iDreamPost
android-app
ios-app

Indigo Flight, MLA Roja, Yanamala – రోజా, యనమలకు తృటిలో తప్పిన ముప్పు..

Indigo Flight, MLA Roja, Yanamala –  రోజా, యనమలకు తృటిలో తప్పిన ముప్పు..

ఇండిగో విమానం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. గంటపాటు గాలిలో చక్కర్లు కొడుతూ ప్రాణ భయం కలిగించింది. అందులో ఎమ్మెల్యేలు రోజా, వేగుళ్ల జోగేశ్వరరావు, టీడీపీ సీనియర్‌నేత యనమల రామకృష్ణుడు సహా 70 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఈ రోజు ఉదయం 9.20 గంటలకు ఇండిగో విమానం రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి 70 మంది ప్రయాణికులతో బయలుదేరింది. గంట ప్రయాణం తర్వాత 10.20 గంటలకు తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో విమానం ల్యాండ్‌ అవ్వాల్సి ఉంది. అయితే విమానం ల్యాండ్‌ చేయని పైలెట్లు.. గాలిలోనే చక్కర్లు కొట్టించారు. విమానాన్ని ఎందుకు ల్యాండ్‌ చేయలేదో..? కారణం ఏమిటో ప్రయాణికులకు చెప్పలేదు. మబ్బులు పట్టి ఉండడంతో వాతావరణం అనుకూలించడం లేదేమోనని ప్రయాణికులు భావించారు. అయితే గంటపాటు గాలిలోనే విమానం చక్కర్లు కొడుతూ, కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఎమ్మెల్యే రోజా.. ఇండిగో సిబ్బందిని గట్టిగా నిలయదీయడంతో ఫ్యూయల్‌ అయిపోతుండడంతో విమానాన్ని బెంగుళూరుకు మళ్లించామని చెప్పారు. బెంగులూరు విమానాశ్రయంలో ల్యాండ్‌ చేసిన తర్వాత.. ప్రయాణికులను కిందకు దిగనీయలేదు. ఫ్యూయల్‌ కొరత అని సిబ్బంది చెప్పగా.. విమానంలో సాంకేతిక సమస్య రావడంతోనే బెంగుళూరుకు మళ్లించారని ప్రయాణికులకు అర్థమైంది. ఆ సమస్యను సరిచేసేందుకు ప్రయత్నాలు చేశారు. సాంకేతిక సమస్యను సరి చేసిన తర్వాత.. తిరిగి తిరుపతికి తీసుకెళతామని సిబ్బంది చెప్పారు. అయితే దాదాపు రెండు గంటల పాటు విమానంలోనే కూర్చొబెట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

తాము బెంగుళూరులోనే దిగిపోతామని కోరితే.. అందుకు సిబ్బంది అనుమతించలేదు. తిరిగి ఎప్పుడు తీసుకెళతారో చెప్పలేదు. ఈ పరిస్థితిలో ఎమ్మెల్యే రోజా సిబ్బందిని గట్టిగా నిలదీశారు. ఇక్కడ ప్రయాణికులను దించేందుకు అనుమతి రాలేదని, సెక్యూరిటీ సమస్య అని.. పలు రకాల కారణాలు చెప్పారు. ఈ కారణాలను అంగీకరించని ఎమ్మెల్యే రోజా, యనమల, ఇతర ప్రయాణికులు దిగిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడే దిగితే.. తమకు 5 వేల రూపాయల చొప్పన అదనంగా చెల్లించాలని ఇండిగో సిబ్బంది ప్రయాణికులను డిమాండ్‌ చేశారు.

ఈ విషయంపై ఎమ్మెల్యే రోజా ఇండిగో సిబ్బంది నిలదీశారు. నాలుగు గంటల పాటు కూర్చోబెట్టి, పైగా తమను డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేయడం ఏమిటని ప్రశ్నించారు. తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టారని మండిపడ్డారు. ఈ విషయంపై ఇండిగో సంస్థపై కేసు వేసేందుకు సిద్ధమయ్యారు. వెంటనే తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా తిరుపతి విమానాశ్రయంలో ఇండిగో సంస్థపై ఫిర్యాదు చేయించారు.

70 మంది ప్రయాణికులకు గాను 10 మంది బెంగుళూరులో దిగిపోగా.. మిగతావారు విమానంలోనే కూర్చిండిపోయారు. ఆ విమానం తిరిగి ఎప్పుడు బయలుదేరుతుందనేది తెలియరావాల్సి ఉంది.

Also Read : లాల్ జాన్ బాషా సోదరుడికి కీలక పదవి , ప్రభుత్వం ఉత్తర్వులు