iDreamPost
android-app
ios-app

హమ్మా..ఈనాడు త‌న‌ఖా భాగోతం వెనుక అస‌లు క‌థ తెలుసా

  • Published Feb 08, 2022 | 2:28 AM Updated Updated Mar 11, 2022 | 10:19 PM
హమ్మా..ఈనాడు త‌న‌ఖా భాగోతం వెనుక అస‌లు క‌థ తెలుసా

ఈనాడులో బ్యాన‌ర్ క‌థ‌నం.. ఆ వెంట‌నే బాబు రాద్ధాంతం. అమ‌రావ‌తిలో ఏదో జ‌రిగిపోతోంద‌నే హ‌డావిడి. రాజ‌ధాని భూముల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌న‌ఖా పెట్టేస్తోందంటూ కొండంత రాగం. కానీ తీరా చూస్తే అస‌లు వ్య‌వ‌హారం సీఆర్డీయే ప‌రిధిలో జ‌గ‌నన్న టౌన్ షిప్ పేరుతో మ‌ధ్య‌త‌ర‌గ‌తికి ఇంటి వ‌స‌తి క‌ల్పించే ప్ర‌య‌త్నాన్ని స‌హించ‌లేనిత‌న‌మే క‌నిపిస్తోంది. గ‌తంలో పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇవ్వ‌డాన్ని కూడా వ్య‌తిరేకించి రాజ‌ధానిలో పేద‌ల‌కు సెంటు భూమి కూడా లేకుండా అడ్డుకున్న బ్యాచ్ ఇప్పుడు మ‌ద్య‌త‌ర‌గ‌తికి గృహ‌వ‌స‌తి ఏర్పాటు చేస్తున్నా జీర్ణం చేసుకోలేక‌పోతోంద‌ని స్ప‌ష్ట‌మవుతోంది. అందుకు వేసిన స్కెచ్ లో భాగంగానే అమ‌రావ‌తి భూముల త‌నాఖా అనే క‌థ‌ను ప్ర‌చారం చేసిన‌ట్టు క‌నిపిస్తోంది.

వాస్త‌వానికి మంగ‌ళ‌గిరి ద‌గ్గ‌ర న‌వులూరు స‌మీపంలో విలువైన భూముల్లో ఏపీ ప్ర‌భుత్వం టౌన్ షిప్ నిర్మాణానికి పూనుకుంది. ఆ ప్రాంతంలో లింగ‌మ‌నేని, జ‌య‌భేరి వంటి సంస్థ‌లు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండ‌గా ప్ర‌భుత్వం మ‌ధ్య‌త‌ర‌గ‌తికి అవ‌కాశం క‌ల్పిస్తోంది. దానికి అనువుగా లే అవుట్ సిద్ధం చేసి ముందుకెళుతోంది. కొనుగోలుదారుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఉద్యోగుల‌కు ప‌ది శాతం స‌బ్సిడీపై అందిస్తుండ‌డం కూడా ఆక‌ట్టుకుంటోంది. ఈ ప్ర‌భుత్వ ప‌థ‌కం విజ‌య‌వంతం కావ‌డం స‌హించ‌లేని బాబు బ్యాచ్ కొత్త పాట అందుకుంది. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారానికి పోటీ వ‌స్తుంద‌ని భావిస్తున్న వారి ఒత్తిడితో ఈ కుట్ర‌కు పూనుకుంది. అందులో భాగంగా అమ‌రావ‌తి భూముల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌న‌ఖా పెడుతోంద‌నే ప్ర‌చారం ముందుకు తెచ్చింది. వాస్త‌వానికి ఇప్పుడు ఎంఐజీ వారికి ఇళ్ల‌స్థ‌లాలు ఇవ్వాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన భూముల‌ను చంద్ర‌బాబే త‌న‌ఖా పెట్టారు. 2016లోనే ఆయ‌న 145.50 ఎక‌రాల భూమిని హ‌డ్కోకి త‌నాఖా పెట్టి అప్పులు తీసుకున్నారు. ఇప్పుడా భూమిని గ‌జం రూ. 17,500 చొప్పున మ‌ధ్య‌త‌ర‌గ‌తికి అమ్మేందుకు ప్ర‌భుత్వం సిద్ధం కావ‌డంతో హ‌డ్కో వ్య‌వ‌హారం తెర‌మీద‌కు వ‌చ్చింది.

ఈ విష‌యంపై ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న చేసింది. సీఆర్డీయే త‌నాఖా పెట్టిన భూముల్లో రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ సాధ్యం కాదు కాబ‌ట్టి ప్ర‌త్యామ్నాయంగా గ‌తంలో స్టార్ట‌ప్ ఏరియాగా సింగ‌పూర్ క‌న్సార్షియం కోసం అప్ప‌గించిన 1700 ఎక‌రాల భూముల‌లో కొంత భాగంగా హ‌డ్కోకి త‌నఖా పెట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. మంద‌డం, ఉద్దండ‌రాయునిపాలెం, అనంత‌వ‌రం గ్రామాల ప‌రిధిలోని 397 ఎక‌రాల భూముల‌ని హ‌డ్కోకి త‌నాఖ పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యింది. త‌ద్వారా జాతీయ ర‌హ‌దారిని ఆనుకుని, ఎయిమ్స్ కి చేరువ‌లో ఖ‌రీదైన భూమిని మ‌ధ్య‌త‌ర‌గ‌తికి ఇవ్వాల‌ని సంక‌ల్పించింది. ఇప్ప‌టికే ఆ భూములు హ‌డ్కో వ‌ద్ద చంద్ర‌బాబు ప్ర‌భుత్వం త‌నాఖా పెట్టి ఉన్న త‌రుణంలో వాటిని విడిపించి, వాటికి ప్ర‌త్యామ్నాయంగా మ‌రో చోట భూముల‌ను త‌నాఖా పెట్టాల‌ని ఆలోచించింది. అంటే మ‌ధ్య‌త‌ర‌గ‌తికి, ఉద్యోగుల‌కు మేలు చేయాల‌ని జ‌గ‌న్ ఆలోచిస్తే దానిని కూడా నేరం అన్న‌ట్టుగా, అమ‌రావ‌తి భూముల‌ను అమ్మేస్తున్నార‌న్నంత‌గా ఈనాడు గ‌గ్గోలు మొద‌లెట్టింది.

ఆరేళ్ల క్రిత‌మే చంద్ర‌బాబు త‌నాఖా పెడితే రాష్ట్రాభివృద్ధి కోస‌మ‌న్న‌ట్టుగా భావించిన ఈనాడు ఇప్పుడు మాత్రం జ‌గ‌న్ వాటిని విడిపించి మ‌ధ్య‌త‌ర‌గ‌తికి ఇవ్వాల‌ని ఆలోచించ‌డం స‌హించ‌లేని స్థితికి ఈనాడు చేరింది.

ఈనాడు రాత‌లు ఎంత విద్వేష పూరితంగా ఉంటాయో ఈ ఒక్క వ్య‌వ‌హారం చాటుతోంది. కేవ‌లం త‌మ కుల‌స్తుల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పోటీగా, ప్ర‌భుత్వం అన్ని స‌దుపాయాల‌తో లే అవుట్ సిద్ధం చేయ‌డాన్ని స‌హించ‌లేక‌పోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. మ‌థ్య‌త‌ర‌గ‌తికి మేలు చేసేలా ప్ర‌భుత్వం తీసుకున్న చొర‌వ గిట్ట‌డం లేద‌న్న‌ట్టుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఈ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు అండ్ కో మాట‌లు మ‌రింత విడ్డూరంగా ఉన్నాయి. తామే త‌న‌ఖా పెట్టిన నాడు అభివృద్ధిగానూ, ఇప్పుడు వాటిని విడిపించి సామాన్యుల‌కు అప్ప‌గిస్తే గిట్ట‌క‌పోవ‌డం ఏంటో అర్థం కాదు. టీడీపీ తీరు ఎలా ఉందంటే ఉంటే గింటే తామే ఉండాలి, త‌మ కుల‌పోళ్లుండాలి గానీ ఇత‌రుల‌కు అవ‌కాశం ఎలా ఇస్తార‌ని ప్ర‌శ్నిస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. గ‌తంలో పేద‌ల‌కు ఇళ్ల‌స్థ‌లాలు కూడా ఇలానే అడ్డుకున్నారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ వంతు వ‌చ్చింది. ఈనాడు రాత‌ల మ‌ర్మం జ‌నాల‌కు అర్థంకాక‌పోతే ఆ ఉచ్చులో ప‌డే ప్ర‌మాదం ఉంటుంది.