Idream media
Idream media
బతకాలంటే సైన్స్ తప్ప ఫిలాసఫీ పనికి రాదు. భగవన్నామ సంకీర్తన చేస్తూ రోడ్డు దాటుతానంటే కుదరదు. నీ దేవుడెవరో ఎదురుగా వచ్చే లారీ డ్రైవర్‌కి తెలియదు. దాని వేగాన్ని అంచనా వేసి జాగ్రత్తగా పక్కకి తప్పుకోవాలి. శరీరంలో కెమిస్ట్రీ వుంటుంది. లడ్డూని తింటాం కదా అని అదే సైజ్‌లో వున్న రాయిని తినలేం.
మనం జ్ఞానులమైనా , శుంఠలమైనా సైన్స్‌కి ఒకటే. ఒక సైంటిస్ట్ మేడపై నుంచి దూకినా, పిచ్చివాడు దూకినా ఇద్దరికీ ఒకటే సూత్రం. గురుత్వాకర్షణ శక్తి మారదు. సైన్స్, లెక్కల ప్రకారం బతికితే రోబోలవుతాం. లోపల ఆత్మ ఒకటుంటుంది. అదే సైన్స్‌ని కనిపెడుతుంది. దాన్నే బ్రహ్మ అని వేదాంతులంటారు.
చూస్తున్నది కన్ను కాదు, నువ్వు కన్ను తెరిస్తే బయటి ప్రపంచం, మూస్తే లోపలి ప్రపంచం , అంటే నువ్వు .(కేన ఉపనిషత్)ప్రపంచంలో పలకడానికి అత్య ంత సులభమైన పదాలు నువ్వు, నేను. అర్థం చేసుకోడానికి కష్టమైన పదాలు కూడా అవే.
నేను అంటే తెలుసుకోలేక ప్రపంచం పుట్టినప్పటి నుంచి మహాయోగులు, మునులు కూడా తలకిందులైపోయారు. వేదాలు చదివినంత సులభం కాదు, మన లోపలి మనిషిని చదవడం.
మల్లెపూలు మనసుకి ఆహ్లాదం కలిగిస్తాయని బోటనీ చెప్పదు. పూలు, మొక్కలకి సంబంధించిన వర్గీకరణే దానికి తెలుసు. ఈస్తటిక్స్‌కి నిర్వచనం లేదు. కాశ్మీర్ ప్రకృతి అద్భుతం. కానీ పడవ నడిపే వాడికీ మంచులో కాపలా కాసే సైనికుడికి ఆ అందం భయం కలిగించొచ్చు. వాతావరణం ఒకటే, అనుభూతులు వేరు.
దీపం భక్తి భావం. మంట భయం. ఉలిగా మారిన ఇనుము శిల్పాన్ని చెక్కితే , కత్తిగా మారిన ఇనుము ప్రాణాన్ని తీస్తుంది. దేవుడు నిజంగా మంచివాడైతే అడవికి సింహాన్ని రాజుగా ఎందుకు నియమిస్తాడు?
వంటింట్లో నుంచి పొగ వస్తే సంబరం. తుపాకీ గొట్టంలోంచి వస్తే విషాదం. పొగ ఒకటే, ఫలితం వేరు. జీవిత కాలపు కళా తపస్సు కూడా ఆయుధం ముందు ఓడిపోతుంది. హిట్లర్ ఎందరో కళాకారుల్ని చంపేశాడు. హిట్లర్ పోయాడు. ధ్వ ంసమైనా సరై, కళ మళ్లీ బతికింది.
మన చుట్టూ వున్న ప్రతిదీ ఎవరో ఒకరి శ్రమ, లేదా కల. ఒక బర్రె కాస్త మేత తిని , దూడ కోసం దాచుకున్న పాలని, ఒక పేదరాలు పిండి పాలకేంద్రానికి పోస్తే అనేక మంది శ్రమ జీవుల చేతుల్లోంచి జారి, బతుకు కోసం తెల్లారి లేచిన కుర్రాడు పాల ప్యాకెట్ విసురుతాడు. చంటి బిడ్డల్ని చెట్టు నీడ కింద పెట్టి కాఫీ తోటల్లో రోజుకి పది గంటలు కూలీలు పని చేస్తారు.
మనమెపుడు చూడని ఒక రైతు చెరుకు తోటలో కష్టం చేస్తే చక్కెర. కాఫీ తాగే ముందు ఒక జంతువుకి, కార్మికుడికి, రైతుకి దండం పెట్టుకో.
మనం తినే ప్రతి మెతుకూ , ఒక రైతు రక్తపు చినుకు!