Idream media
Idream media
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 ప్రారంభ మ్యాచ్ మార్చి 29న వాంఖడే స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్,చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్నది.
13వ సీజన్ లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ శనివారం ఫ్రాంచైజీలకు అందించగా కొద్దిసేపటి క్రితం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 1న హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్‌తో ఆడనుంది.ఈ షెడ్యూల్ ప్రకారము లీగ్ ఆఖరి మ్యాచ్ మే 17న ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ మధ్య జరుగుతుంది. అయితే ఈసారి డబుల్ హెడర్స్ (ఒకే రోజు రెండు మ్యాచ్‌లు) సంఖ్య తగ్గించడంతో గత ఐపీఎల్ సీజన్ లకు భిన్నంగా లీగ్ దశ 50 రోజుల పాటు కొనసాగనుంది.
లీగ్ దశలో మొత్తం 56 మ్యాచ్‌లు జరగనుండగా డబుల్ హెడర్స్ సంఖ్యను ఆరు ఆదివారాలకే పరిమితం చేశారు.మరోవైపు నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించలేదు. ఐపీఎల్ షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించడానికి ముందుగానే మూడు ఫ్రాంచైజీలు తాము ఆడబోయే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ట్విట్టర్ లో ప్రకటించాయి.ఈ షెడ్యూల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్,కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ట్వీట్ చేశాయి.స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ముగిసిన తర్వాత పది రోజుల విరామంతో క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన ఐపీఎల్ పండుగకు తెరలేవనుంది.