iDreamPost
iDreamPost
తెలుగుదేశం పార్టీ తరుపున మొన్నటి ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి విజయం సాధించిన గంటా శ్రీనివాసరావుకి ఓ ప్రత్యేకత ఉంది. ఈ మాజీ మంత్రి ఇప్పటివరకూ వరుసగా రెండు ఎన్నికల్లో ఒకే చోటు నుంచి పోటీ చేసిన అనుభవం లేదు. ప్రతీసారి తన స్థానం మార్చుకుంటూ రావడం ఆయనకు అలవాటు. తొలుత అనకాపల్లి ఎంపీ సీటు, ఆతర్వాత చోడవరం అసెంబ్లీ స్థానం , 2009లో అనకాపల్లి అసెంబ్లీ స్థానాల నుంచి ఆయన విజయం సాధించారు. 2014లో భీమిలి నుంచి అసెంబ్లీకి గెలిచారు 2019లో విశాఖ ఉత్తరం దిశగా మారిపోయారు. వచ్చే ఎన్నికల నాటికి కొత్త సీటు కోసం ఆయన అన్వేషణలో ఉన్నట్టు ప్రచారం మొదలయ్యింది.
వాస్తవానికి టీడీపీ తరుపున గెలిచిన గంటా శ్రీనివాసరావు ఆపార్టీకి దూరంగా ఉంటున్నారు. చివరకు స్వయంగా చంద్రబాబు ఆహ్వానించినా ఆయన పార్టీ సమావేశానికి హాజరుకాలేదు. అదే సమయంలో బీజేపీలో చేరేందుకు ఓ దశలో సిద్ధమయ్యారు. ఆపార్టీ కేంద్ర కార్యాలయం వరకూ వెళ్లి రామ్ మాధవ్ తో భేటీ అయివచ్చారు. కానీ ఏపీలో ఆపార్టీకి భవిష్యత్తు లేదని నిర్ధారించుకున్న తర్వాత వెనక్కి తగ్గారు. వైసీపీలో పలు రకాలుగా ప్రయత్నించారు.. దాదాపుగా ఆపార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్టు మీడియాకు లీకులు కూడా ఇచ్చారు. కానీ అధికార పార్టీలో మంత్రి అవంతి శ్రీనివాస్ సహా పలువురు నేతల తీవ్ర అభ్యంతరాల నడుమ గంటా ప్రవేశానికి ఆటంకాలు ఏర్పడ్డాయి.
చివరకు ఆయన వచ్చే ఎన్నికలనాటికి టీడీపీ తరపున ఉంటారా లేదా అనేది కూడా స్పష్టత లేదు. కానీ బరిలో దిగితే మాత్రం తనకు తూర్పుగోదావరి జిల్లా తుని అసెంబ్లీ స్థానం శ్రేయస్కరం అని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. తునిలో కాపు కులస్తుల సంఖ్య ఎక్కువ. గతంలో టీడీపీ పలుమార్లు గెలిచింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న దాడిశెట్టి రాజా వరుసగా రెండు సార్లు వైసీపీ తరుపున గెలిచారు. యనమల కుటుంబానికి మూడు ఎన్నికల్లో ఓటమి ఎదురయ్యింది. అయినప్పటికీ తునిలో తన పట్టు కోల్పోకుండా ఉండాలంటే గంటా ఎంట్రీకి మోకాలడ్డే దిశలో యనమల ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గంటా మాత్రం తుని లేదా గాజువాక మీద దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇటీవల విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్ధతుగా రాజీనామా చేస్తున్నట్టు చేసిన ప్రకటన వెనుక గాజువాక పరిధిలో ఉండే ఉక్కునగరం ఓటర్లను ప్రభావితం చేసే లక్ష్యంతోనే అన్నది కొందరి వాదన. ఏమయినా గంటా పయనం ఎటు అన్నది తేలకపోయినా ఆయన పోటీ చేసేది మరో కొత్త స్థానం కాబట్టి అది గాజువాకా, తునా అన్నది తేలాల్సి ఉంది.
Also Read : ‘గంటా’పై ఆశలు వదులుకున్న చంద్రబాబు..!