iDreamPost
iDreamPost
ఉత్తరప్రదేశ్లో ఎన్నికల రంగం రోజురోజుకూ రంగులు మారుతోంది. పార్టీల ఎత్తులు పైఎత్తులతో శరవేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. పేరుకు నాలుగు ప్రధాన పార్టీలు రంగంలో ఉన్నా బీజేపీ, సమాజ్వాదీ పార్టీల మధ్యే నువ్వా నేనా అన్నట్లు పోటీ జరుగుతోంది. ఇటీవల ముగ్గురు ఓబీసీ వర్గానికి చెందిన మంత్రులు సహా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు బీజేపీని వీడి ఎస్పీలో చేరగా.. కమలం నేతలు ఏకంగా ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ కుటుంబాన్నే చీల్చారు. ఆయన చిన్న కోడలు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ మరదలు అయిన అపర్ణ యాదవ్ ను తమ పార్టీలోకి లాక్కున్నారు. అంతేకాకుండా తాజాగా అఖిలేష్ పైనే ఆమెను పోటీకి దించడానికి సిద్ధం అవుతున్నారు. అపర్ణ కూడా దానికి సై అంటున్నారు. దాంతో ములాయం కోటలోని కర్హాల్ నియోజకవర్గం వేదికగా బిగ్ ఫైట్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
వ్యూహాత్మకంగా అభ్యర్థిని ప్రకటించని బీజేపీ
ఎస్పీ సీఎం అభ్యర్థి అయిన అఖిలేష్ యాదవ్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మెయిన్ పురి జిల్లాలోని కర్హాల్ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. మూడో దశలో ఫిబ్రవరి 20న పోలింగ్ జరిగే ఈ నియోజకవర్గంలో నామినేషన్ల దాఖలుకు రెండు రోజుల గడువే ఉంది. అఖిలేష్ సోమవారం(ఈ నెల 31) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా జ్ఞానవతి యాదవ్, బీఎస్పీ అభ్యర్థిగా కులదీప్ యాదవ్ లను ప్రకటించాయి. కానీ అధికార బీజేపీ మాత్రం ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అఖిలేష్ కు ధీటైన అభ్యర్థి కోసం అన్వేషించిన ఆ పార్టీ.. చివరికి ఆయన మరదలు అపర్ణ యాదవ్ నే రంగంలోకి దించాలని నిర్ణయించినట్లు సమాచారం. స్థానికంగా అదే ప్రచారం జరుగుతోంది.
అయితే బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా అభ్యర్థి ప్రకటనలో జాప్యం చేస్తోంది. అఖిలేష్ నామినేషన్ వేసిన తర్వాత ప్రకటించవచ్చని అంటున్నారు. మెయిన్ పురి జిల్లా సమాజ్వాదీ పార్టీకి, ములాయం కుటుంబానికి కంచుకోట. అటువంటి చోట ఇంకెవరిని పోటీకి పెట్టినా ప్రయోజనం ఉండదని భావిస్తున్న బీజేపీ అఖిలేష్ కు అదే కుటుంబ సభ్యురాలైన అపర్ణతోనే చెక్ పెట్టాలని భావిస్తోంది.
సై అంటున్న అపర్ణ
బావ అఖిలేష్ పై పోటీకి అపర్ణ యాదవ్ సై అంటున్నారు. ఒక టీవీ చానల్ చర్చలో పాల్గొన్న ఆమె దీనిపై స్పందించారు. 2017 ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గంలో తాను పోటీ చేశానని, అక్కడే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అయితే బీజేపీ నాయకత్వం ఆదేశిస్తే కర్హాల్లో అఖిలేష్ యాదవ్ పై పోటీకి సిద్ధమేనని స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరినప్పుడు తన మామ ములాయం సింగ్ ఆశీర్వదించిన విషయాన్ని గుర్తుచేస్తూ ఇప్పుడు కూడా ఆయన ఆశీస్సులు తనకు లభిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే జరిగి అఖిలేష్, అపర్ణ తలపడితే కర్హాల్ ములాయం వారసుల రణక్షేత్రంగా మారిపోతుంది.