Idream media
Idream media
రెండు నెలల నుంచి మా ఎన్నికలు ఏ మలుపు తిరుగుతాయి ఏంటీ అనేది అందరూ ఆసక్తిగా చూసారు. ఈ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ స్వయంగా రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా హీట్ పెరిగింది. ఎన్నడు లేని విధంగా తెలుగు మీడియా చేసిన హడావుడి, సోషల్ మీడియాలో గతంలో కంటే ఇప్పుడు క్రేజ్ పెరగడం, మంచు విష్ణు వర్సెస్ ప్రకాష్ రాజ్ గా పరిస్థితిని మరింత హీట్ ఎక్కించడంలో సోషల్ మీడియా చేసిన కృషి… అన్నీ కూడా మా ఎన్నికల్లో అసలు ఏం జరుగుతుంది అనే ఆసక్తి పెరిగిపోయింది.
ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీకి దిగగా… ఆయనను నాన్ లోకల్ అంటూ చేసిన ప్రచారం… మంచు విష్ణు కి కలిసి వచ్చింది. ఇక నిన్న జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఓటమి తర్వాత ప్రకాష్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రాంతీయ వాదానికి జాతీయ వాదానికి మధ్య జరిగిన ఎన్నిక ఇది అని ఆయన అన్నారు. అతిథిగా వచ్చా అతిథిగానే ఉండాలని నిర్ణయించుకున్నాను అని నా తల్లిదండ్రులు తెలుగు వారు కాదు అని పేర్కొన్నారు. మ్యానిఫెస్టోను విష్ణు అమలు చేయాలి అన్నారు ప్రకాష్ రాజు. గెలిచిన విజేతలకు అభినందనలు చెప్పారు.
మా ఎన్నికలు సజావుగా జరిగాయన్న ఆయన… తెలుగువాడిగా పుట్టకపోవడం దురదృష్టకరం అని ఆవేదనగా మాట్లాడారు. అసోసియేషన్ నుంచి నేను బయటకు వచ్చాను అన్నారు. ఇలాంటి అసోసియేషన్ లో నేనుండలేను అని అన్నారు. మా అసోసియేషన్ లోకి రాజకీయాలు వచ్చాయి అని అలాంటి చోటు నేనుండలేను అంటూ వ్యాఖ్యలు చేసారు. మీ అందరూ ఎలా చూడాలనుకుంటే అలా చూడండి అంటూ అలాంటి వాతావరణంలో నేనుండలేను నేను అబద్ధాలు చెప్పను అని వ్యాఖ్యలు చేసారు.
నన్ను నా నిర్మాతల నుంచి దర్శకుల నుంచి దూరం చేయలేరు అని పేర్కొన్నారు. నా ప్రేక్షకుల నుంచి దూరం చేయలేరు అని వ్యాఖ్యానించారు. తెలుగు వాడిగా పుట్టక పోవడం నా తప్పు కాదు నా తల్లిదండ్రుల తప్పు కాదు అని ఐ యామ్ నాట్ ఏ విక్టిమ్ అంటూ వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవం ఉంటుంది కదా… ఇలాంటి అసోసియేషన్ లో ఉండలేను అంటూ రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆయన.
వాస్తవానికి కొన్ని దశాబ్దాలుగా ప్రకాష్ రాజ్… తెలుగు సినిమాలో కీలక పాత్రల్లో తనదైన ముద్ర వేసిన నటుడు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఈ విధంగా రాజీనామా చేయడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గెలుపు ఓటములు సహజం అయినప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఏం ఉంటుంది అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రకాష్ రాజ్ ఇక తెలుగులో సినిమాలు చేసే అవకాశం లేదనే అభిప్రాయం కూడా కొంత వరకు వినపడుతుంది. మెగా ఫ్యామిలీ మద్దతు ఉంది కాబట్టి ఏ ఇబ్బంది లేదనే వాళ్ళు ఉన్నారు. రెండేళ్ళ క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బెంగలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.