iDreamPost
android-app
ios-app

భారత జట్టు మొదటి క్రికెట్ టెస్టు ఆడిన రోజు

భారత జట్టు మొదటి క్రికెట్ టెస్టు ఆడిన రోజు

జూన్ 25, 1932 న ఇంగ్లాండులో ఇంగ్లాండు జట్టుతో ఆడిన టెస్టుతో అప్పటికి టెస్టు క్రికెట్ ఆడుతున్న ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్ల సరసన టెస్టు హోదా సాధించిన ఆరవ దేశంగా నిలిచింది.
 
పద్దెనిమిదో శతాబ్దంలోనే క్రికెట్

భారతదేశానికి ఇంగ్లీషు వారు క్రికెట్ క్రీడను తీసుకొచ్చారు. ఇంగ్లీషు నావికులు 1721లో భారతదేశంలో మొదటి క్రికెట్ టెస్టు మ్యాచ్ ఆడినట్టు రికార్డులు ఉన్నాయి. భారతీయులలో క్రికెట్ ఆడడం మొదలు పెట్టింది పార్సీలు. 1846లో ఓరియంటల్ క్రికెట్ క్లబ్ మొదలుపెట్టి పార్సీలు క్రికెట్ ఆడడం మొదలుపెట్టారు. ఇదే ఆ తర్వాత పార్శీ క్రికెట్ క్లబ్ గా మారింది. ఈ క్లబ్ తరఫున ఒక జట్టు 1846లో ఇంగ్లాండు పర్యటనకు వెళ్ళి, అక్కడ కొన్ని కౌంటీ జట్లతో, క్లబ్ జట్లతో 28 మ్యాచులాడి, 19 ఓడిపోయి, 8 డ్రా చేసి, ఒకటి గెలిచింది.
 
పార్సీలు, ఆంగ్లేయులూ తరచుగా ఆడుతున్న మ్యాచ్ లలో, హిందూ జింఖానా జట్టు కలిసి బాంబే ట్రయాంగులర్ పేరుతో వార్షిక టోర్నమెంట్ మొదలుపెట్టారు. వీరితో ముస్లిం జట్టు కలిశాక ఇది బాంబే క్వాడ్రాంగులర్ పేరిట కొంతకాలం కొనసాగి, యూదులు, బౌద్ధులు, భారతీయ క్రైస్తవులతో కూడిన అయిదవ జట్టు కలిశాక బాంబే పెంటాగ్యులర్ అయింది. మత ప్రాతిపదికన జరిగే ఈ పోటీల పట్ల చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేయడంతో 1946లో ఈ పోటీలు రద్దు చేశారు.

Also Read:క్రికెట్ గతినే మార్చిన ఆ ప్రపంచ కప్ ..
 
పార్శీల జట్టు ఇంగ్లాండు పర్యటన తర్వాత మరో రెండు భారత క్రికెట్ జట్లు 1888,1911 సంవత్సరాల్లో అనధికార పర్యటనకు ఇంగ్లాండు వెళ్ళాయి. ఈ రెండు పర్యటనలను పాటియాలా మహారాజు భూపిందర్ సింగ్ తన సొంత ఖర్చుతో జరిపించారు. 1928లో భారతదేశంలో క్రికెట్ వ్యవహారాలను నియంత్రించడానికి క్రికెట్ బోర్డు ఏర్పాటు చేశారు.
 
మొదటి అధికారిక పర్యటన

భారత జట్టుతో అధికారిక టెస్టు మ్యాచ్ ఆడదానికి ఇంగ్లాండు క్రికెట్ బోర్డు ఒప్పుకున్నాక జట్టు పర్యటనకు అయ్యే ఖర్చులు భరించడానికి సంస్థానాధీశుల సాయం కోరింది సొంత నిధులు లేని భారత క్రికెట్ బోర్డు. కెప్టెన్ గా పాటియాలా మహారాజు, వైస్ కెప్టెన్ గా సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన లింబ్డి రాజు, డిప్యూటీ వైస్ కెప్టెన్ గా విజయనగరం మహారాజుని, జట్టు సభ్యుడిగా పోర్ బందర్ మహారాజుని తీసుకున్నాక జట్టు ఖర్చులు భరించడానికి వాళ్ళు ఒప్పుకున్నారు.
 
అయితే చారిత్రక పర్యటనకు తాను జట్టుకు భారం కాకూడదని పాటియాలా మహారాజు జట్టు ఇంగ్లాండు బయలుదేరడానికి ముందే తప్పుకుంటే, మిగిలిన ముగ్గురు టెస్టు మ్యాచ్ కు ముందు ఆడిన సన్నాహక మ్యాచ్ ల్లో తమ ప్రదర్శన చూసి స్వచ్ఛందంగా జట్టు నుంచి తప్పుకున్నారు. దీంతో జట్టు నాయకత్వం కల్నల్ కొఠారి కనకయ్య నాయుడుని వరించింది. యుక్తవయస్కుడు కాకపోయినా మంచి ఫామ్, ఫిట్ నెస్ తో ఉన్న సి. కె. నాయుడు అంతకుముందే ఒక సన్నాహక మ్యాచ్ లో సెంచరీ సాధించాడు. అప్పుడు ఇంగ్లాండు వార్తాపత్రికలు ఆయనను “ఇండియన్ బ్రాడ్ మన్” గా అభివర్ణించాయి.
 
అదరగొట్టిన ఆరంభం

భారత్ లో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం వల్ల భారతదేశానికి టెస్టు హోదా కల్పించారు కానీ, భారత జట్టులో అందుకు తగిన ప్రతిభ లేదని కొందరు కాలమిస్టులు వార్తాపత్రికల్లో విమర్శలు చేశారు.

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ డగ్లస్ జార్డిన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్ ఓపెనర్లు హెర్బర్ట్ సట్ క్లిప్, పెర్సీ హోమ్స్ తొమ్మిది రోజుల క్రితం ఒక కౌంటీ మ్యాచ్ లో యార్క్ షైర్ తరఫున ఆడుతూ మొదటి వికెట్ భాగస్వామ్యం 555 పరుగులతో రికార్డు నెలకొల్పి అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు.

అయితే భారత బౌలర్లు అమర్ సింగ్, మహమ్మద్ నిస్సార్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఇరవై నిమిషాలలో పంతొమ్మిది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అప్పుడు కెప్టెన్ జార్డిన్, వాలీ హామండ్ నిదానంగా ఆడి జట్టును కుదుటపరిచే ప్రయత్నం చేసినా, మొదటిరోజు టీ సమయానికి ముందే ఇంగ్లాండు జట్టు 259 పరుగులకు ఆలౌట్ అయింది. బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు వికెట్ నష్టపోకుండా ముప్పై పరుగులు చేసి మొదటి రోజు ఆట ముగించింది.
 
దెబ్బతీసిన అనుభవలేమి

రెండవ రోజు ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించిన భారతజట్టు స్కోరు ఒకదశలో వికెట్ నష్టానికి 110 పరుగులు ఉంది. అయితే భారత జట్టులో సి. కె. నాయుడు, నజీర్ ఆలీలకు మాత్రమే పిచ్ మీద క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. మిగిలిన అందరూ అప్పటివరకూ మ్యాట్ మీద క్రికెట్ ఆడినవారే. ఒకదశలో 160/4 స్కోరు సాధించిన భారత జట్టు 189 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ సి. కె. నాయుడు ఒంటరి పోరాటం చేసి నలభై పరుగులు సాధించాడు. రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 275 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.

Also Read:విలువలకే ఆయన దొర
 
345 పరుగుల విజయలక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు ఈసారి 187పరుగులకు ఆలౌట్ అయింది. ఈసారి భారత జట్టు తరఫున అమర్ సింగ్ 51 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు. 158 పరుగుల తేడాతో ఇంగ్లాండు జట్టు విజయం సాధించింది. మ్యాచ్ ఓడిపోయినా టెస్టు క్రికెట్ ఆడగల సత్తా లేదని విమర్శించిన వారి నోళ్ళు మూయించింది భారత క్రికెట్ జట్టు.
 
భారతజట్టు తన మొదటి టెస్టు విజయం కోసం ఇరవై సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. 1952లో ఇంగ్లాండు జట్టు మీద తన మొదటి టెస్టు విజయం నమోదు చేసిన భారతజట్టు ఆ సంవత్సరమే పాకిస్తాన్ మీద తన మొదటి సిరీస్ విజయం కూడా సాధించింది.
 
భారత క్రికెట్ జట్టు చరిత్రలో మరచిపోలేని మరో విజయం 1983లో ఇంగ్లాండులోనే గెలిచిన వన్డే ప్రపంచ కప్ కూడా జూన్ 25 నాడే జరిగింది.