iDreamPost
android-app
ios-app

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాష ఢిల్లీ సదస్సుకు వెళ్లారా..?

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాష ఢిల్లీ సదస్సుకు వెళ్లారా..?

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాష ఢిల్లీలో జరిగిన జమాత్‌ సదస్సుకు వెళ్లారు. అక్కడ నుంచి వచ్చిన మరుసటి రోజే ముస్లిం మత పెద్దలతో కలసి ఎన్‌పీఆర్‌ విషయంపై సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు.. ఇదీ మీడియాలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ.

ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జమాత్‌ సదస్సుకు వెళ్లి వచ్చిన వారిలో కొంత మందికి కరోనా వైరస్‌ సోకింది. రెండు రోజులుగా ఈ అంశంపైనే దేశంలోని అన్ని రాష్ట్రాలు హడలెత్తిపోతున్నాయి. ఏపీలో ఈ ఒక్కరోజే 17 మందికి పాజిటివ్‌ రాగా.. వారందరూ ఢిల్లీలోని జమాత్‌ సదస్సుకు వెళ్లి వచ్చిన వారే కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాష కూడా వెళ్లారు, ఆ తర్వాత సీఎంను కలిశారనే ప్రచారంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.

సదస్సు ప్రధాన సమావేశాలు జరిగే ముందు తొలి సమావేశాలకు డిప్యూటీ సీఎం అంజాద్‌ భాష హాజరయ్యారని ప్రచారం సాగుతోంది. కడప నుంచి బెంగుళూరు అక్కడ నుంచి విమానంలో ఢిల్లీ వెళ్లారని మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. ఢిల్లీ సదస్సుకు వెళ్లి వచ్చిన వారిలో పలువురికి కరోనా సోకడంతో ఎప్పుడు ఏమవుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.

ఈ సమావేశాలకు ఏపీ నుంచి 711 మంది వెళ్లారని అధికారులు గుర్తించారు. కర్నూలు నుంచి 189 మంది వెళ్లారు. అనంతపురం 73, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 68, ప్రకాశం 67, విశాఖ 41, కడప 50, గుంటూరు జిల్లా 88, కృష్ణా 43, చిత్తూరు 36, తూర్పుగోదావరి 27, పశ్చిమగోదావరి 16, విజయగనరం జిల్లా నుంచి ముగ్గురు వెళ్లారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వారందరినీ వైద్య పరీక్షలకు కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన కోవిద్‌ ఆస్పత్రులకు తరలించారు.