Idream media
Idream media
తమిళనాడు కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) నియామకం నాటకీయ పరిణామాలకు దారితీస్తోంది. ముఖ్యంగా డీఎంకే పార్టీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత స్టాలిన్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన సర్కార్ ప్రస్తుతం బీజేపీతో తాడో పేడో తేల్చుకునేలా వ్యవహరిస్తోంది. తాజాగా సంచలన ఐపీఎస్ ఆఫీసర్ పి. కందస్వామిని, స్టాలిన్ ప్రభుత్వం DGPగా నియమించింది. కందస్వామి ట్రాక్ రికార్డు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన 2010లో నేటి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సొహ్రాబుద్దీన్ ఫేక్ ఎన్ కౌంటర్ కేసులో అరెస్టు చేసిన అధికారిగా పేరుపొందారు.
ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా, ఆనాడు గుజరాత్ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో సోహ్రబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసు సంచలనంగా మారింది. ఆ కేసులో ఆనాటి గుజరాత్ హోం మంత్రి అమిత్ షా ఆరోపణలు ఎదుర్కొనగా కందస్వామి ఆయనను అరెస్టు చేశారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి సంచలన ఆఫీసర్ నే ఆయన్ని విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్, డీజీపీగా తమిళనాడు ప్రభుత్వం నియమించింది. దీంతో స్టాలిన్ ప్రభుత్వం కేంద్రంలోని మోదీ సర్కార్ తో సామరస్యంగా ఉండేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదని పరోక్షంగా తెలిపింది. ఎన్నికలు పూర్తయ్యాక డీఎంకే ప్రభుత్వం మోదీ సర్కార్ తో కాంప్రమైజ్ అవుతుందని అంతా భావించారు. కానీ స్టాలిన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే స్టాలిన్ తమ సర్కార్ అధికారంలోకి వస్తే, అన్నాడీఎంకే ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన మంత్రులపై విచారణకు ఆదేశిస్తామని, అవసరం అయితే జైలుకు పంపుతామని పదే పదే అన్నారు. మాజీ సీఎం పళనిస్వామి, ఆయన మంత్రులపై అప్పట్లో స్టాలిన్ పలు అవినీతి ఆరోపణలు చేశారు. గవర్నర్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌కి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే అన్నాడీఎంకే ప్రభుత్వానికి కేంద్రంలోని బీజేపీ అండదండలు ఉన్నాయని స్టాలిన్ బలంగా నమ్మారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో చాలా కామన్ గా కనిపించే ప్రతీకార రాజకీయాలకు స్టాలిన్ కూడా ఆజ్యం పోస్తున్నారని తాజాగా కందస్వామి నియామకంతో రుజువు అవుతోంది.
ఇదిలా ఉంటే కేంద్రంలో మోదీ సర్కారు పేరుకు ఎన్డీఏ కూటమిగా అధికారంలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆ కూటమిలో కేవలం బీజేపీ మాత్రమే పూర్తి మెజారిటీతో ఉన్న సర్కారుగా ఉంది. మిత్రపక్షాలు కేవలం నామ్ కే వాస్తే అన్నట్లు ఉన్నారు. ఇఫ్పటికే ఎన్డీఏ కూటమిలోని అతిపెద్ద భాగ స్వామ్య పక్షాలైన శివసేన, అకాలీదళ్, టీడీపీ దూరం అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా మరో ప్రధాన రాజకీయ పక్షం నిలబడే సమయం ఆసన్నమైందని, తాజా ఎన్నికలు తేల్చాయి. అటు దీదీ, ఇటు స్టాలిన్ ఇరువురు కూడా కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకే సిద్ధమవడం గమనార్హం.