Idream media
Idream media
మాజీ మంత్రి, టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజారపు అచ్చెం నాయుడు మళ్లీ ఆరెస్ట్ అవుతారా..? అరెస్ట్ చేస్తే.. ఏ విభాగం వారు చేస్తారు..? ఏ కేసుపై అరెస్ట్ చేస్తారు..? ఇవీ ఈ రోజు రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో మెదులుతున్న ప్రశ్నలు. గత ఏడాది ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెం నాయుడను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో జుడిషియల్ రిమాండ్‌లో ఉండి.. దాదాపు 70 రోజుల తర్వాత బెయిల్‌పై ఆస్పత్రి నుంచే అచ్చెం నాయుడు బయటకు వచ్చారు.
అచ్చెం నాయుడు మళ్లీ అరెస్ట్ విషయం చర్చలోకి రావడానికి తాగా ఆయన చేసిన వ్యాఖ్యలే కారణం. జూమ్ మహానాడులో మాట్లాడిన అచ్చెం నాయుడు.. తనను మళ్లీ అరెస్ట్ చేస్తారని కొంత మంది మెసేజ్‌లు పెడుతున్నారంటూ చెప్పారు. ఎప్పుడు వచ్చినా.. టీ షర్ట్, పంచె కట్టుకుని సిద్ధంగా ఉంటానంటూ టీడీపీ శ్రేణులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అచ్చెం నాయుడు ఏ ఉద్దేశంతో ఇలా అన్నారో గానీ.. ఇంతకూ అయన మళ్లీ ఎందుకు అరెస్ట్ అవుతారు..? అనే సందేహం తలెత్తింది. మంత్రిగా ఉన్న సమయంలో ఈఎస్‌ఐ ఆస్పత్రుల సేవలు, పరికరాల కొనుగోళ్లలో 150 కోట్ల మేర అవినీతి జరిగిన వ్యవహారంలో గత ఏడాది అచ్చెం నాయుడు అరెస్ట్ అయ్యారు. మరి ఈ సారి ఏ నేరం మీద తనను అరెస్ట్ చేస్తారనేది మాత్రం అచ్చెం నాయుడు వెల్లడించలేదు.
తనను అరెస్ట్ చేస్తారంటూ చెప్పిన అచ్చెం నాయుడు.. ఈ విషయం మెసేజ్‌ల ద్వారా చెబుతున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇంతకూ ఆయనకు మెసేజ్‌లు పెట్టిన వారు ఎవరు..? అధికారులా..? లేక అధికార పార్టీ నేతలా..? బెదిరించేందుకే అలాంటి మెసేజ్‌లు పెడతారు. అచ్చెం నాయుడు కూడా తనను బెదిరిస్తున్నారనే కోణంలోనే మాట్లాడారు. మరి తనను బెదిరించిన వారి పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదన్నదే ప్రధాన ప్రశ్న. మెసేజ్‌లు ఫోన్ ద్వారానో లేదా ఈ మెయిల్ ద్వారానో వస్తాయి. ఆయా వివరాలను మాత్రం అచ్చెం నాయుడు ఎందుకు బయటపెట్టడం లేదు. తనను బెదిరిస్తున్నారని పోలీసులుకు ఫిర్యాదు చేయొచ్చు లేదా కోర్టులను ఆశ్రయించవచ్చు. ఆ మెసేజ్‌లు గుర్తుతెలియని వారి నుంచి వస్తే.. సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరుతూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేయవచ్చు. టీడీపీకి ఉన్న మీడియా బలంతో విస్తృత ప్రచారం, ప్రజల్లో సానుభూతి పొందవచ్చు. నిజంగా అచ్చెం నాయుడును బెదిరించేలా మెసేజ్‌లు వస్తే.. ఇన్ని అవకాశాలు ఆయన ఎందుకు వదులుకుంటున్నట్లు..?