Idream media
Idream media
తెలంగాణలో రాజకీయాలు మహా విచిత్రంగా మారుతున్నాయి. ఒకదానికి మించి మరొకటి ఇలా మూడు పార్టీలూ దూకుడు పెంచుతున్నాయి. బలం, బలగం పెంచుకునేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. పట్టున్న నాయకులపై గురి పెడుతున్నాయి. టీఆర్ఎస్ కు చెందిన పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ లోకి చేరనున్నారనే వార్తల నేపథ్యంలో.. టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా టీఆర్ఎస్‌లోకి కూడా కాంగ్రెస్ ప్రముఖులు రానున్నారన్న వార్తలు కూడా కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్‌లో ప్రస్తుతం సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్క ను టీఆర్ఎస్ లోకి లాక్కునేందుకు అగ్ర నాయకులు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు జోరందుకున్నాయి. అన్నీ అనుకున్నట్లుగానే జరిగితే భట్టి త్వరలోనే కారెక్కే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు త్రిముఖ పోటీ కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ లో జోరు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. వరుసగా బహిరంగ సభలు, కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రేణుల్లో జోష్ పెంచుతున్నారు. అలాగే సీనియర్ రాజకీయ నాయకులను హస్తం గూటికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇతర పార్టీల్లోని బలమైన నేతలను తమ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్ తాజాగా కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు అదే వ్యూహాన్ని అమలు చేస్తోందని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో ప్రస్తుతం సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్క టీఆర్ఎస్ వైపు చూస్తున్నారని గతంలో కూడా వార్తలు వచ్చాయి. నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ ను కలవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దీని కోసమే బీజేపీ నుంచి మోత్కుపల్లి నర్సింహులును టీఆర్ఎస్ లో చేర్చుకుని కీలక పదవుని కూడా కట్టబెట్టేందుకు చూస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీలో బలమైన దళిత నేతగా ఉన్న భట్టి విక్రమార్కను ఆకర్షించాలని టీఆర్ఎస్ చూస్తోందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా నిన్న మీడియాతో చిట్‌చాట్ చేసిన కేటీఆర్ మాటల కూడా ఇందుకు ఊతమిచ్చేలా ఉన్నాయి. కాంగ్రెస్‌లో భట్టి విక్రమార్క మంచి వ్యక్తి అని.. కానీ అక్కడ గట్టి అక్రమార్కుల మాటే చెల్లుబాటు అవుతోందని కేటీఆర్ అన్నారు. దీంతో భట్టి విక్రమార్క విషయంలో టీఆర్ఎస్ సాఫ్ట్ కార్నర్‌తో ముందుకు సాగుతోందని, ఆయనను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో బలహీనంగా ఉన్న టీఆర్ఎస్.. మధిరలోనూ బలంగా లేదు. భట్టి విక్రమార్క వస్తే మధిరతో పాటు ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌కు కొంతబలం వస్తుందని టీఆర్ఎస్ లెక్కలు వేసుకుని ఉండొచ్చనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ మినహా దళితబంధు అమలు చేయనున్న నాలుగు మండలాల్లో ఒకటి భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గం ఉండటంతో.. ఆయనను దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ ఇలా చేసిందేమో అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు వ్యూహరచన చేస్తున్న టీఆర్ఎస్.. ఈ క్రమంలోనే భట్టి విక్రమార్కను పార్టీలో చేర్చుకుంటుందేమో అనే చర్చ సాగుతోంది. అయితే రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, తాము అధికారంలోకి వచ్చాక అందరికి న్యాయం చేస్తామంటూ హామీలు ఇస్తున్న భట్టి పార్టీ మారతారా, లేదా అనేది చూడాలి.
Also Read : Huzurabad Aravind ,Kavita -హుజూరాబాద్ : నిజామాబాద్ ఎన్నికను ను తలపిస్తున్న అరవింద్ ప్రచారం