వాలంటీర్ల వ్యవస్ధను చూసి భయపడుతున్నాడా ?

వాలంటీర్ల వ్యవస్ధ పనితీరుపై ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చేస్తున్న వ్యాఖ్యలను బట్టి అదే అర్ధమవుతోంది. వాలంటీర్ల వ్యవస్ధ ఏర్పడినప్పటి నుండి చంద్రబాబునాయుడు పదే పదే వాలంటీర్లను టార్గెట్ చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. మొదట్లో ఏమో మగవాళ్ళు లేనపుడు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి తలుపులు తడుతుంటే ఆడవాళ్ళు భయపడుతున్నట్లు ఆరోపణలు చేశాడు.

తర్వాతేమో వాలంటీర్లు మూటలు మోస్తున్నాడన్నాడు. మళ్ళీ 5 వేల రూపాయలకు పనిచేసే వాలంటీర్లకు పిల్లను కూడా ఎవరూ ఇవ్వటం లేదంటూ ఎద్దేవా చేశాడు. ఈమధ్యనే వాలంటీర్ల వల్లే కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతోందంటూ పనికిమాలిన వ్యాఖ్యలు చేశాడు. కొద్ది రోజులుగా వాలంటీర్లే నాటు సారా తయారు చేసి ఇంటింటికి వెళ్ళి అమ్ముతున్నట్లు రిపీటెడ్ గా ఆరోపణలు చేస్తున్నాడు. నిజానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నుండి ఇటువంటి చవకబారు ఆరోపణలు, వ్యాఖ్యలను ఎవరూ ఊహించరు.

నిజానికి వాలంటీర్ల వ్యవస్ధను జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసింది ప్రభుత్వం సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేర్చాలని. ప్రతి 50 ఇళ్ళకు ఓ వాలంటీర్ ను ఏర్పాటు చేయటం ద్వారా ఆ ఇళ్ళలోని వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుంటే పథకాల వివరాలు వాళ్ళకు చెప్పటం, వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తారన్నది జగన్ ఆలోచన. జగన్ అనుకున్నట్లే వాలంటీర్లు ప్రతి నెల 1వ తేదీనే అర్హులందరికీ పెన్షన్లు అందిస్తున్నారు. ఒకేరోజు సుమారు 90 లక్షల మందికి పెన్షన్లు అందించటమంటే మామూలు విషయం కాదు.

అలాగే రేషన్ సరుకులను కూడా డోర్ డెలవరీ చేస్తున్నారు. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలున్నా హోలు మొత్తం మీద వ్యవస్ధ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ప్రస్తుత కరోనా వైరస్ సంక్షోభంలో వాలంటీర్లు అందిస్తున్న సేవలు బ్రహ్మాండంగా ఉన్నాయి. వాలంటీర్ల వ్యవస్ధ పనితీరు విషయంలో తమిళనాడులో కొన్ని ఛానళ్ళు ప్రత్యేక కథనాలిచ్చాయి. అలాగే ఒడిస్సా, మహారాష్ట్ర, ఢిల్లీ ముఖ్యమంత్రులు కూడా వ్యవస్ధను మెచ్చుకున్న విషయం తెలిసిందే.

ఇంతటి ప్రజాధరణ పొందిన వ్యవస్ధ మీద పదే పదే చంద్రబాబు ఎందుకు విరుచుకుపడుతున్నాడు ? ఎందుకంటే ఈ వ్యవస్ధ అంటే భయపడుతున్నాడనే అనుకోవాలి. వాలంటీర్లు అందిస్తున్న సర్వీసుతో జనాల్లో ప్రభుత్వం మంచి సానుకూలత సంపాదించుకుంది. ఇటువంటిదే చంద్రబాబు హయాంలో ఏర్పాటైన జన్మభూమి కమిటిలు ఎంత వివాదాస్పదమయ్యాయో అందరూ చూసిందే. గ్రామస్ధాయిలో చాలామంది జన్మభూమి కమిటిలకు, వాలంటీర్ల వ్యవస్ధకు తేడాలు గ్రహించారు.

వాలంటీర్ల వ్యవస్ధ పనితీరు వల్ల ఎక్కడ ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేస్తుందో, రేపు ఏ అవసరమైనా జనాలు అధికారపార్టీవైపు మొగ్గు చూపుతారన్న భయమే చంద్రబాబులో కనబడుతోంది. ప్రస్తుత సంక్షోభంలో టిడిపి ఎంఎల్ఏలు, నేతలు, శ్రేణులకన్నా వాలంటీర్లే ఎక్కువగా గ్రామాల్లో తిరుగుతున్నారు. జగన్ సక్సెస్ అంతా వాలంటీర్ల వ్యవస్ధ పనితీరుపైనే ఉందన్న విషయం అర్ధమైపోవటంతోనే చంద్రబాబు పదే పదే టార్గెట్ చేస్తున్నాడు.

Show comments