Idream media
Idream media
కరోనా కేసుల పెరుగుదలపై మద్రాసు హైకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేశంలో రెండో దశ కొవిడ్ వ్యాప్తికి ఈసీదే బాధ్యతని పేర్కొంది. అంతేకాదు.. ”ఎన్నికల అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలి. విధులను సక్రమంగా నిర్వహించడంలో వైఫల్యం చెందడంపై ప్రాసిక్యూట్ చేయాలి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పు కేవలం తమిళనాడుకే వర్తించదని, ఎన్నికలు జరిగిన, జరుగుతున్న ఐదు రాష్ట్రాలతో పాటు, పంచాయతీ, మున్సిపల్, ఉప ఎన్నికలు జరిగిన తెలుగు రాష్ట్రాలలోని పరిస్థితులకు కూడా అద్దం పడుతుందనే వాదన పెరుగుతోంది. ఇందుకు ఆయా ఎన్నికలకు ముందు, ఇప్పుడు కరోనా కేసుల సంఖ్యలే ఉదాహరణలని పరిశీలకులు భావిస్తున్నారు.
తెలుగురాష్ట్రాలలో నాలుగు నెలలుగా ఏదో రూపంలో ఎన్నికల హడావిడి కొనసాగుతూనే ఉంది. దేశంలో 56 స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ తో పాటు తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా విడుదలైంది. నవంబర్ 3న పోలింగ్ జరిగింది. అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్ 1 పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల సందర్భంగా భారీ స్థాయిలో ఆయా పార్టీల శ్రేణులు రోడ్డెక్కాయి. ముఖ్య నేతలు రావడంతో ర్యాలీలు, సభల పేరుతో జనసందోహం గుమిగూడింది. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. రెండు నియోజకవర్గాలకే అయినా, ఆ రెండూ సగానికి పైగా తెలంగాణలో విస్తరించి ఉన్నాయి. అయితే, ఈ ఎన్నికలలో బహిరంగ ప్రచారం భారీ స్థాయిలో లేకపోయినా.., పోలింగ్ రోజున మాత్రం అత్యధికంగా సంఖ్యలో జనం ఆయా కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఆ సంగ్రామం ముగిసిన వెంటనే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోరు మొదలైంది. ఇక ఈ ఎన్నిక అనంతరం వెలుగులోకి వచ్చిన కరోనా కల్లోలం తెలిసిందే. ఏకంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు సహా టీఆర్ఎస్ అభ్యర్థి, అధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు ఈ ఎన్నిక సందర్భంగానే కరోనా బారిన పడ్డారన్న వార్తలు వెల్లువెత్తాయి. ఇవన్నీ ఓ పరిశీలిస్తే కరోనా కేసులు పెరుగుదలకు ఎన్నికలే కారణమన్న వాదన నిజమనిపిస్తోంది. కేవలం జీహెచ్ ఎంసీ పరిధిలోనే ఈ నెల 25 రోజుల్లోనే 15, 648 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.
ఇక, ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి. నాలుగు నెలలుగా వరుసగా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం, ఈసీకి మధ్య జరిగిన రగడ కూడా తెలిసిందే. ఇప్పుడు న్యాయస్థానం పేర్కొన్న విధంగా పంచాయతీ పోల్స్ సందర్భంగా ఏపీ ప్రభుత్వం అదే విషయాన్ని ఆనాడే చెబుతూ వచ్చింది. ఎన్నికల వల్ల కేసులు పెరుగుతాయని, ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సరికాదని వాదించింది. అయినప్పటికీ నాటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పెడచెవిన పెట్టారు. ఇక అప్పటి నుంచీ వరుస ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. కొంత కాలంగా కనిపించని కేసుల నమోదు.. ఫిబ్రవరి అనంతరం చాప కింద నీరులా పెరుగుతూ వచ్చింది. 2021, ఫిబ్రవరి 15న అత్యల్పంగా 30 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా.. 2021, మార్చి మూడో వారం నుంచీ మళ్లీ కేసుల పెరుగుదల గణనీయంగా పెరిగింది. ఏప్రిల్ నుంచీ వేలల్లోకి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 22 నుంచి 10 వేలకు పైగానే కేసులు నమోదు అవుతున్నాయి. ఈ కేసుల సంఖ్య పెరుగుదలకు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక కూడా దోహదమనే ప్రచారం జరుగుతోంది. అయితే, సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఓ రకంగా మేలు చేసింది. పరిస్థితులను ముందస్తుగా గమనించి ఆయన ఈ ప్రచారంలో పాల్గొనకపోవడంతో మరిన్ని కేసులు పెరగకుండా దోహదపడిందని పలువురు భావిస్తున్నారు.
ఇలా ఎటు చూసినా, మద్రాసు న్యాయస్థానం పేర్కొన్నట్లుగా తెలుగు రాష్ట్రాలలో కూడా కేసుల పెరుగుదలకు, ఎన్నికలకు సంబంధం ఉందనేది కొట్టిపారేయలేం. ఇదిలాఉండగా రెండు రాష్ట్రాలలోనూ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. ఓట్ల లెక్కింపు రోజైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు సూచించింది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక సమర్పించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఆ రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాల ఉప ఎన్నిక లెక్కింపు కూడా మే 2న జరగనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా పోలింగ్ రోజున తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది