iDreamPost
android-app
ios-app

పవన్ కళ్యాణ్ కంటే బండి సంజయ్ బెటర్ అవుతున్నాడా …?

పవన్ కళ్యాణ్  కంటే బండి సంజయ్ బెటర్ అవుతున్నాడా …?

రాజకీయ పార్టీని నడపడం అంత సులువా…? సులువుగా రాజకీయం చేస్తే ప్రతిపక్షాలు ఎందుకు ఉంటాయి అందరూ పాలకులే కదా… రాజకీయాల్లో ఉండే వాళ్ళు రాజకీయమే శ్వాసగా బ్రతకడమే మినహా మరో మార్గం లేదు. రాజకీయాల ద్వారా సమాజాన్ని మార్చాలి అని భావించే వాళ్ళు రాజకీయాలను తమ జీవితంలో భాగం చేసుకోవాలి. కాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు ఏమో పెద్దగా కనపడుతున్నాయి… ఒకరకంగా కోటలు దాటుతున్నాయి గాని ఆయన ఆశయానికి తగిన విధంగా ప్రయాణం లేదనే భావన చాలా మందిలో ఉంది.

కక్కలేక మింగలేక అన్నట్టు ఉంది ఆ పార్టీ కార్యకర్తల పరిస్థితి అనేది చాలా మంది మాట్లాడే మాట. చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో అంత ఘోరంగా ఎందుకు విఫలం అయింది అంటే… కార్యకర్తల బలం లేకనే అనే విషయం చిరంజీవికి కూడా తెలుసు. ఎన్టీఆర్ ను, ఎమ్జీ రామచంద్రన్ ను దృష్టిలో పెట్టుకుని సభలకు వచ్చిన అభిమానులను చూసి 200 సీట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆశించారు. కాని విఫలం కావడం ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ లో కలిపారు.

వాజపేయి ని అద్వానీని, దేవెగౌడ, నితీష్ కుమార్ లాంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకుని ఉంటే ఆయన కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే వారు. ఏపీలో మరో కుమార స్వామిని, నితీష్ కుమార్ ను మనం చూసే వాళ్ళం. కాని ఆయన మాత్రం ఆ విధంగా ముందుకు వెళ్ళలేక సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు పవన్ పరిస్థితి అంతకంటే దారుణంగా ఉందనే మాట వినపడుతుంది. పోరాటం గురించి, చేగువేరా గురించి మాట్లాడే పవన్… ఆచరణ విషయంలో మాత్రం ట్విట్టర్ లేదా పత్రికా ప్రకటనలకు పరిమితం అయ్యారు.

Also Read : మానవతా మూర్తి .. థెరిసా మాత

బహుశా మన దక్షిణాదిన పవన్ కు ఉన్న ఫాలోయింగ్ మరో హీరోకి లేదు. అన్నయ్య చిరంజీవికి కూడా యూత్ లో అంత క్రేజ్ లేదు. కాని ఆ క్రేజ్ ని తనకు అనుకూలంగా మార్చుకోలేక పోతున్నారు పవన్. కార్యకర్తల సభ్యత్వం మీద కమిటీలు నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేయడం గాని, ప్రజాకర్షణ ఉన్న వాళ్ళను పార్టీలోకి ఆహ్వానించి కీలక పదవులు ఇవ్వడం గాని, ఆర్ధికంగా బలంగా ఉన్న వాళ్లకు భరోసా కల్పించడం గాని ఏ ఒక్కటి చేయడం లేదు. హైద్రాబాద్ బయట పెద్దగా కార్యకర్తల బలం లేని తెలంగాణా బిజెపి… దుబ్బాక, గ్రేటర్ లో అధికార పార్టీకి చుక్కలు చూపించింది.

బండి సంజయ్ పాదయాత్రకు కూడా దిగారు. కాని పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలకు పరిమితం అయ్యారు. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత నుంచి సిఎంగా శాసన సభలో అడుగు పెట్టడానికి వైఎస్ జగన్ పడిన కష్టాన్ని కళ్ళ ముందు చూసిన పవన్ కనీసం తన పార్టీని గ్రౌండ్ లెవెల్ లో నిర్మించుకోవడం లేదు. పార్టీ ప్రకటన తర్వాత రెండు ఎన్నికలను చూసారు. కాని ఇప్పటి వరకు కూడా పవన్ క్షేత్ర స్థాయి నాయకత్వాన్ని పటిష్టం చేయలేకపోతున్నారు.

జనసేన పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పని చేయడానికి సిద్దంగా ఉన్నారనే విషయం గత వారం నిరసన కార్యమంకు పవన్ ఇచ్చిన పిలుపుకు వచ్చిన రెస్పాన్స్ ను చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది . కాబట్టి వాళ్ళను సైన్యంగా మార్చుకుని వారంలో కనీసం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించగలిగితే బాగుంటుంది. అప్పుడప్పుడు చుట్టం చూపు పర్యటనలే గాని… ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టె కార్యక్రమాలు చేయడంలో జనసేనాని విఫలం అవుతున్నారు. నిర్మాణాత్మక విమర్శలు చేయడంలో కూడా పవన్ సఫలం కావడం లేదు. మీడియా సమావేశాలకు కూడా ఆయన దూరంగానే ఉంటున్నారు. మరి పవన్ ఆలోచన ఎప్పుడు మారుతుందో పార్టీ ఎప్పుడు బలోపేతం అవుతుందో చూడాలి.

Also Read : ‘దేశం’ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది