iDreamPost
android-app
ios-app

ఏపీలో జ‌గ‌న్ స‌ర్కార్ ఉన్నంత వ‌ర‌కూ…

ఏపీలో జ‌గ‌న్ స‌ర్కార్ ఉన్నంత వ‌ర‌కూ…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ స‌ర్కార్ చాలా అంటే చాలా ప‌టిష్టంగా ఉంది. ఆవిర్భావంతోనే బ‌ల‌మైన పునాదులు వేసుకుంది. అధికారంలోకి రావ‌డ‌మే బంప‌ర్ మెజార్టీతో వ‌చ్చింది. ఈ ఇర‌వై ఐదు నెల‌ల పాల‌నా కాలంలో మ‌రింత బ‌లంగా మారింది. అందుకు జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాలే కార‌ణ‌మ‌ని తెలిసిందే. ఏపీలో ప్ర‌స్తుతం జ‌గ‌న్ స‌ర్కార్ కు ఉన్న ఆద‌ర‌ణ నేప‌థ్యంలో మ‌రో పార్టీకి అవ‌కాశం లేన‌ట్లే. ప‌ద్నాలుగేళ్లు అధికారం సాగించిన తెలుగుదేశం పార్టీయే ఉనికి కోసం అప‌సోపాలు ప‌డుతోంది. ఏపీలో అస‌లు ఉనికే లేని బీజేపీ అధికారంలోకి రావ‌డం అనేది ఇప్ప‌ట్లో క‌ల్లే. అలాగే ఇప్ప‌టికిప్పుడు చొచ్చుకుపోవ‌డం కూడా సాధ్యం కాని ప‌ని. అలాంటి ప‌రిస్థితుల్లో ఆ పార్టీకి అధ్య‌క్షుడు ఎవ‌రున్నా కానీ.. పెద్ద‌గా క‌లిసొచ్చేది ఏదీ ఉండ‌దు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాసులు గ‌తంలోను, ఇప్పుడు కూడా బీజేపీని అంత‌గా ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. ఒకప్పుడు లోక్ సభలో రెండంటే రెండు సీట్లు మాత్రమే సాధించిన బీజేపీ.. ఇప్పుడు దేశంలో తిరుగులేని పార్టీగా అవతరించింది. బీజేపీకి రెండు సీట్లు వచ్చినప్పుడు ఏపీలో ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో.. దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ ఏపీలో మాత్రం ఎదిగింది లేదు. అందుకు కార‌ణాలు అనేకం ఉన్నాయి. వాటిలో ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సి వ‌స్తే.. కొంతకాలం పాటు ఏపీలో తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా ఉండటం.. ఆ తర్వాత ఒంటరి ప్రయాణం.. మళ్లీ అవకాశం వస్తే మళ్లీ అదే టీడీపీకి తోక పార్టీగా మారటం.. మళ్లీ తేడా రావటం.. ఒంటరి కావటం తెలిసిందే. ఇలాంటివేళలో.. పవన్ జనసేనతో జత కట్ట‌డం తెలిసిందే. ఇలాంటి నేప‌థ్యంలో ఏపీ బీజేపీ ప్ర‌ధాన పార్టీ అవ‌త‌రించ‌డం అనేది క‌ష్ట‌మైన ప‌ని.

రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బేస్ చూస్తే.. ఏపీ కంటే తెలంగాణలో మెరుగ్గా కనిపిస్తుంది. 2014 విభజన తర్వాత ఆ పార్టీ తెలంగాణలో అంతకంతకూ బలోపేతం అవుతుంటే.. ఏపీలో మాత్రం అంతకంతకూ తన ఉనికిని కోల్పోతున్న పరిస్థితి. ఇప్పటికిప్పుడు అయితే.. ఏపీలో బీజేపీ అంటేనే మండిపడేవారు బోలెడంత మంది కనిపిస్తారు. విభజన వేళ.. కాంగ్రెస్ పార్టీకి దన్నుగా నిలిచినప్పటికి.. ఆ పార్టీ మాత్రంచేయగలిగింది ఏముందన్న సాఫ్ట్ కార్నర్ ఉండేది. ఏపీలో బీజేపీ బలోపేతానికి ఉన్న అద్భుతమైన అవకాశాన్ని మోదీ దెబ్బ తీశారని చెప్పాలి.

ప్రత్యేక హోదాను ఇచ్చినా.. రాజధానిగా అమరావతికి అవసరమైన నిధులు ధారాళంగా ఇచ్చినా ఆ పార్టీ తీరు వేరుగా ఉండేది. కానీ.. ఆ రెండు చేయకపోవటమే కాదు.. విశాఖ ఉక్కుపరిశ్రమనుప్రైవేటీకరణ చేసేందుకు కంకణం కట్టుకున్నట్లుగా వ్యవహరించటం.. విశాఖలో ఏర్పాటు చేయాల్సిన రైల్వే డివిజన్ విషయంలోనూ తొండాట ఆడటం ఆ పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేయటమే కాదు.. ఏపీలో ఆ పార్టీకి కోలుకోలేని రీతిలో దెబ్బ తీసింది. ఇలాంటివేళ.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా ఒకటే పరిస్థితి అన్న మాట వినిపిస్తోంది.

ప్రస్తుతానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న‌ సోము వీర్రాజు మొద‌ట్లో పార్టీని బాగానే ఉరుకులు పెట్టించారు. అనంత‌రం కేంద్రం తీసుకున్న ఒక్కో నిర్ణ‌యం ఏపీలో పార్టీకి శాపంగా మారేది. ఏపీకి వ్య‌తిరేకంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్న కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంతో పోరాడే అవ‌కాశం లేదు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను న‌చ్చ‌చెప్ప‌నూ లేదు. ప‌వ‌న్ తో జ‌ట్టు క‌ట్టినా తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌లో క‌నీస ప్ర‌భావం చూప‌లేక‌పోవ‌డానికి కార‌ణం జ‌గ‌న్ కు ప్ర‌జ‌ల్లో ఉన్న ఆద‌ర‌ణ ఒక‌టైతే.. ఏపీలో విష‌యంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణ‌యాలు మ‌రో కార‌ణంగా చెప్పొచ్చు. అలాంటి ప‌రిస్థితుల్లో ఇప్పుడు సోము వీర్రాజును మార్చి, ఆయన స్థానంలో ఎవ‌రికి బాధ్య‌తలు అప్ప‌గించినా పార్టీలో వ‌చ్చే మార్పులు ఏమీ ఉండ‌వు. ఏపీ బీజేపీ చీఫ్ గా సోము వీర్రాజును మారుస్తార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఇప్పుడు ఈ త‌ర‌హా చ‌ర్చ జ‌రుగుతోంది. బీజేపీ మీద అభిమానం ఉన్నా.. ఏపీ మీదా ఏపీ ప్రజల మీదా ఆ పార్టీకి అభిమానం లేనప్పుడు.. ఎవరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసినా ఒకటేనన్న మాట వినిపిస్తోంది