iDreamPost
android-app
ios-app

విశాఖలో నీటిపై తేలియాడే పవర్ ప్లాంట్, దేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్

  • Published Feb 05, 2022 | 9:27 AM Updated Updated Feb 05, 2022 | 9:27 AM
విశాఖలో నీటిపై తేలియాడే పవర్ ప్లాంట్, దేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్

విశాఖ నగరం మరో ప్రత్యేకతను సంతరించుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. సోలార్ విద్యుత్ లో విశిష్టతను సాధించింది. ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంటులలో దేశంలోనే అతి పెద్దది నిర్మించింది. నగర వాసులకు తాగునీటిని అందిస్తున్న మేఘాద్రిగడ్డను సోలార్ పవర్ ప్లాంట్ గా మార్చేసి అద్భుతమైన రీతిలో మలిచి జీవీఎంసీ గుర్తింపు పొందింది. రిజర్వాయర్ నీటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ఓవైపు నీటిని ఆవిరికాకుండా అడ్డుకోవడం, రెండోవైపు సోలార్ పవర్ ఉత్పత్తి ద్వారా అవసరాలు తీర్చడం వంటివి ఏకకాలంలో జరగడం విశేషం.

జీవీఎంసీలో 22 లక్షల మంది జనాభా ఉన్నారు. దాంతో విద్యుత్ భారాన్ని కొంతమేరకైనా తగ్గించుకునేందుకు గానూ కొద్దిమేర సోలార్ పవర్ ద్వారా సహజవనరులను వినియోగించుకునేందుకు పూనుకున్నారు ఇప్పటికే అనేక ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల మీద సౌర విద్యుత్ ప్యానళ్లను అమర్చారు. వీటి ద్వారా సుమారు 5 మెగావాట్ల సౌర విద్యుత్‌ లభిస్తోంది. వీధి దీపాల స్తంభాలు, అడ్వర్టైజ్ మెంట్ పోల్స్ ద్వారా మరో 2.5 నుంచి 3 మెగావాట్ల వరకు సౌర విద్యుత్‌ను పొందుతున్నారు. దీన్ని మరింత పెంచడం కోసం జీవీఎంసీ వినూత్న ఆలోచనతో ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్లాంట్‌ సిద్ధం చేసింది.

ముడసర్లోవ రిజర్వాయర్‌ నీటి మీద నిర్మించడంతో 4.4 ఎకరాల విస్తీర్ణంలోనే 2 మెగావాట్ల ప్లాంట్‌ పూర్తయ్యింది. ఇది దేశంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ గా నమోదయ్యింది. ఆ అనుభవంతో దానికి మించి మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ మీద 3 మెగావాట్ల ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్లాంట్‌ సిద్ధమవుతోంది. రూ. 14 కోట్లను దీనికోసం వెచ్చిస్తున్నారు. విశాఖ నగర పరిధిలో ఉన్న ముడసర్లోవ రిజర్వాయర్ తో మేఘాద్రి గడ్డ ద్వారానూ విద్యుత్ ఉత్పాదనకు పూనుకోవడం పలువురిని ఆకట్టుకుంటోంది.

విద్యుత్ అవసరాలతో పాటుగా ఈ ఫ్లోటింగ్ పవర్ ప్లాంటులు టూరిస్టులను కూడా ఆకట్టుకుంటున్నాయి. అందంగా అమర్చిన పలకలను , విద్యుత్ ఉత్పాదనను చూసి తెలుసుకునేందుకు పలువురు మొగ్గు చూపుతున్నారు .వివిద ప్రాంతాల నుంచి విశాఖ వచ్చే టూరిస్టులు ఇప్పుడు ఈ సోలార్ ప్లాంటులు చూసేందుకు కూడా ప్రాధాన్యతనిస్తుండడం విశేషం.

Also Read : ఏపీలో మరో కొత్త పథకం