి బాబూరావును దర్శికి పంపారు. బాబు లెక్కలు తప్పాయి. రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ, ఒంగోలు లోక్‌సభ స్థానంలోనూ టీడీపీ ఓడిపోయింది.

2019 ఎన్నికల తర్వాత కదిరి బాబూరావు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. సొంత అవసరాల కోసమే ఆయన పార్టీ మారారని అందరూ భావించారు. ఎన్నికల నాటికి మళ్లీ టీడీపీకే వెళతారని అనుకున్నారు. బాలకృష్ణతో ఉన్న స్నేహం.. ఈ సందేహాలకు తావిచ్చింది. అయితే కదిరి బాబూరావు మాత్రం వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2024లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అందుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

ముత్యాల వ్యాపారం చేసే కదిరి బాబూరావు ఆర్థికంగా స్థితిమంతుడు. 2009 నుంచి 2019 వరకు టీడీపీలో నియోజకవర్గ ఇంఛార్జిగా, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నేతలు, కార్యకర్తలు తమ జేబులోని రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేకుండా.. పార్టీని నడిపించారనే పేరుంది. అది కదిరి బాబూరావుకు నేతలు, కార్యకర్తల్లో మంచి పేరు తెచ్చింది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయనపై ఎలాంటి విమర్శలు, అవినీతి ఆరోపణలు కూడా లేకపోవడం, వివాదరహితుడుగా, సౌమ్యుడుగా పేరొందడం, వైసీపీ సీనియర్‌ నేతలైన సి. రామచంద్రయ్య, బొత్స సత్యనారాయణలతో బంధుత్వం కదిరి బాబూరావుకు కలిసి వస్తుందని భావిస్తున్నారు.

Also Read : కనిగిరిలో పట్టు కోసం ఆ మాజీ ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలు ఫలించేనా..?