Idream media
Idream media
అధికారమే ధ్యేయంగా తెలంగాణ బీజేపీ శక్తివంచన లేకుండా పని చేస్తోంది. కమిటీల కూర్పు నుంచి ఆందోళన కార్యక్రమాల ఏర్పాటు వరకూ అన్నింటినీ ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళ్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ సంక్షేమ పథకాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పర్యటనలు వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో టీఆర్ఎస్ పట్టు తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ప్రజాక్షేత్రంలో కలిసిపోతున్న బండి సంజయ్ దీంతో పాటు సరికొత్త ప్లాన్ అమలు చేయడానికి సిద్ధమవుతున్నారట.
ఏడాదిన్నర, రెండేళ్ల లోపే తెలంగాణ ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతోంది. నాడు టీఆర్ఎస్ ను ఎదుర్కునేలా త్వరలోనే బండి కీలక ప్రకటన చేయడానికి రెడీ అవుతున్నారట. ఇటీవల నిర్మల్ సభకు వచ్చిన అమిత్ షా దృష్టికి ఇప్పటికే తన నిర్ణయాన్ని సంజయ్ తీసుకెళ్లినట్లు తెలిసింది. హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం.. వ్యూహం అమలు చేయాలని చూస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే టార్గెట్ గా కమలనాథులు ముందస్తు వ్యూహాలు రచిస్తున్నారు.
బండి సంజయ్ ను తెలంగాణ అధ్యక్షుడిగా నియమించిన హైకమాండ్ మొదటి నుంచీ ఆయనకు సపోర్టు చేస్తూనే వస్తోంది. దీంతో ఇప్పటికే ప్రజాసంగ్రామ యాత్రతో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ జనాల్లోకి వెళ్లారు. త్వరలోనే తొలి విడత పాదయాత్ర ముగియనుంది. ఈలోపే కీలక ప్రకటనకు స్కెచ్ వేస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే అన్ని పార్టీల కంటే ముందే బండి సంజయ్ జనంలోకి వెళ్లారు. 5 విడతల్లో సంగ్రామయాత్రకు ప్లాన్ చేసుకున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం నుంచి హుజూరాబాద్ వరకు తొలి విడత.. హైదరాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి వికారాబాద్ మెదక్ కామారెడ్డి జిల్లాల్లో పాదయాత్ర ముగిసింది. సిరిసిల్ల మీదుగా హుజూరాబాద్ వరకు కొనసాగుతోంది. అక్టోబర్ 2న మొదటి విడత పాదయాత్ర ముగిస్తారు.
అక్టోబర్ 2న బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలోనే ఇరవై నుంచి ముఫ్పై అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారట కమలనాథులు. ఎటువంటి సమస్యలేని పెద్దగా ఆశావహులు లేని చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. పాదయాత్ర విజయవంతానికి కృషి చేసిన వారికి గుర్తింపుగా ఎన్నికలకు రెండేళ్ల ముందే అభ్యర్థులను ప్రకటించాలని బండి సంజయ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పాదయాత్ర సాగిన జిల్లాల్లోని ఇరవై అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నారు. హైకమాండ్ నుంచి అనుమతి రాగానే తన వ్యూహం అమలు చేసేందుకు బండి సిద్ధంగా ఉన్నారు. మరి ఏం జరగనుందో చూడాలి.