iDreamPost
iDreamPost
ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థ వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటే ఏమవుతుందో ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ లో బహిర్గతమయింది. ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యవస్థలు తమ హద్దులు లేదా పరిధులు దాటనంతవరకూ అన్నీ సవ్యంగానే ఉన్నట్టు కనిపిస్తాయి. మితిమీరి, హద్దులు దాటి ఒక వ్యవస్థ మరోవ్యవస్థపై దాడి చేస్తే ప్రతిదాడి ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూపించారు.
జగన్మోహన్ రెడ్డి గత యేడాది బాధ్యతలు స్వీకరించిన నాటినుండి నేటి వరకూ ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు కొంత భిన్నంగానే వ్యవహరిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ ప్రత్యర్థిగా పనిచేస్తోంది. ఈ యేడాదిన్నర కాలంలోనే రాష్ట్రంలో సాధారణ ప్రజలు కూడా న్యాయవ్యవస్థ గురించి, న్యాయమూర్తుల గురించి చర్చ చేయడం మొదలుపెట్టారంటే, న్యాయమూర్తులు కూడా రాజకీయంగా పనిచేస్తున్నారని, కొందరు న్యాయమూర్తులకు పూర్వాశ్రమంలో రాజకీయ నేపధ్యం ఉన్నదని చర్చించడం మొదలు పెట్టారు అంటేనే రాష్ట్రంలో న్యాయవ్యవస్థ పరిధి దాటి ఎంత ముందుకు వెళ్ళిందో అర్ధమవుతుంది.
రాష్ట్రంలో కోవిడ్ సమయంలో ప్రజల్లో విస్తృతంగా తిరిగి కోవిడ్ నిబంధనలు అతిక్రమించారు అని కొందరు అధికార పార్టీ శాసనసభ్యులపై పిటిషన్ దాఖలయినప్పుడు తీవ్రంగా స్పందించిన కోర్టు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ సరిగ్గా ఇవే ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు, హైదరాబాద్ నుండి అమరావతికి భారీ ర్యాలీలో వచ్చారని, కోవిడ్ నిబంధనలు అతిక్రమించారని పిర్యాదు పిటిషన్ రూపంలో అందినప్పుడు ఇదే కోర్టు, అదే న్యాయమూర్తులు భిన్నంగా స్పందించడం, మొత్తం రెండు పిటిషన్లు కొట్టేయడం సదరు కోర్టు, న్యాయమూర్తుల రాజకీయ పక్షపాతం బహిర్గతం చేసింది.
అలాగే హై కోర్టు రిజిస్ట్రార్ మృతి చెందిన సమయంలో కోవిడ్ చర్యల్లో హై కోర్టు విఫలం అయిందని ఒక పిటిషన్ వేసినప్పుడు పిటిషన్ దారుకు రాజకీయ ఉద్దేశాలు, లక్ష్యాలు ఆపాదించిన కోర్టు, పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు వేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించడం, విచారణ సమయంలో రాజకీయ ప్రత్యర్థుల్లా న్యాయమూర్తులు ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేయడం ప్రజలు గమనించారు. అదొక్కటే కాదు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి స్థలం కేటాయించడంలో అక్రమాలున్నాయని పిటిషన్ వేసిన మంగళగిరి శాసనసభ్యుడిపై తీవ్ర రాజకీయ వ్యాఖ్యలు చేయడం కూడా ప్రజలు గమనించారు.
యేడాదిన్నరపాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయమూర్తులు చేస్తున్న రాజకీయ దాడిని మౌనంగా భరించారు. తెగేవరకు దేన్నీ లాగకూడదు అనే సామెతలాగా, గదిలోపెట్టి కొడితే పిల్లి కూడా పులి అవుతుందన్న సామెతలాగా ఇన్నాళ్లకు జగన్మోహన్ రెడ్డి ప్రతిదాడి మొదలుపెట్టారు. ప్రతిదాడిలో ఏకంగా న్యాయవ్యవస్థలో తన ప్రత్యర్థులెవరో ప్రస్ఫుటంగా తేల్చి చెప్పేశారు. న్యాయమూర్తుల పేర్లు, వారి రాజకీయ నేపధ్యం, సుప్రీం కోర్టు నుండి హై కోర్టు వరకూ వారిని రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయిస్తున్న శక్తుల పేర్లు ముఖ్యమంత్రి బహిర్గతం చేసేశారు.
తన ప్రత్యర్థుల పేర్లు బయట పెట్టడంలో కూడా జగన్మోహన్ రెడ్డి మంచి కసరత్తు చేసినట్టు కనిపిస్తోంది. పక్షం రోజుల క్రితమే ఆయన రెండు దఫాలుగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ను, వారం రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. అప్పుడే సదరు న్యాయమూర్తుల పేర్లు, వారి రాజకీయ నేపధ్యం, వారిచ్చిన తీర్పులు వరసపెట్టి వివరించి సాక్ష్యాలతో సహా వారికి అందించారు. ప్రధాన మంత్రి, హోం మంత్రి స్పష్టత ఇచ్చిన తర్వాతనే సదరు న్యాయమూర్తుల పేర్లు బహిర్గతం చేశారు.
ఇప్పుడు యుద్ధం మొదలయింది. న్యాయమూర్తుల రాజకీయ నేపధ్యం బయటపడింది. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్న పేర్లు చాలా వరకు తెలుగుదేశం పార్టీతోనో, పార్టీ ప్రభుత్వంతోనో ప్రత్యక్ష సంబంధాలు కలిగినవారే. అలాగే సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ పేరు కూడా బహిర్గతం చేస్తూ ఆయనకు టీడీపీతో ఉన్న సంబంధాలు కూడా వెల్లడి చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి రేసులో ఉన్న జస్టిస్ రమణపై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపణలు చేయడం చిన్నవిషయం కాదు. ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రికి శాసనసభలో 150 మంది సభ్యులున్నారు. అలాగే పార్లమెంటు ఉభయసభల్లో కలిపి 28 మంది సభ్యులున్నారు. ఈ 28 మంది పార్లమెంటు సభ్యులు తమ నేతకు, తమ పార్టీకి మద్దతుగా రేపు రాష్ట్రపతి భవన్ కు ప్రదర్శన చేస్తే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి.
ఇంతకాలం ఏకపక్షంగా రాజకీయ నేపథ్యంతో కొందరు న్యాయమూర్తులు సాగిస్తున్న పోరాటాన్ని జగన్మోహన్ రెడ్డి బహిర్గతం చేసి ప్రచ్ఛన్న యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు ఈ యుద్ధం సామరస్యంగా ముగియాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన పేర్లు గల న్యాయమూర్తులు తమ నిష్పాక్షికతను నిరూపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కూడా తన ఆరోపణలు నిరూపించుకోవడంతో పాటు న్యాయమూర్తులపై చర్యలకు గట్టి ప్రయత్నం చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యుద్ధాన్ని ఇరువర్గాలకు ఆమోదయోగ్యంగా ముగించాల్సి ఉంది. అలాగే రాజకీయ నేపధ్యం కలిగిన న్యాయమూర్తులపై చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంది.