Idream media
Idream media
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు హుజురాబాద్ చుట్టూనే జరుగుతున్నాయి. ఈటల రాజేందర్ రాజీనామాతో అక్కడ జరిగే ఉప ఎన్నికను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకే అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటికైతే భారతీయ జనతా పార్టీ నుంచి జన క్షేత్రంలో ఈటల మినహా మరో అభ్యర్థి కనిపించట్లేదు. అభ్యర్థి కోసం అధికార పార్టీ సాగిస్తున్న అన్వేషణ ఓ కొలిక్కి వచ్చిందని తెలుస్తున్నప్పటికీ ఎవరనేది అధికారిక ప్రకటన లేదు.
ఇక కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డికి ఎదురుకాబోతున్న తొలి పరీక్ష ఈ ఉప ఎన్నిక. ఆ పార్టీ నుంచి కూడా అభ్యర్థి ఎంపిక కొలిక్కి రాలేదు. ఎంపిక బాధ్యతను దామోదర రాజనర్సింహకు అప్పగించిన నేపథ్యంలో… ఇటీవల జరిగిన నియోజకవర్గ సమావేశంలో నలుగురి పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో కొండా సురేఖ కూడా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ కాంగ్రెస్ నుంచి ఆమె పోటీ చేస్తే ఎలా ఉంటుంది? అనే చర్చ మొదలైంది.
దూకుడుగా వ్యవహరించే టీపీసీసీ చీఫ్ రేవంత్ హుజురాబాద్ ఉపఎన్నిక విషయంలో మాత్రం ఎందుకనో ఇప్పటి వరకు స్తబ్దుగానే ఉన్నారు. బాధ్యతలు సీనియర్ నేత దామోదరకు అప్పగించాం కదా.. ఆయనే చూసుకుంటారని భావిస్తున్నారో ఏమో కానీ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు లేదు. ఈ క్రమంలో గతంలో హుజురాబాద్‌లో 60 వేల పైచిలుకు ఓటు బ్యాంకు దక్కించుకున్న కాంగ్రెస్ ఈసారి ఏ మేరకు సత్తా చాటగలదనే చర్చ జరుగుతోంది. తాను చేసిన సర్వేలో హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు ఐదు శాతానికి మించి ఓట్లు రావని సొంత పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇప్పటి నుంచి గట్టిగా దృష్టి పెడితే కాస్త మార్పు రావచ్చు అని సూచించారు. దీంతో సరైన అభ్యర్థి కోసం వెదుకుతున్న క్రమంలో సురేఖ పేరు తెరపైకి వచ్చింది.
బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పదునైన వ్యాఖ్యలతో అధికార పార్టీపై విమర్శలు సందిస్తున్నారు. తీవ్రమైన వ్యాఖ్యలతో తన వాదాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ నుంచి మంత్రులు హరీశ్ రావు సహా ఇతర మంత్రులు కూడా అదే విధంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి గట్టి వాయిస్ ఉన్న వ్యక్తి అభ్యర్థి అయితే ఉపయోగం ఉంటుంది. అలా చూస్తే కొండా సురేఖ సరైన వ్యక్తే. ఎందుకంటే ఆమెకు ఫైర్ బ్రాండ్ గా ముద్ర ఉంది. గతంలో కేసీఆర్ పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీనికి తోడు సురేఖ బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో ఆ వర్గానికి చెందిన ఓట్లపై కాస్తయినా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.
కొండా సురేఖ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో కాంగ్రెస్ తోనే ఎక్కువ బంధం ఉంది. 1995లో మండల పరిషత్ కు ఎన్నికయ్యారు. అక్కడి నుంచి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1999, 2004లో ఆమె శాయంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం పలు పదవులు అనుభవించారు. 2009 లో పరకాల శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యురాలిగా గెలుపొందారు. వైఎస్ ఆర్ మంత్రివర్గంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, బధిరుల సంక్షేమ మంత్రిగా కూడా పని చేశారు.
రాజశేఖరరెడ్డి మరణం అనంతరం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వనందుకు మనస్తాపానికి గురై కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. అనంతరం కొన్నాళ్ల పాటు జగన్ పార్టీ లో కొనసాగి రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి వరంగల్ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2018 ముందస్తు ఎన్నికల్లో ఆమెకు టీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. దీంతో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని తిరిగి సొంత గూటికి చేరారు.
అయితే, కొండా సురేఖ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొంత కాలం పాటు స్తబ్దుగా ఉన్నారు. ఏ పార్టీలోనూ స్థిరంగా ఉండరనే పేరు కొండాకు ప్రతికూల అంశం. ఈ నేపథ్యంలో కొండా దంపతులు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరనున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా దంపతులకు రాజకీయంగా ఎంత పేరుందో, అలాగే భూ కబ్జా ఆరోపణలు, సెటిల్మెంట్ల దందాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ ఉప ఎన్నికలో కొండా సురేఖపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కొండా సురేఖ హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తే ఎంత ఉపయోగం ఉంటుందో అదేవిధంగా ప్రతికూలతలూ ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు. కాగా, కొండా సురేఖతో పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ దళిత సామాజికవర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలనుకుంటే… వరంగల్‌కు చెందిన సీనియర్ నేత దొమ్మాటి సాంబయ్య,కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణలకు అవకాశం ఇవ్వొచ్చుననే ప్రచారం జరుగుతోంది.