Idream media
Idream media
బ్రిటీష్ దొరలు గార్డెన్‌లో కూచుని , కబుర్లు చెబుతూ వేడివేడి టీ తాగేవాళ్లు. తమ సౌఖ్యం కోసం ఇండియాలో టీ ప్లాంటేషన్ ప్రారంభించారు. వాళ్ల రోజువారీ అలవాటు లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని , ఇండియాలోని ప్రతి గ్రామంలోనూ టీ స్టాల్స్ వెలుస్తాయని దొరలు ఊహించలేదు. టీ లేని జీవితం జీవితమే కాదు. ఎందరో టీ మాస్టర్లు. కొందరే గుర్తున్నారు.
చిన్నప్పుడు రాయదుర్గంలో సుంకన్న టీ అంగడి మా ఫేవరెట్. ఇంట్లో తెలిస్తే తంతారు కాబట్టి దొంగగా వెళ్లి తాగేవాళ్లం. కప్పు ఐదు పైసలు. సుంకన్న మాసిపోయిన బనియన్, మరకల అడ్డ పంచె, భుజాన ఎర్రటి తువ్వాలుతో ఉండేవాడు. చక్కెర ఎక్కువ వేయమంటే విసుగ్గా చూసేవాడు. ఆ రోజుల్లో షుగర్ కావాలంటే రేషన్ షాపు ముందర మైళ్ల కొద్దీ క్యూలో నించోవాలి, లేదా బ్లాక్‌లో కొనుక్కోవాలి.
“సక్కరి భలే పిరిం అప్పయా” అని గొణుక్కుంటూ వేసేవాడు.
లక్ష్మీవిలాస్‌లో టీ పది పైసలు. అక్కడ రత్నాకర్ అనే సప్లయిర్ ప్రేమగా పలకరించేవాడు. తర్వాత ఈయన సొంతంగా వ్యాపారం చేయడానికి ప్రయత్నించి అప్పుల బాధతో చనిపోయాడు. లక్ష్మీ బజార్‌లోనే స్వామి హోటల్ వుండేది. ఇద్దరు అన్నదమ్ములు నడిపేవాళ్లు. కుకింగ్, సప్లయ్, క్లీనింగ్ అంతా వాళ్లే. వాళ్ల మొహంలో ఏ Expression వుండేది కాదు. ఒకసారి టీ గ్లాసు పగలగొడితే చిన్న స్వామి వచ్చి పరకతో గాజు పెంకులు ఊడ్చి కూల్‌గా కౌంటర్‌లో కూచున్నాడు. తిట్టలేదు, ఎందుకు పగలగొట్టావని అడగలేదు. ఎమోషన్ లేనివాళ్లని ఫేస్ చేయడం భలే కష్టం.
ఆ రోజుల్లో టీ పౌడర్ చిన్న పాకెట్లలో అమ్మేవాళ్లు. పాకెట్‌పైన ఐదు పైసలు బొమ్మ వుంటే అది దాని ఖరీదు. పావలా పాకెట్ వరకూ దొరికేవి. మా స్కూల్ దగ్గర చిన్న టీ స్టాల్ ఒక గుడిసెలో ఉండేది. మనం టీ చెబితే రెండు టీ అని గట్టిగా అరిచి, తానే టీ చేసుకుని వచ్చేవాడు. టీ పౌడర్ స్టాక్ పెట్టుకునేంత దుడ్డు ఉన్న మనిషి కాదు. పది పైసల టీ పాకెట్‌ను కొని తెచ్చి టీ చేసి ఇచ్చేవాడు.
అనంతపురంలో 1976 నాటికి ఐదారు పెద్ద ఇరానీ కేఫ్‌లుండేవి. ఆరామ్ హోటల్‌లో టీ తాగేది తక్కువ, కబుర్లు ఎక్కువ. స్టార్ కేఫ్ , రాయలసీమ హోటల్‌లో టీ రుచితో పాటు మధురమైన జ్ఞాపకాలు బతికున్నంత కాలం గుర్తుంటాయి. లలిత కళాపరిషత్ ఎదురుగా ఒక కేఫ్ ఉండేది. ఓనర్‌కి నలుగురు ఆడపిల్లలు. వాళ్లే మెయింటెన్ చేసేవాళ్లు. 80లో ఆడపిల్లలు తండ్రికి తోడుగా కేఫ్ నడపడం చాలా గొప్ప విషయం.
ఎస్కే యూనివర్సిటీ హాస్టల్‌లో సాయంత్రం టీ ఇచ్చేవాళ్లు. అది తాగితే జీవితమే చేదుగా అనిపించేది. క్యాంపస్ చుట్టుపక్కల చిన్నచిన్న కొట్టాల్లో ఐదారు టీ హోటళ్లు ఉండేవి. ప్రతి హోటల్లోనూ ఒక టీనేజ్ అమ్మాయి కబుర్లు చెబుతూ సర్వ్ చేసేది. అదో ఆకర్షణ. లవ్ ఎపిసోడ్స్, గొడవలు కూడా జరిగేవి.
తిరుపతి ఆంధ్రజ్యోతి క్యాంటీన్‌లో టీ తాగితే అదో ఘోరం. “మీరిచ్చే అర్ధ రూపాయికి అస్సాం నుంచి టీ పొడి తెప్పించమంటారా” అని క్యాంటీన్ ఓనర్ జోకులేసేవాడు. విపరీతమైన సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న మనిషి. సరదా మనుషుల్ని లోకం బతకనీయదు. ఆత్మహత్య చేసుకున్నాడు.
క్యాంటీన్ టీని భరించలేక ఆఫీస్‌కి కొంచెం దూరంలో వెళ్లి టీ తాగేవాళ్లం. టీ మాస్టర్ సన్నగా, పొడుగ్గా ఉండేవాడు. ముగ్గురు పిల్లలు. అదే బతుకుతెరువు. ఒక రోజు ఈతకెళ్లి ఫిట్స్ వచ్చి చనిపోయాడు. ఆయన భార్య ధైర్యంగా టీ స్టాల్ నడిపి ముగ్గురు పిల్లల్ని పెద్ద చేసింది.
1988లో తిరుపతిలో డీలక్స్ అన్నెక్స్ చాలా ఫేమస్. టీ , సిగరెట్లు సాహిత్యంతో చాలా గంటలు గడిచేవి. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఈ నగరం టీ ప్రియులకి స్వర్గం. ఇప్పుడు తగ్గిపోయాయి కానీ 99లో ఎటు చూసినా కేఫ్‌లే. దురదృష్టం కొద్దీ సుగర్ వచ్చింది. అయినా మమకారం చంపుకోలేక తాగేవాన్ని. పంజాగుట్టలో బంజారా దర్బార్‌ని మరిచిపోలేం. కేఫ్‌లు మెల్లిగా మాయమైపోతున్నాయి. సెల్ వచ్చిన తర్వాత కొత్త జనరేషన్‌కి మీటింగ్ పాయింట్లు అవసరం పోయింది.
కేఫ్‌లే కాదు , అక్కడ కూచుని కబుర్లు చెప్పిన మిత్రులు కూడా మాయమైపోతున్నారు. ప్రతి మనిషి ఎవరో ఒకరిని పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు కేఫ్‌లు తెరిచినా వాదించి, విభేదించే ఆవేశం లేదు, సిగరెట్ తప్పుకుని దశాబ్దం దాటింది. ఏదో చేయాలనుకున్నా చాలా మంది , ఏం చేయాలో తెలియకుండా మిగిలిపోతున్నారు. టీ ఎప్పటికీ వుంటుంది. మనమే ఉండం.
(మే 21, అంతర్జాతీయ టీ దినోత్సవం. ఒకరోజు ఆలస్యంగా)