కరోనా ఐపీఎల్ ను సైతం ఆపేసింది. బయో బబుల్ లో ఆటగాళ్లు అందరూ సురక్షితంగా ఉన్నారని భావించినప్పటికీ, ఒకే సారి కొందరు ఆటగాళ్లతో పాటు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పటికే ఒక మ్యాచ్ రీషెడ్యూల్ చేశారు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య సోమవారం జరగాల్సిన మ్యాచ్ ను రీషెడ్యూల్ చేసిన ఐపీఎల్ యాజమాన్యం మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ కూడా జరిగే అవకాశం లేకపోవడం, మరోపక్క చెన్నై సూపర్ కింగ్స్ టీం లో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో ఐపీఎల్ పై పునరాలోచించి నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్‌ను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. తాజాగా మరో ఇద్దరు క్రికెటర్లు కోవిడ్ బారిన పడ్డారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్ మిశ్రాకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఇక కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఇప్పటికే రెండు ఐపీఎల్ మ్యాచ్‌లను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జట్లు ఐసోలేషన్‌లో ఉండటం, బయో బబుల్‌లో ఉన్నా ఆటగాళ్లు కరోనా బారిన పడుతుండటంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ధ్రువీకరించారు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, సూపర్ కింగ్స్ సిబ్బంది ఒకరు కరోనా బారిన పడటంతో మంగళవారం మ్యాచ్కు తమకు అందుబాటులో ఉండబొమని ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తెలిపింది. దీంతో మంగళవారం మ్యాచ్ కూడా రద్దు అవుతుందని భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణ సాధ్యం కాదని బిసి పెద్దలు తేలినట్లు తెలిసింది.
కరోనా బయో బబుల్ ను తెంచుకొని మరి ఆటగాళ్లపై దండెత్తడం, ప్రతిరోజూ ఒక్కొక్క ఆటగాడికి కరోనా పాజిటివ్ రావడంతో మిగిలిన జట్టు అంతా ఐసొలేషన్ లో ఉండాల్సి రావడం ఇప్పుడు మొత్తం ఐపీఎల్ నిర్వహణ నే ప్రమాదంలోకి నెట్టింది. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ప్రేక్షకులు లేకుండానే, ఆటగాళ్లు ఎవరితో కలవకుండానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ సీజన్లో జరిపించాలని భావించారు. గత సీజన్లోనే దుబాయిలో పెట్టిన మ్యాచ్ లు ఈసారి స్వదేశంలోని నిర్వహించాలని భావించారు. టోర్నీలో ఇప్పటి వరకు సగం మ్యాచ్లు అయిపోయిన క్రమంలో ఇప్పుడు అకస్మాత్తుగా కరోనా భయం బీసీసీఐ పెద్దలను కలవరపరిచింది. మొదట కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు చక్రవర్తికి కరోనా పాజిటివ్ రావడంతో మొదలైన అలజడి తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ పోయింది. ప్రతిరోజూ ఒక ఆటగాడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవడంతో విధిలేని పరిస్థితుల్లోనే బీసీసీఐ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.