iDreamPost
android-app
ios-app

T10 లీగ్ లో ఊహకందని విధ్వంసం.. 30 బంతుల్లోనే సెంచరీ!

  • Author Soma Sekhar Published - 09:48 AM, Tue - 17 October 23
  • Author Soma Sekhar Published - 09:48 AM, Tue - 17 October 23
T10 లీగ్ లో ఊహకందని విధ్వంసం.. 30 బంతుల్లోనే సెంచరీ!

ఓ వైపు ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లు క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తుంటే.. మరోవైపు ఇతర దేశాల్లో జరుగుతున్న క్రికెట్ లీగ్ లు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లుగా చెలరేగి పోతున్నాయి. రికార్డులు కొల్లగొడుతూ.. విధ్వంసాలు సృష్టిస్తున్నారు బ్యాటర్లు. తాజాగా యూరోపియన్ క్రికెట్ లీగ్ టీ10లో రికార్డు సెంచరీ నమోదు అయ్యింది. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ ఐర్లాండ్ బ్యాటర్ కేవలం 30 బంతుల్లోనే శతకం బాది క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీంతో ఆ జట్టు కేవలం 10 ఓవర్లలోనే 216 పరుగుల రికార్డు స్కోర్ నమోదు చేసింది. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

యూరోపియన్ క్రికెట్ లీగ్ టీ10లో భాగంగా తాజాగా ఐర్లాండ్-స్పెయిన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఊహకందని విధ్వంసాన్ని సృష్టించాడు ఐర్లాండ్ బ్యాటర్ టిమ్ టెక్టార్. ప్రత్యర్థి బౌలర్లపై సిక్సుల యుద్ధాన్ని ప్రకటించాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ.. కేవలం 30 బంతుల్లోనే శతకంతో చెలరేగాడు. అతడి ఆట ముందు స్పెయిన్ బౌలర్లు చేతులెత్తేసి, ప్రేక్షక పాత్ర పోషించారు. ఓవరాల్ గా 32 బంతులు ఎదుర్కొన్న టెక్టార్ 5 ఫోర్లు, 13 సిక్స్ లతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఈ మ్యాచ్ లో అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 337 ఉండటం గమనార్హం. టెక్టార్ వీర బాదుడికి ఐర్లాండ్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. జట్టులో మరో బ్యాటర్ సీముస్ లించ్ కేవలం 13 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. అనంతరం 217 పరుగుల భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన స్పెయిన్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులే చేసి.. 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరి యూరోపియన్ లీగ్ లో టెక్టార్ సృష్టించిన విధ్వంసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.