iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్రమంతా రోడ్డెక్కిన నాడు కనిపించలేదు. నవ్యాంధ్ర భవితవ్యం కోసం ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినదిస్తుంటే కనీస స్పందన లేదు. కానీ 29 గ్రామాల పరిధిలోని రాజధాని ప్రాంతంలో కొన్ని గ్రామాల రైతులు ఆందోళన చెందుతుంటే ఉన్నపళంగా ఊడిపడ్డారు. చంద్రబాబుకి తోడుగా ఆయన భార్య భువనేశ్వరి కూడా రోడ్డెక్కారు. ఇప్పటికే విడతల వారీగా పవన్ కళ్యాణ్ సహా నేతలంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు హెరిటేజ్ సంస్థ భాగస్వామిగా ఉన్న భువనేశ్వరి తెరమీదకు రావడం విశేషంగా మారింది. రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.
రాజధాని ప్రాంతంలో రైతుల ఉద్యమం చల్లారిపోతుందనుకుంటున్న దశలో చంద్రబాబు మరింత ఆజ్యం పోయాలని చూస్తున్నట్టు స్పష్టం అవుతోంది. అమరావతి వ్యవహారం సమసిపోతే తన రాజకీయ మనుగడకు ముప్పు తప్పదనే అభిప్రాయంతో ఆయన మంకు పట్టుదలకు పోతున్నట్టు పలువురు భావిస్తున్నారు. అదే సమయంలో ఆర్థికంగానూ తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందనే దుగ్ధతో చంద్రబాబు దేనికైనా సిద్ధపడే స్థాయికి చేరుతున్నారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జగన్ ప్రాణాలకు కూడా రక్షణ లేదనే వ్యాఖ్యలు చేసి కలకలం రేపిన చంద్రబాబు ఇప్పుడు తన భార్యను కూడా తొలిసారిగా ఉద్యమంలోకి తీసుకురావడం వెనుక అసలు కారణం అదేనని చెబుతున్నారు. రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు చవిచూసిన చంద్రబాబుకి ఇప్పుడున్నంత గడ్డుస్థితి గతంలో ఎన్నడూలేదని కూడా చెబుతున్నారు. అందుకే ఆఖరి అస్త్రంగా భువనేశ్వరిని సీన్ లోకి తీసుకురావడంతో మరికొంత సమయం ఉద్యమాన్ని కొనసాగించగలమని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తోంది.
వాస్తవానికి అమరావతి ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు సర్కారు సమగ్రంగా వ్యవహరించి ఉంటే, రాజధాని రైతులకు ఇప్పుడీ సమస్య వచ్చేది కాదు. లొసుగులతో కూడా ల్యాండ్ ఫూలింగ్ విధానం స్థానంలో 2013 భూసేకరణ చట్టం అమలు చేయాల్సి ఉంది. అయినప్పటికీ చంద్రబాబు అంతా తానై అన్నట్టుగా వ్యవహరించి, రాజధాని ప్రాంతంలో రైతులను మభ్యపెట్టి భూములు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ కి తీసుకెళ్లి వారి ఆశలను రెట్టింపు చేశారు. తీరా చూస్తే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏపీ భవిష్యత్ రీత్యా అంత భారీ ప్రాజెక్ట్ సాధ్యం కాదని తేల్చేస్తున్న సమయంలో రైతులంతా బిక్కమొఖాలు వేయాల్సి వస్తోంది. రూ.5లక్షలకు కూడా ఖరీదు చేయని భూములను ఏకంగా రూ.5 కోట్ల విలువకు అమ్ముకోవడానికి అలవాటు పడి ఇప్పుడు హఠాత్తుగా అల్లకల్లోలం అయిపోతోందని ఆందోళన చెందుతున్నారు.
అలాంటి సమయంలో ప్రభుత్వంతో చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడం కన్నా ఉత్తమ మార్గం లేదు. అయినప్పటికీ ప్రభుత్వానికి కనీసం వినతిపత్రాలు ఇచ్చి గానీ, రాయబారాలు నడిపింది గానీ లేదు. అమరావతి రైతుల తరుపున మాకు న్యాయం జరగడం కోసం ఇలా చేయండి అంటున్న నాథుడు లేడు. ఇప్పటికే 15 రోజులుగా రోడ్డెక్కడం, జగన్ ని, ఆయన కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడం, మళ్లీ ఇళ్లకు వెళ్లడం..ఇలా నిత్యకృత్యంగా మారుతోంది. కనీసం ప్రభుత్వంతో చర్చించడానికి కూడా ప్రయత్నాలు చేసినట్టు కనిపించడం లేదు. మునిసిపల్, రెవెన్యూ, వ్యవసాయి, పంచాయితీరాజ్ శాఖలకు సంబంధించిన మంత్రులతోనయినా మాటా మంతీ జరిపితే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. కానీ దానికి భిన్నంగా చంద్రబాబు సూచనలతో నిరసనలతో కాలయాపన చేసేందుకు అమరావతి రైతులు ప్రాధాన్యతనిస్తున్నారు.
అమరావతి ప్రాంత రైతుల ఉద్యమం రాష్ట్రమంతా విస్తరింపజేస్తామని చంద్రబాబు వారికి చెప్పినా అది నెరవేరడం లేదు. శ్రీకాకుళంలో రోడ్డెక్కిన టీడీపీ నేతలకు సోషల్ మీడియా సాక్షిగా టీడీపీ కార్యకర్తలే షాక్ ఇవ్వడంతో అన్ని చోట్లా సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. విజయవాడ, గుంటూరులో సైతం తెలుగుదేశం ఆశించిన దానికి భిన్నంగా పరిస్థితులున్నాయి. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి నేరుగా సీఎంని కలిసిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు అందుకు అద్దంపడుతున్నాయి.
ఇలాంటి సమయంలో రాజధాని ప్రాంత రైతాంగం తమకు న్యాయం జరగాలంటే మోడీకి లేఖలు రాసి, ఆంధ్రజ్యోతిలో వార్తలు రాయిస్తే కలిగే లాభం కన్నా జరిగే నష్టమే ఎక్కువగా మారుతోంది. ఇప్పటికే కాలతీతం అవుతోంది. సమస్యను పరిష్కరించుకునే దిశలో ఆలోచించకుండా చంద్రబాబుని నమ్ముకుని ఉద్యమంలో కొనసాగితే మాత్రం చివరకు మరో సమైక్యాంధ్ర ఉద్యమం మాదిరిగా మిగిలిపోవడమే తప్ప ఏమీ లబ్ది చేకూరే అవకాశం కనిపించడం లేదు.
చంద్రబాబు తన ఇంటి మనుషులను కూడా రోడ్డు మీదకు తెస్తున్న నేపథ్యంలో అమరావతి రైతుల ఉద్యమం పట్ల ఏపీ అంతటా మరింత అనుమానాలు బలపడుతున్నాయి. ఏపీ కోసం ఎన్నడూ బయటకు రాని, ప్రజల ప్రయోజనాల కోసం పెదవి విప్పని వాళ్లు కూడా అమరావతి అనగానే సిద్ధపడిపోవడం వెనుక భూభాగోతం ఉందనే అభిప్రాయం బలపడుతోంది. కాబట్టి బాబుని నమ్ముకుని అమరావతి రైతులు మరింత ముందుకెళ్లడం అసలుకే ఎసరు పెట్టే ప్రమాదం కొనితెచ్చుకోవడం అవుతుందనడంలో సందేహం కనిపించడం లేదు.
బాబు- భువనేశ్వరి, పవన్- నాదెండ్ల మనోహర్ వంటి వారు సాగించే వ్యవహారాలు ఆయా పార్టీల రాజకీయ కార్యకలాపాలుగా చెప్పుకోవడానికి ఉపయోగమే తప్ప, సామాన్య రైతులకు మాత్రం వీసమెత్తు లబ్దికి దోహదపడేలా కనిపించడం లేదు. ఇప్పటికయినా రైతులు తమ దారి తాము చేసుకోవడం మేలు అని చెప్పక తప్పదు.