భయపెడుతోన్న కండ్ల కలక కేసులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

వర్షాకాలం ప్రారంభం అయ్యిందంటే.. చాలు రోగాలు ఈగలు, దోమల్లా ముసురుతాయి. జలుబు, జ్వరంతో పాటుగా సీజనల్‌ వ్యాధులు ప్రబలుతాయి. సాధారణంగా వర్షాకాలంలో వైరల్‌ ఫీవర్‌, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. కానీ ఈ సారి వాటితో పాటుగా కండ్ల కలక కలవరపెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా భారీగా కండ్ల కలక కేసులు నమోదవుతుండటం కలవరపెడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కండ్ల కలక కేసులు నమోదవుతున్నాయి. వర్షాకాలం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఇన్‌ఫెక్షన్‌ సోకి కండ్ల కలక వస్తోందని, గాలిలో ఎక్కువగా ఉండే తేమ.. ఈ బ్యాక్టీరియాకు కారణమవుతోందని, ఇది కళ్లను ప్రభావితం చేస్తుందంటున్నారు వైద్యులు.

ఇక తాజాగా మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సుమారు 260 మందివిద్యార్థులకు ఈ వైరస్ వ్యాపించింది. మరి కండ్ల కలక కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో అసలు ఇది ఎందుకు వస్తుంది.. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. చికిత్స ఏంటి వంటి పూర్తి వివరాలు మీ కోసం..

కారణమేంటి..

బ్యాక్టీరియా, కెమికల్స్, వైరస్‌ ద్వారా కండ్ల కలక వస్తుంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

లక్షణాలు..

  • తెల్ల గుడ్డు ఎరుపు, పింక్‌ కలర్‌లోకి మారుతుంది
  • కంటి నుంచి తరచుగా నీరు కారుతుంది
  • కంటి రెప్పలు వాయడం, ఉబ్బడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • నిద్రించినప్పుడు కంటి రెప్పలు అంటుకుంటాయి.
  • కంటి నుంచి విరీతంగా పూసి రావడం
  • కంటి నొప్పి దురద, మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి.

చికిత్స…

  • యాంటీ బయోటిక్‌ ‘ఐ’ డ్రాప్స్, లుబ్రికాటింగ్‌ ‘ఐ’ డ్రాప్స్‌ వేసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.
  • డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే..

  • మన పరిసరాలలో (ఆఫీస్‌లు, స్కూళ్లు, కళాశాలలు, ఆస్పత్రులు, ఇంటిలో) ఎవరికైనా కండ్ల కలక ఉంటే.. అలాంటి వారికి దూరంగా ఉండాలి.
  • కండ్ల కలక సమస్య ఉన్న వారు వాడిన వస్తువులు (టవల్స్, సబ్బులు ఇతర వస్తువులు) తాకడం, వాడడం చేయొద్దు.
  • ఒకవేళ తప్పని పరిస్థితుల్లో తాకితే తరచూ చేతులను నీటితో శుభ్రం చేసుకోవాలి.
  • కళ్ల కలక వస్తే తప్పని సరిగా కళ్లద్దాలు ఉపయోగించాలి.
  • కండ్ల కలక చాలా సాధారణ కంటి జబ్బు. అయినా మొదట్లోనే దీనిని నివారించుకోవాలి. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు.
  • తరచుగా కళ్లను మంచి నీటితో శుభ్రం చేస్తూ ఉండటం ద్వారా ఈ సమస్యను అరికట్టొచ్చు. పరిస్థితి తీవ్రతను బట్టి కంటి వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు నిపుణులు.
Show comments