Idream media
Idream media
తెలంగాణ రాజకీయాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాట్లాడి.. చాలా రోజులవుతుంది. కొన్నేళ్లుగా తెలంగాణలో రాజకీయంగా జరిగిన ఏ విషయంపైనా నేరుగా స్పందించకుండా.. ఇక్కడి టీడీపీ నేతలకే వదిలేశారు. కేసీఆర్ తో కాంగ్రెస్ గట్టిగా పోరాడుతున్న వేళ.. ఇప్పుడు బాబు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేయడం కొత్త అనుమానాలను లేవనెత్తుతోంది. ఇక్కడి ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
తెలంగాణ టీడీపీలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ నాయకుడు లేడు. అయినప్పటికీ బలమైన ఓటు బ్యాంకు ఉందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో కష్టపడితే మళ్లీ ఆ పార్టీ నేతలు కీలకంగా మారే అవకాశాలున్నాయని బాబు వారికి దిశా నిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా తాజా వ్యాఖ్యల ద్వారా వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్తోనే పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ బీజేపీతో కలిసి సాగే అవకాశాలు దాదాపు లేనట్లే! ఇక కొత్తగా పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి తనకు సన్నిహితుడే కాబట్టి బాబు ఆ దిశగా నిర్ణయం తీసుకునే వీలుందని తెలుస్తోంది. కానీ బాబు ఎంతగా ప్రయత్నించినా తెలంగాణలో జాకీ వేసిన లేపినా టీడీపీ పుంజుకునే పరిస్థితి లేదన్నది స్పష్టంగా తెలుస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న తనపై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలని, తెలంగాణలో కూడా ప్రజాస్వామ్యం దారుణంగా ఉందని, ప్రశ్నించే వారిని జైల్లో పెడుతున్నారని ఆయన విమర్శించారు. తన లాంటి వ్యక్తి సమావేశం పెట్టుకునే అవకాశం తెలంగాణలో లేదని వ్యాఖ్యానించారు. ఇటీవల ఢిల్లీలో కిందపడి గాయపడిన మందకృష్ణ మాదిగను పరామర్శించేందుకు వచ్చిన అనంతరం ఆయన మీడియా ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
దీంతో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పూర్తిగా ఏపీ రాజకీయాలపైనే ధ్యాస పెట్టిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనసు మళ్లీ ఇప్పుడు తెలంగాణ వైపు మళ్లిందా, నాయకులే లేని పార్టీని మళ్లీ పుంజుకునేలా చేసేందుకు అడుగులు వేస్తున్నారా? ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో జట్టు కట్టాలని ప్రయత్నిస్తున్నా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చాలా రోజుల తర్వాత చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఈ ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.