Idream media
Idream media
40 ఏళ్లలో మన పత్రికలు ఎదిగిన తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. రాజకీయ అభిప్రాయాల్ని పక్కన పెడితే , ఆధునిక టెక్నాలజీని సొంతం చేసుకోవడం పాఠకుడికి వేగంగా చేరడం, వార్తల్లో పోటీ పడడం ఇవన్నీ ఊహకందని రీతిలో పెరిగాయి.
1980 నాటికి పరిస్థితి ఏమంటే రాయలసీమ జిల్లాల్లో ఉదయమే వచ్చే పత్రికలు మూడే మూడు. ఆంధ్రప్రభ, హిందూ, ఎక్స్‌ప్రెస్. ఆంధ్ర పత్రిక, ఈనాడు ఆలస్యంగా వచ్చేవి. ఆంధ్రజ్యోతి అసలు కనపడేది కాదు. ఉదయాన్నే రావడం అంటే 7.30 గంటలకి. ఇది కూడా అనంతపురం పట్టణాలకి మాత్రమే. మిగిలిన ఊళ్లకి మధ్యాహ్నమే. పల్లెలకి పేపర్ వెళ్లేది కాదు. కొన్ని ఊళ్లకి పోస్టులో వెళ్లేది. చిన్న ఊళ్లకి సొంతంగా పత్రికలు రావాణా అయ్యేవి కాదు. బస్ పార్సిల్స్‌లో వెళ్లేవి.
1983లో ఈనాడుతో రాయలసీమలో పరిస్థితి మారింది. తర్వాత ఉదయం, ఆంధ్రజ్యోతితో అన్ని ఊళ్లకి తెల్లారేసరికి పేపర్ వెళ్లేది. 1988లో ఆంధ్రజ్యోతిలో నేను చేరినప్పుడు సాయంత్రం 7 గంటలకి అనంతపురం డెడ్‌లైన్. అంటే 7 తర్వాత దేశంలో ఏం జరిగినా అనంతపురం పాఠకులు చదవలేరు. కడపకు రాత్రి 9, నెల్లూరుకి 10, చిత్తూరుకి అర్ధరాత్రి ఒంటి గంట. లేటెస్ట్ న్యూస్ తిరుపతికి మాత్రమే అందేది.
1991లో అనంతపురంలో ఈనాడు పెట్టారు. అయినా ఆంధ్రజ్యోతి కొంత కాలం తగ్గలేదు. ఎపుడైతే రాజీవ్‌గాంధీ హత్య వార్త లేకుండా పేపర్ వార్త వచ్చిందో అప్పుడు జనానికి అర్థమైంది. 1990లో 10 వేలు ఉన్న సర్క్యులేషన్ 99 నాటికి 1000కి దిగజారింది. అనంతపురం ఎడిషన్ సక్సెస్ కావడంతో ఈనాడు అన్ని జిల్లాల్లో ఎడిషన్ పెట్టింది. వార్త కూడా అదే చేసింది. 2000వ సంవత్సరంలో ఆంధ్రజ్యోతి మూసేశారు.
ఇపుడైతే డిజిటల్ వచ్చి ఫొటో స్కానింగ్ సులభమైంది కానీ, ఒకప్పుడు ఫొటో ప్రింటింగ్ ఒక పెద్ద సర్కస్. కలర్ ఫొటో ప్రింట్ చేయాలంటే ప్రింటింగ్‌కి కొన్ని గంటల ముందే సెలెక్ట్ చేసుకుని నెగటివ్ చేయించుకోవాలి. రాత్రి పూట జరిగే కార్యక్రమాలన్నీ Black and White మాత్రమే. ఆఫీస్‌లోనే బ్లాక్ అండ్ వైట్ లాబ్ ఉండేది. ప్రింట్ వేసి ఆరబెట్టి ఫొటోగ్రాఫర్ పూర్ణచంద్ర ఇచ్చేవాడు. ఆ ఫొటోలు తాకిన చెయ్యి పొరపాటున పెదవులకి తగిలితే తీయగా ఉండేది. ఆ కెమికల్ టేస్ట్ అది.
ఇక కలర్ ఫొటోలంటే అది నరకం. తిరుపతిలోని లాబ్ వాళ్లని బతిమలాడి తొందరగా మూయకుండా చూసుకోవాలి. అక్కడ ప్రింట్స్ వేసుకుని ఫొటోగ్రాఫర్ అష్టకష్టాలు పడి రేణిగుంట రోడ్డులోని ఆఫీస్‌కు వచ్చేవాడు. ఆ రోజుల్లో రోడ్డుకి బదులు గోతులుండేవి. రేణిగుంట రోడ్డులో కిందపడి దెబ్బలు తగలని జర్నలిస్టులే ఉండేవాళ్లు కాదు.
పేజీల్లో ఖాళీ స్థలం వదిలేసి ఫొటోల కోసం జాగారం చేసేవాళ్లం. రాగానే హడావుడిగా రైటప్‌లు రాసి పేజీలు పంపేవాళ్లం. ఈ హడావుడిలో ఫొటోలు తారుమారు అయ్యేవి. తెల్లారి అదో గోల.
పేజీలకి, ప్రింటింగ్‌కి మధ్య చాలా సెక్షన్లు ఉండేవి. ఇప్పుడు కంప్యూటర్ నుంచి నేరుగా ప్లేట్‌కి వెళ్లిపోతాయి. అప్పట్లో పిండి మిషన్ సైజ్‌లో కెమెరా ఉండేది. అది పేజీలని ఫొటో తీసి టచింగ్ సెక్షన్‌కి ఇచ్చేది. అక్కడ పదునైన చాకుతో ఆ ఫిల్మ్‌ని ముక్కలు చేసి అతికించి ప్లేట్‌కి ఇచ్చేవాళ్లు. ఇపుడీ సెక్షన్లన్నీ మాయమయ్యాయి.
పేజీలని చేత్తో మేకప్ చేసేరోజులు. కత్తెరతో న్యూస్ ముక్కల్ని కత్తిరించి పేజీలో అతికించేవాళ్లు. ఈ ఆర్టిస్టులకి పేజీ నిండడమే ముఖ్యం. విషయం అనవసం. ఒకసారి ఉత్తమ సర్పంచ్ హెడ్డింగ్ కింద గజదొంగ వార్త వచ్చింది.
చాలా ఊళ్ల నుంచి వార్తలు బస్ పార్సల్స్‌లో వచ్చేవి. బస్సులో నుంచి విసిరి వెళ్లేవాళ్లు. సెక్యూరిటీ వాళ్లు రోడ్డు మీద నిలబడి ఏరుకునే వాళ్లు. రాత్రి పూట కంప చెట్లలో కవర్లు పడేవి, టార్చిలైట్లు వేసి వెతుక్కునే వాళ్లం. ఇది కాకుండా టెలి ప్రింటర్ అనే ఒక రాక్షసి టక్కు టక్కు అని ఇనుప పాదాలతో భయపెట్టేది. తెలుగుని ఇంగ్లీష్‌లో టైప్ చేసి పంపేవాళ్లు. రోడ్డు ప్రమాదం అంటే Roddu pramadam అని ఉంటుందన్న మాట. అనంతపురం లాంటి జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో ఈ సౌకర్యం ఉండేది. అక్కడున్న ఆపరేటర్లకి తెలుగు ఇంగ్లీష్ రెండూ వచ్చేవి కావు. ఆ తప్పులు సరిచేసుకుని తెలుగులో రాయాల్సిన బాధ్యత సబ్ ఎడిటర్లది. రఫ్ ప్యాడ్లలో రాసి ఆ కాగితాలు చించి ఫొటో కంపోజింగ్ సెక్షన్‌కి ఇచ్చేవాళ్లం. వాళ్లు సుఖ పురుషులు. ఆఫీస్ మొత్తమ్మీద ఏకైక ఎసి రూమ్ వాళ్లదే. కంప్యూటర్ల కోసం ఎసిలుండేవి. ఎండాకాలం మేము చొక్కాలు విప్పి చెమటలు తుడుచుకుంటూ పనిచేస్తే నవ్వే వాళ్లు. చలికాలం మేము నవ్వేవాళ్లం. డ్యూటీ అయిపోయాక దడదడమనే శబ్దంతో పేపర్లు ప్రింట్ అవుతుంటే మేము రాసిన వార్తల్ని ఆనందంగా చదువుకునే వాళ్లం. అక్కడితో ఆగకుండా తిరుపతి బస్టాండ్‌లో టీలు, సిగరెట్లు తాగుతూ దేశ రాజకీయాలపై చర్చ.
టెక్నాలజీ ఎదిగింది సరే, ప్రామాణికత, విశ్వసనీయత ఎదిగిందా? జర్నలిజాన్ని వదిలేసిన వాన్ని, నాకెందుకీ అనవసర చర్చ?
(ఈ రోజు జాతీయ వార్తా పత్రికల దినోత్సవం)