iDreamPost
android-app
ios-app

టీడీపీపై చంద్ర‌బాబు కంట్రోల్ త‌ప్పుతోందా?ఇన్ని అసమ్మతి స్వరాలా ?

టీడీపీపై చంద్ర‌బాబు కంట్రోల్ త‌ప్పుతోందా?ఇన్ని అసమ్మతి స్వరాలా ?

తెలుగుదేశం పార్టీ అంటే నారా చంద్ర‌బాబునాయుడు.. నారా అంటే టీడీపీ అన్న‌ట్లుగా ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌రిస్థితి ఉండేది. క‌నుసైగ‌తో పార్టీ కేడ‌ర్ ను కంట్రోల్ లో ఉంచేవార‌న్న పేరు బాబుకు ఉంది. కానీ.. తాజా ప‌రిస్థితులు చూస్తుంటే.. అంత‌ర్లీనంగా పార్టీలోని కొంద‌రు నేత‌లు చంద్ర‌బాబు కు చుక్క‌లు చూపెడుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. బుచ్చ‌య్య చౌద‌రి, కేశినేని నాని వంటి నేత‌లు బ‌హిరంగంగానే బాబుపై ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేస్తుంటే.. కొంత మంది నేత‌లు, కార్య‌క‌ర్త‌లు సైతం ఇత‌రుల వ‌ద్ద త‌మ అస‌హ‌నాన్ని వెల్ల‌డిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఒక‌వైపు రోజురోజుకు పెరుగుతున్న వైసీపీ ఖ్యాతి, ప్ర‌జ‌ల్లో ఆ పార్టీ పుంజుకుంటున్న తీరు.. టీడీపీని క‌ల‌వ‌ర‌పెడుతుంటే… మ‌రోవైపు సొంత పార్టీ నేత‌లే బాబుకు త‌ల‌నొప్పిగా మారుతున్నారు. 2024లోగా పార్టీని బ‌లోపేతం చేసేందుకు మిగిలిన అర్థ భాగం కాలంలో ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌కు బాబు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంటే.. పార్టీలోనే ఆందోళ‌న‌లు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టి.. వచ్చే ఎన్నికల్లో ఎంత వ‌ర‌కు పోటీ ఇస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. అసంతృప్తి నాయ‌కుల‌ను, ఇత‌ర పార్టీల్లోకి వెళ్లిన నాయ‌కుల స్థానంలో కొత్త వారిని నిల‌బెట్టి పైకి లేప‌డం, అంద‌రినీ క‌లుపుకుని పార్టీని నడిపించడం.. చంద్రబాబు కత్తిమీద సాములా మారింది.

Also Read: బాబును చిక్కుల్లో పడేసిన టీడీపీ కార్యకర్తలు, సమస్యే లేదన్న కేశినేని…!

రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ పేల్చిన బాంబుతో ఒక్కసారిగా పార్టీలో కలకలం రేగింది. అయితే.. ఆయనను వెంటనే బుజ్జగించడంతో పార్టీలో లుకలుకలు తగ్గాయని అనుకుంటున్న త‌రుణంలో మళ్లీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎపిసోడ్ తెరమీదికి వచ్చింది. విజయవాడ టీడీపీ లో తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్న నాని.. అందరికీ దూరంగా రాజకీయాలు చేసుకుంటున్నారు. ఇటీ వల చంద్రబాబు ఇంటిపై వైసీపీ నాయకులు దాడి చేసిన ఘటనపై ఇప్పటి వరకు ఆయన స్పందించలే దు. దీనిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. కేశినేని నాని స్పష్టం చేయడం.. తన కుమార్తె కూడా పార్టీ తరఫున పోటీకి రెడీ కాదని.. సంకేతాలు పంపం డం .. మరోసారి టీడీపీ నేతల పై అదుపు లేదనే కామెంట్లు వచ్చేందుకు అవకాశం కల్పించినట్టయింది.

ఇక రెండు రోజుల కిందటే.. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంచి పట్టున్న నాయకుడు మాజీ మంత్రి,మాజీ ఆప్కో.. చైర్మన్.. మురుగుడు హనుమంతరావు కూడా పార్టీకి దూరమయ్యారు. ఇకఉత్తరాంధ్రలో పట్టున్న నాయకులు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుది .. ఎంతకూ అర్ధంకాని.. విషయంగా మారింది. ఆయన పార్టీలో ఉన్నారో.. లేరో తెలియదు. మరోపక్క పార్టీలో గతంలో కీలక నేతగా వ్యవహరించిన ఎంతో మంది నేతలు ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. అలాగే.. ఒకప్పుడు చంద్రబాబు గీత దాటని నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వెళుతున్నారు. అదేసమయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ వంటి నాయకులు చంద్రబాబు పై లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసి మరీ వెళ్లారు.

Also Read:లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీ …?

నేత‌లు వెళ్లినా టీడీపీకి కార్య‌క‌ర్త‌ల బ‌లం ఉండేది. ఇప్పుడు ఆ ప‌రిస్థితిలో కూడా మార్పులు క‌నిపిస్తున్నాయి. నేత‌ల వెంటే కానీ.. పార్టీ వెంట కాద‌నే సంకేతాలు పంపుతున్నారు. అందుకు విజ‌య‌వాడ కేశినేని నానియే ఉదాహ‌ర‌ణ‌. టీడీపీ నుంచి నానియే పోటీ చేయాల‌ని, ఇత‌రులు ఎవ‌రు పోటీ చేసినా తాము ప‌నిచేయ‌బోమ‌ని విజయ‌వాడ కార్య‌క‌ర్త‌లు చెబుతున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీలో ఇంత వ‌ర‌కు లేని కొత్త ఒర‌వ‌డికి విజ‌య‌వాడ టీడీపీ కార్య‌క‌ర్త‌లు శ్రీ‌కారం చుట్ట‌డం మ‌రింత క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది.

ఇప్పటికే పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నేతల మధ్య సఖ్యత కనిపించడం లేదు. ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్న కూడా స్వ‌యంగా పార్టీపై తేలిక‌పాటి విమ‌ర్శ‌లు చేసిన సంద‌ర్భాలు వెలుగులోకి వ‌చ్చాయి. చంద్ర‌బాబు ముందే జూ.ఎన్టీఆర్ నాయ‌క‌త్వాన్ని కోరిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఇవ‌న్నీ ప‌రిశీలిస్తే టీడీపీ చంద్ర‌బాబు చేయి దాటిపోతోంద‌న్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

Also Read:కుప్పం ఓటమిని మభ్యపెట్టేందుకేనా పవన్ దాడి?