Idream media
Idream media
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఏడు జడ్పీటీసీ స్థానాలనే గెలుచుకుంది. ఇందులో ఒకటి వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోనిది. నియోజకవర్గంలోని గోపవరం జడ్పీటీసీని టీడీపీ గెలుచుకోవడం అందరిలోనూ ఆసక్తిని రేపింది. సాధారణంగా అయితే ఈ విషయానికి పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ దసరా తర్వాత బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ తరుణంలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఏడు జడ్పీటీసీ స్థానాలను వైసీపీ గెలిచినా.. గోపవరం మండలంలో మాత్రం టీడీపీ జెండా ఎగరడంతో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
Also Read:హెరాయిన్ కేసులో నిందితుడు సుధాకర్ ఎవరు?అతని వెనక ఎవరున్నారు?
గోపవరం జడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ తరఫున కలువాయ జయరామిరెడ్డి, వైసీపీ తరఫున నారపురెడ్డి వేణుగోపాల్ రెడ్డిలు పోటీ చేశారు. మండలంలో మొత్తం 10,058 ఓట్లు ఉండగా.. 9,700 ఓట్లు పోలయ్యాయి. జయరామిరెడ్డికి 4,779 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి వేణుగోపాల్ రెడ్డికి 4,680 ఓట్లు పోలయ్యాయి. జయరామిరెడ్డి 99 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఇక్కడ వైసీపీ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వేణుగోపాల్ రెడ్డి ఒంటరి పోరాటం చేశారు. నాయకుల నుంచి మద్ధతు కరువైంది. వీటితోపాటు గెలుస్తామనే ధీమాతో వైసీపీ క్యాడర్ ఎన్నికలను తేలిగ్గా తీసుకుంది. అందుకే స్వల్ప తేడాతో వైసీపీ ఓడిపోయింది. టీడీపీ అభ్యర్థి జయరామిరెడ్డి బలమైన నేత. 20 ఏళ్లుగా టీడీపీలోనే ఉన్నారు. ఏళ్ల తరబడి ఒకే పార్టీలో కొనసాగుతున్న జయరామిరెడ్డిపై సానుభూతి ఉంది. అది కూడా ఆయనకు ఈ ఎన్నికల్లో కలిసి వచ్చింది.
Also Read : వామ్మో తాడిపత్రిలో ఇంత మెజారిటీనా..? జేసీ వర్గంలో కలవరం
గోపవరం జడ్పీటీసీ ఎన్నిక ఫలితాన్ని ఏడు మండలాలు ఉన్న బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికతో ముడిపెట్టలేం. ఉప ఎన్నిక అంటేనే అనేక సమీకరణాలు తెరపైకి వస్తాయి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన జి.వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక జరగబోతోంది. ఆ కుటుంబంలోని వారికే మళ్లీ టిక్కెట్ దక్కే అవకాశం ఉంది. సానుభూతి కలిసి వస్తుంది. వైసీపీ పాలన, సంక్షేమ పథకాలు, జగన్.. ఇవన్నీ వైసీపీ అభ్యర్థికి కలసివచ్చే అంశాలు.
పైగా టీడీపీ నుంచి మళ్లీ ఓబుళాపురం రాజశేఖర్ పోటీలో చేయబోతున్నారు. 2014లో ఓడిపోయిన రాజశేఖర్.. ఈ ఎన్నికలపైనా ఏ మాత్రం ఆశలు పెట్టుకోలేదు. స్థానికంగా ఆయనకు బలం లేకపోవడం, గడిచిన రెండున్నరేళ్లలోనూ పట్టు సాధించేందుకు ప్రజల్లో తిరగకపోవడం టీడీపీకి ప్రతికూల అంశాలు. నెలకో, రెండునెలలకో పత్రికా ప్రకటనల ద్వారా పేపర్‌లో కనిపించే రాజశేఖర్‌కు.. పేపర్ నేత అనే పేరుంది.
మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఉప ఎన్నికల బాధ్యతలు తీసుకున్నా.. ఫలితంలో మార్పు ఉండకపోవచ్చు. ఆమెపై టీడీపీ స్థానిక నేతల్లోనే వ్యతిరేకత ఉంది. అధికారంలో ఉన్నప్పుడు విజయమ్మ క్యాడర్‌ను పట్టించుకోలేదు. ఒక వేళ రాజశేఖర్ గెలిచినా పెత్తనం విజయమ్మదే. కష్టపడి పని చేసినా.. విజయమ్మ ప్రాధాన్యత ఇస్తుందనే నమ్మకం తమ్ముళ్లలో లేదు. తిరుపతి లోక్‌సభ మాదిరిగా బద్వేలు ఉప ఎన్నిక కూడా జరుగుతుంది. ఎలాంటి సంచలనాలకు అవకాశం ఉండబోదు.
Also Read : తెలుగుదేశం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తుందా?