తమిళనాడు రాష్ట్రంలో చెన్నై తర్వాత అతి పెద్ద నగరంగా ఉన్న కోయంబత్తూరు రాజకీయాలు ఇప్పుడు వేడెక్కాయి. పశ్చిమ కనుమలకు అతి దగ్గరగా ఉండే ఈ జిల్లా మీద అందరి దృష్టి పడింది. కేరళ సరిహద్దున, తమిళనాడుకు పశ్చిమాన ఉన్న ఈ కీలకమైన జిల్లాను దక్కించుకోవడానికి అన్ని పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే కోయంబత్తూరులో ఈ సారి అధికార పార్టీ అన్నాడిఎంకె ఏకంగా ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడం విశేషం.
బీజేపీ కి కేటాయింపు!
కోయంబత్తూరు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలున్నాయి. కోయంబత్తూరు నగరంలోనే ఐదు స్థానాలు ఉంటే, మిగిలిన రూరల్ ప్రాంతంలో మరో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే కోయంబత్తూరు జిల్లాలో తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఏకంగా 9 స్థానాలు గెలిచింది. దాదాపు అన్నీ జిల్లాల కంటే అత్యధిక స్థానాలు అన్నాడీఎంకేకు ఇక్కడి నుంచే వచ్చాయి. అయితే ఈసారి బీజేపీతో పొత్తులో భాగంగా కోయంబత్తూరు స్థానాలనూ అన్నాడీఎంకే వదులుకుంది. ఏకంగా ఈ జిల్లాలో ఐదు స్థానాలను బిజెపికి కేటాయించింది. ఆ స్థానాలు అన్నింట్లోనూ అన్నాడీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండడం విశేషం. వారికి టికెట్లు నిరాకరించి మిత్ర పక్షానికి అన్నాడిఎంకె టికెట్లు ఇవ్వడం విశేషం.
హిందూ కోణమా?
కోయంబత్తూరు జిల్లా వ్యాప్తంగా హిందూ జనాభా 83.3% ఉంది. ఇక్కడ జరిగే మరియమ్మన్ హిందూ దేవత ఉత్సవాలకు రాష్ట్రం నలు వైపుల నుంచి ఎక్కువమంది వస్తారు. అలాగే శివ భక్తులు ఎక్కువ. దీంతో పాటు కేరళకు ఆనుకొని ఉండే ఈ కీలకమైన జిల్లాలో అధికభాగం ప్రజలు రెండు రాష్ట్రాల్లో ఉనికి చాటుకుంటారు. దీంతో బిజెపి ఈ కీలక రాష్ట్రం మీద దృష్టిపెట్టినట్లు అర్థమవుతోంది. కోయంబత్తూరు జిల్లాలో అన్నాడిఎంకె సహకారంతో అన్ని సీట్లనూ గెలిస్తే కనుక అది కేరళ రాజకీయాల పైన ప్రభావం చూపుతున్నది బీజేపీ అధినాయకత్వం భావన. దీనివల్ల కేరళలోని పాలక్కాడ్ లో కూడా భవిష్యత్తులో ప్రభావం చూపేందుకు ఒక దారి ఏర్పడుతుంది అన్నది బీజేపీ పెద్దల ముందుచూపు. దీంతోనే ఏరికోరి మరీ కోయంబత్తూరు జిల్లాలో 5 సీట్లను బిజెపి అడిగి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మరి సిట్టింగ్ స్థానాలు వదులుకున్న అన్నాడీఎంకే నేతలు బీజేపీ కు ఎలా సహకరిస్తారు అన్నది? ఎన్నికల్లో రెండు పార్టీల నేతలు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్తారు అన్నది కీలకం కానుంది.
Also Read : తమిళనాట ఉదయిస్తున్న సూర్యుడు
తెలుగు వారి ప్రభావం అధికం
ఈ జిల్లాలో ఎక్కువ పరిశ్రమల్లో తెలుగువారు కనిపిస్తారు. కుటీర పరిశ్రమలకు ముఖ్యంగా వస్త్ర పరిశ్రమకు కోయంబత్తూరు పెట్టింది పేరు. దీంతో తరతరాలుగా తెలుగు వారు అక్కడికి వెళ్లి పలు పరిశ్రమలు స్థాపించడం తో పాటు వాటిలో పని చేస్తూ కనిపిస్తారు. కోయంబత్తూరు మొత్తం జనాభాలో తెలుగువారు 12 శాతం వరకు ఉంటారని అంచనా. దీంతోపాటు కోయంబత్తూరు దక్షిణం నుంచి ఈసారి సినీ నటుడు కమల్ హాసన్ మొదటిసారి అసెంబ్లీ బరిలో దిగనున్నారు. కోయంబత్తూరు దక్షిణంలో ఎక్కువమంది తెలుగువారు కనిపిస్తారు. దీంతో ఆయన ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. అక్షరాస్యత లోనూ మెరుగైన స్థితిలో కనిపించే కోయంబత్తూరు రాజకీయాలు ఇప్పుడు అన్ని పార్టీలకు కీలక అమ్మాయి.