iDreamPost
android-app
ios-app

ఆలీని జ‌గ‌న్ అందుకే ర‌మ్మ‌న్నారా?

ఆలీని జ‌గ‌న్ అందుకే ర‌మ్మ‌న్నారా?

ఏపీలోని సినిమా హాళ్ల టికెట్ ధ‌ర‌ల‌పై చ‌ర్చించేందుకు టాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖులు నిన్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో భేటీ అయిన విష‌యం తెలిసిందే. ఆ భేటీలో సినీన‌టులు ఆలీ కూడా పాల్గొన్నారు. సీఎంను క‌లిసేందుకు రావాల‌ని అదే రోజు ఆహ్వానం అండంతో టికెట్ ధ‌ర‌ల‌పైనే చ‌ర్చ‌ల‌కు పిలిచి ఉంటార‌ని ఆలీ కూడా భావించారు. అయితే.. ఆయ‌న‌కు జగన్ ఊహించని ఆఫర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. మరో వారంలో కలుద్దాం.. గుడ్ న్యూస్ చెబుతా.. ఆ సంద‌ర్భంగా ఆలీతో అన్న‌ట్లు స‌మాచారం. దీని ద్వారా జగన్ ఆలోచన ఏంటనేది స్పష్టత వచ్చింది. ప్రత్యేకంగా ఆలీని పిలిచి సీఎం జగన్ చెప్పటం ద్వారా ఆయ‌న‌కు రాజ్య‌స‌భ ప‌ద‌వి ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

మరో మూడు నెలల తర్వాత ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు ఎంపిక కానున్నారు. అందులో ఒక సీటు మైనార్టీలకు ఇచ్చే ఆలోచనలో ఉన్న జగన్‌… ఆ అవకాశం ఆలీకి కల్పించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గత ఎన్నికల సందర్భంగా రాజమండ్రి అసెంబ్లీ టికెట్‌ ఆశించిన ఆలీకి ఆ అవకాశం దక్కలేదు. అయినా వైసీపీ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రెండున్నరేళ్లుగా పదవికోసం ఎదురుచూస్తున్న ఆలీ పేరు ఇటీవల ఎమ్మెల్సీ స్థానాల భర్తీ సందర్భంగా ప్రచారంలోకి వచ్చినా అప్పుడూ నిరాశే ఎదురైంది. దీంతో ఇప్పుడు రాజ్యసభకు పంపే అవకాశముందన్న చర్చ జోరందుకుంది. ఈ విషయమై ఆలీని ప‌లువురు సంప్రదించగా ‘సీఎం తర్వాత కలవమన్నారు.. ఏమిస్తారో నాకు తెలీదు’ అని పేర్కొన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ కేటాయించిన ప‌ద‌వులు అన్నింటిలోనూ సామాజిక సమీకరణాలను పక్కాగా పాటిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరిన ఆలీ పార్టీ తరపున ప్రచారం చేశారు. ఈ ఏడాది జూలైలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో విజయ సాయిరెడ్డి, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు ఉన్నారు. వారిలో విజయ సాయిరెడ్డికి తిరిగి వైసీపీ నుంచి రెన్యువల్ అయ్యే అవకాశం ఉంది. ఇక, బీసీ కోటాలో యాదవ వర్గానికి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇక, మూడో స్థానం మైనార్టీ వర్గానికి ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. మైనార్టీ కోటాలో ఆలీకి ఛాన్స్ ఉంటుంద‌ని తెలుస్తోంది. అదే విషయాన్ని సీఎం జగన్ ఆలీకి పరోక్షంగా వెల్లడించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Also Read : ప్రధాని అనుకుంటే సమస్యల పరిష్కారం ఎంత పని అంటున్న ఎంపీ