iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతిపక్షాలు, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు , వారి సోషల్ మీడియా విభాగం అంతా కలిసి జగన్ కు మతం రంగు పులిమే ప్రయత్నం తీవ్రంగా చేశాయి. దీని కోసం హిందూ మనోభావాలు దెబ్బతినేలా గడిచిన ఏడాదిలోనే తిరుమల కేంద్రంగా పదుల సంఖ్యలో అవాస్తవాలతో కూడిన ప్రచారం విపరీతంగా చేసి రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం చేశారు. సీఎం జగన్ టార్గెట్ గా సాగిన మత వ్యతిరేక ప్రచారాన్ని వైసీపీ పార్టీ నేతలు, సానుభూతిపరులు ఎప్పటికప్పుడు వివిధ మార్గాల్లో సాక్ష్యాధారాలతో తిప్పికొడుతున్నా రోజుకో రకమైన వార్త పుట్టిస్తూనే ఉన్నారు.
గడిచిన ఏడాదిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో సాగించిన మత విద్వేష రాజకీయం సరిపోదన్నట్టు, గత కొద్ది కాలంగా సమాజంలో భాగమైన ఒక సామాజిక వర్గానికి జగన్ బద్ద వ్యతిరేకి అనే అభిప్రాయం , ప్రజలకు మరీ ముఖ్యంగా సదరు సామాజిక వర్గానికి చెందిన వారిలో కలిగేలా తెలుగుదేశం నేతలు , చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఆద్వర్యంలో నడిచే తెలుగుదేశం సోషల్ మీడియా విభాగం ప్రచారాన్ని తీవ్రతరం చేశాయి.
ఇందులో భాగంగానే ఆ వర్గ ప్రాభల్యం అధికంగా ఉన్న అమరావతి ప్రాంతంలో రాజధానిని ఉంచకుండా విశాఖకు తరలిస్తున్నారు. వారి ఆర్ధిక వనరుల పై దాడి చేస్తున్నారు. వారిని తీవ్రంగా వేధిస్తూ హింసిస్తున్నారు. జగన్ పాలనలో మా సామాజిక వర్గం వారు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు అంటూ బుచ్చయ్య చౌదరి లాంటి నేతల దగ్గర నుండి వారి సోషల్ మీడియా కార్యకర్తల వరకు అందరు ఒకే లైన్ లో మాట్లాడుతూ సదరు సామాజిక వర్గంలో జగన్ పై అపోహ పెంచాలనే లక్ష్యంతో విమర్శలు చేస్తూ వస్తున్నరు.
నిజంగా జగన్ వారిపై కత్తి కట్టి అమరావతిని రాజధానిగా ఉంచకుండా తరలిస్తున్నారా అని పరిశీలించి చూస్తే తెలుగుదేశం నేతలు చేస్తున్న కుల రాజకీయంలో ఉన్న డొల్లతనం బహిర్గతం అవుతుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు సమాంతరంగా అభివృద్ది బాట పట్టాలనే లక్ష్యంతో పని చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే అమ్మఒడి, ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి అనేక పధకాలు కులమత భేదంలేకుండా అందిస్తున్నారు.
అలాగే రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ 5ఏళ్ళు అధికారం చేపట్టినా ఇంకా మౌళిక సదుపాయాలు కూడా లేని అమరావతి కేంద్రంగా అభివృద్ది కేంద్రీకృతం చేస్తూ మాట్లాడితే, రాష్ట్రానికి రాజధాని అని చెప్పుకునేలా ఆ ప్రాంతం అభివృద్ది అయ్యే నాటికి రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయి ఉంటాయని, ఆ పరిస్తితుల్లో మరో విభజన ఉధ్యమానికి భీజం పడినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని తలంచి, ఇప్పటికే అభివృద్ది చెందిన విశాఖలో పరిపాలన, వెనకబడిన రాయలసీమ ప్రాంతమైన కర్నూల్ లో న్యాయ శాఖ , ఇప్పుడు ఉన్న అమరావతి ప్రాంతాన్ని శాసన రాజధానిగా ఎంపిక చేసుకున్నారు. విభజన వలన నష్టపోయి లోటుబడ్జెట్లో ఉన్న సమయంలో అమరావతిలో కర్చు చేసే ధనంలో పావు వంతు విశాఖలో పెడితే ముంబై , హైద్రబాద్, చెన్నై , బెంగుళూరు లాంటి మహానగరాలతో పోటీ పడే స్థాయికి అతి కొద్ది సమయంలోనే విశాఖ చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని చేసిన ఈ ఆలోచనను తెలుగుదేశం నేతలు విభేధించి కులం రంగు అంటించటానికి ముఖ్య కారణం అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి రాజధాని పేరున కొల్లగొట్టిన భూముల విలువను కాపాడుకోవడానికే అనేది సుస్పష్టం , నిజంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న జగన్ కులం కోణంలోనో, రాజకీయ కోణంలోనో ఆలోచించి ఉంటే రాజధానిని గడచిన ఎన్నికల్లో తన పార్టీకి అన్ని స్థానాలు కట్టబెట్టిన కడపకో , నెల్లూరుకో , ప్రకాశం జిల్లాకో తరలించేవారు కానీ తన పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కకుండా మొత్తం తెలుగుదేశం కైవసం చేసుకున్న విశాఖ నగరానికి ఎందుకు తరలిస్తారు అనేది ప్రాధమిక ప్రశ్న.
అలాగే కులం కోణంలో చూసుకున్నా అమరావతి ప్రాంతంలో మాదిరే విశాఖలో కూడా సదరు సామాజిక వర్గం వారి ప్రాభల్యం ఎక్కువ అనేది కాదనలేని సత్యం , విద్యా సంస్థల దగ్గరనుండి వ్యాపార సదుపాయల వరకు విశాఖలో అన్నిట్టా వారి ఆధిక్యత ఉన్నది. ఉదాహరణకు, విశాఖలో ఉన్న డాల్ఫిన్, దస్పల్లా , నోవోటెల్ లాంటి పేరు మోసిన స్టార్ హోటల్స్ అన్ని ఆ సామాజిక వర్గం వారికి చెందినవే. గీతం లాంటి ప్రతిష్టాత్మకమైన విద్యాలయాలు వారికి చెందినవే, సినిమా హాళ్లలో 60% వారివే, స్టూడియోలు, హాస్పిటల్లు అంటూ అనేక వ్యాపారాల్లో 50% విశాఖలో వారివే అనేది కాదనలేని సత్యం.
ఇక రాజకీయంగా చూసుకున్న జగన్ చుట్టు ఉన్నవారిలో కొడాలి నాని , అబ్బయ్య చౌదరి, లావు కృష్ణదేవరాయలు లాంటి నేతలు ఆ సామాజిక వర్గం వారే , విశాఖకు రాజధాని మారిస్తే వారు రాజకీయంగా వెనకబడతారు అనుకున్నా , విశాఖ ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న వారిలో పురందేశ్వరీ, కంభంపాటి హరిబాబు, సత్యనారయణ, గోల్డ్ స్పాట్ మూర్తి లాంటి అత్యధికులు ఆ సామాజిక వర్గం వారే. ఇలా విశాఖలో అత్యధిక ప్రభావం చూపుతున్న వారు సదరు వర్గానికే చెందిన వారు కాగా అక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్న జగన్ లో వారి కులం పై ద్వేషం ఉందో, లేక రాష్ట్ర భవిష్యత్తు పై ఆశ ఉందో తెలుగుదేశం నేతలే చెప్పాలి.
బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్లు సైతం జగన్ కు కులం రంగు పూయాలని చూడటం సోచనీయం , సంక్షేమ పధకాల పరంగా , పాలనా పరంగా జగన్ తో పోటీ పడలేని తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ కు కులం మతం అంటగడుతూ , సమాజాన్ని విచ్చిన్నం చేసే రుగ్మతలను వాడుకుంటూ రాజకీయానికి తెరలేపడం ఆపార్టీలోని కుటిల నీతికి నిదర్శనంగా చెప్పవచ్చు. విధానపరమైన సహేతుకమైన విమర్శలను ప్రజలు స్వాగతిస్తారు కానీ తాత్కాలిక స్వలాభం కోసం చేసే విద్వేష రాజకీయాలు ప్రజలెప్పటికి హర్షించరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలుసుకుంటేనే ఆ పార్టీ మరికొంతకాలం మనుగడ సాదించగలుగుతుంది. ఇప్పటికైనా తెలుగుదేశం తమ విధానాలు మార్చుకుంటుందో లేదో వేచి చూడాలి.