Krishna Kowshik
Krishna Kowshik
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన సంగతి విదితమే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ స్కాం జరిగిందన్న ఆరోపణలపై నంద్యాలలో ఆయన్ను అరెస్టు చేసి, విజయవాడకు తరలించారు ఏపీ సీఐడీ పోలీసులు. మరికొన్ని గంటల్లో ఆయనను కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇదిలా ఉంటే.. ఆయన అరెస్టును బీజెపీ, జనసేన, సీపీఐ తీవ్రంగా ఖండిస్తున్నారు. కాగా, ఈ కుంభకోణం పూర్తి వివరాలను వెల్లడించారు సీఐడీ అదనపు డీజీ ఎన్ సంజయ్. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు అరెస్టు వెనుక కారణాలను వెల్లడించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరిట రూ . 550 కోట్ల స్కామ్ జరిగిందని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలోనే ఈ స్కామ్ జరిగిందని తెలిపారు. ఈ కుంభకోణంలో ముఖ్యమైన పత్రాలు మాయం అయ్యాయని, వాటి వెనుక చంద్రబాబు హస్తం ఉందని తెలిపారు.
క్యాబినేట్ ఆమోదం లేకుండానే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని సంజయ్ పేర్కొన్నారు. ఏంవోయూ సైన్ చేసేనాటికి జులై 2014 నాటికి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లేదని, అయితే హైయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్, సీమెన్స్ కంపెనీతో ఒప్పందం ఓ ఎంవోయూ ద్వారా ప్రారంభమైందన్నారు. ఆ కార్పొరేషన్ హెడ్‌గా గంటా సుబ్బారావును నియమించారు. ఆయనకు కొన్ని నెలల వ్యవధిలోనే ఎక్స్ అఫీషియో సెక్రటరీ టూ హైయ్యర్ ఎడ్యుకేషన్, ఎక్స్ అఫీషియో సెక్రటరీ టూ చీఫ్ మినిస్టర్, ఎండీ, సీఈవో ఆఫ్ సిల్క్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వంటి మరో నాలుగు పదవులను సుబ్బారావుకు కట్టబెట్టారని తెలిపారు. సీమెన్స్ కంపెనీతో డీజెన్ టెక్ కంపెనీ ఒప్పందం కుదిర్చిందని, ఆ తర్వాత ఏడాదికే ఆ సంస్థ సీనియర్ ఆఫీసర్ జీవీఎస్ భాస్కర్ భార్య ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అపర్ణను ఈ కార్పొరేషన్‌కు డిప్యూటీ సీఈఓగా నియమించారని పేర్కొన్నారు.ఈ మొత్తం ఆర్థిక లావాదేవీల్లో ఆమె పాత్ర కూడా ఉన్నట్లు వెల్లడించారు. జీఎస్టీ ద్వారా ఈ కుంభకోణం బయటపడిందని చెప్పారు.
రూ.2500 కోట్లకు పైగా పెట్టుబడులు సీమెన్స్ కంపెనీ ద్వారా వస్తున్నాయని అసెంబ్లీలో అప్పట్లో ప్రకటించిన చంద్రబాబు.. ఆ పెట్టుబడికిగానూ ప్రభుత్వ వాటా కింద రూ.371 కోట్లు విడుదల రిలీజ్ చేయవలసి ఉంటుందన్నారు. సిమెన్స్ సంస్థ నుంచి రూ.550 కోట్లు పెట్టుబడి వస్తుందని పేర్కొంటూ ప్రభుత్వ జీవోల ద్వారా రూ.371 కోట్లు ఇచ్చేశారు. దీనికి కేబినెట్ ఆమోదం కూడా లేదని, రూ.540 కోట్ల వ్యయం అయ్యే 6 సెంటర్ ఆఫ్ ఎక్‌లెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఒప్పందం చేసుకున్నారన్నారు. రూ.3 వేల కోట్లతో అన్ని కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రూ.58 కోట్లతో సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారని తెలిపారు. ఈ అమౌంట్ నే ఎక్కువగా చేసి చూపించి కుట్రకు తెరలేపారన్నారు. అయితే సీమెన్స్ నుండి 90 శాతం పెట్టుబడులు రాకపోవడంపై మానిటరింగ్ కమిటీ వేసి పైపైన అడిగారు తప్ప.. ఎందుకు రాలేదని ప్రశ్నించలేదన్నారు. షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ఆ డబ్బులను రూ. 371 కోట్లను వాటికి మళ్లించారని తెలిపారు.షెల్ కంపెనీల ద్వారా అక్రమాలకు పాల్పడిన వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు ప్రధాన కుట్రదారని, వికాస్ కన్వెల్కర్ సహా ఇతర నిందితులు ఈ అక్రమాల్లో నిందితులుగా ఉన్నారని వెల్లడించారు. మరో ఇద్దరు నిందితులు విదేశాలకు పరారయ్యారని, వారిని సీఐడీ రప్పించి.. విచారణ జరుపుతుందని సంజయ్ వెల్లడించారు.