Idream media
Idream media
భారత త్రివిధ దళాల అధిపతి (సీడీఎస్) బిపిన్ రావత్‌తో సహా 14 మంది ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ కూలిపోవడానికి కారణం తెలిసింది. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమని దర్యాప్తు బృందం తేల్చింది. ప్రతికూల వాతావరణంలో దారి కనిపించకపోవడంతో పైలెట్ పొరపడ్డారని, ఫలితంగా ఎత్తయిన శిఖరం అంచును ఢీకొన్న హెలికాప్టర్.. అదే వేగంతో కుప్పకూలిందని నిర్ధారించారు.
గత నెల 8వ తేదీన బిపిన్ రావత్ దంపతులు, ఇతర అధికారులతో కూడిన ఆర్మీ హెలికాప్టర్ కోయంబత్తూరు నుంచి వెల్లింగ్టన్ బయలు దేరింది. ఊటి కొండల్లో కనూరు వద్ద.. దట్టమైన మేఘాల్లో హెలికాప్టర్ చిక్కుకుంది. ఒక్కసారిగా మేఘాలు కమ్ముకోవడంతో దారి కనిపించక పైలెట్ ఇబ్బంది పడ్డాడు. దారి సరిగా కనిపించని నేపథ్యంలో పైలెట్.. దారి కోసం రైల్వే లైన్‌ను అనుసరించాడు. ఈ క్రమంలోనే ఎత్తుగా ఉన్న శిఖరం అంచును ఢీ కొన్న హెలికాప్టర్.. కుప్పకూలిందని వాయుసేన చీఫ్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలోని త్రివిధ దళాల అధికారులతో కూడిన దర్యాప్తు బృందం నిర్ధారించింది.
ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు బృందం పలు కోణాల్లో పరిశోధించింది. హెలికాప్టర్ కూలిపోవడానికి సాంకేతిక లోపమా..? లేక అత్యవసర పరిస్థితుల్లో ల్యాండింగ్‌కు ప్రయత్నం చేసే సమయంలో ప్రమాదం జరిగిందా..? అనే కోణాల్లో దర్యాప్తు చేశారు. సమగ్రమైన దర్యాప్తు అనంతరం.. ప్రమాదానికి కారణం ప్రతికూల వాతావరణమేనని తేల్చారు. దర్యాప్తు నివేదికను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అందించారు.
ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న 14 మంది మృతి చెందారు. బిపిన్ రావత్ దంపతులు, ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది చనిపోయారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మృత్యువుతో పోరాడి బెంగుళూరు ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. హెలికాప్టర్ కుప్పకూలడంతో మంటలు చెలరేగాయి. ఫలితంగా.. భౌతికకాయాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. పలువురు భౌతిక కాయాలను డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తించారు.