iDreamPost
android-app
ios-app

రాజ్యాంగాన్ని చేత్తో రాసింది ఎవరో తెలుసా?

రాజ్యాంగాన్ని చేత్తో రాసింది ఎవరో తెలుసా?

ప్రతి దేశానికి రాజ్యాంగం ఉంటుంది. మన దేశానికి రాజ్యాంగం ఉంది. అయితే అన్ని దేశాల రాజ్యాంగాలు, భారతదేశ రాజ్యాంగం ఒక్కటే కాదు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మనది. మన రాజ్యాంగం ముద్రించలేదు. పూర్తిగా చేతితో రాయడం భారత దేశ రాజ్యాంగం ప్రత్యేకత. ఢిల్లీ నివాసి శ్రీ ప్రేమ్ బిహారీ నారాయణ్ రేజాదాగారు పూర్తి రాజ్యాంగాన్ని తానొక్కరే స్వహస్తాలతో రాశారు.

ప్రేమ్ బిహారీ ఆ రోజుల్లో ప్రఖ్యాత calligrapher (చేతివ్రాత నిపుణులు). 1901 డిసెంబర్ 16న ఢిల్లీలో జన్మించిన ఈయన చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. తాత రాంప్రసాద్ సక్సేనా పర్షియ, ఇంగ్లీషు విద్వాంసులు, calligrapher కూడా. ఆయన పెంపకంలో ప్రేమ్ బిహారీ calligraphy నేర్చుకున్నారు. ఢిల్లీ సెయింట్ స్టీఫెన్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాక calligraphy కళ మీద దృష్టి పెట్టారు. 

భారత రాజ్యాంగం ముద్రణకు సిద్ధమైనపుడు జవహర్లాల్ నెహ్రు ప్రేమ్ బిహారీని పిలిచి మన రాజ్యాంగాన్ని ప్రెస్ లో ముద్రించడంకంటే ఇటాలిక్ రాతపద్దతిలో రాయించాలని అనుకొంటున్నట్టు తెలిపారు. అందుకు ఎంత పారితోషికం కోసం ఎదురుచూస్తున్నారు అని అడిగారు. “ఒక్క పైసా కూడా వద్దు. దేవుని దయవల్ల నా జీవితంలో అన్నీ సమకూరాయి, సంతోషంగానూ ఉన్నాను. భారత రాజ్యాంగాన్ని నేను రాయడం పూర్వజన్మ సుకృతం” అని ప్రేమ్ బిహారీ అన్నారు. అయితే ఒక విన్నపం చేశారు. ప్రతి పేజీలో కింద నాపేరు రాసుకుంటాను, చివరి పేజీలో నాపేరు మా తాతగారి పేరుతో కలిపి రాసుకుంటాను అందుకు మీ అనుమతి కావాలి అని ప్రేమ్ బిహారీ అన్నారు. అందుకు నెహ్రూ సమ్మతించాక రాజ్యాంగం రాసే పని మొదలయ్యింది.

రాజ్యాంగం రాయడానికి ఇప్పటి Constitution Houseలో ఒక గదిని కేటాయించారు. రాజ్యాంగం పూర్తిగా రాయడానికి 432 పెన్ హోల్డర్లు అవసరమయ్యింది. 303 నెంబరు నిబ్(ముల్లు) వాడారు. ఆ ముల్లులు ఇంగ్లాండ్, జేకొస్లేవికీయాల నుండి ప్రత్యేకంగా తెప్పించారు. రాజ్యాంగం రాయడానికి ప్రేమ్ బిహారీకి 6 నెలల సమయం పట్టింది. 251 షీట్ల parchment paper అవసరపడింది. రాజ్యాంగం బరువు 3 కిలోల 650 గ్రాములు, 22 ఇంచీల పొడవు 16 ఇంచీల వెడల్పు ఉంది.

రాజ్యాంగం రాయడం మొదలుపెట్టడానికి ముందు నెహ్రూ సూచన మేరకు రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ తో కలిసి 29 నవంబర్ 1949న ప్రేమ్ బిహారీ శాంతినికేతన్ వెళ్లారు. అక్కడ ప్రఖ్యాత చిత్రకారులు నందలాల్ బసుతో చర్చించి పేజీలో ఏ భాగంలో ప్రేమ్ బిహారీ రాయాలో చర్చించుకున్నారు. పేపర్ మిగిలిన భాగం నందలాల్ తమ చిత్రాలతో రాజ్యాంగాన్ని అలకరించబోతున్నారు. నందలాల్ మొహంజదరో ముద్రికలు, రామాయణ, మహాభారత ఘట్టాలు, గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర, అశోకుడు బౌద్ధ మతాన్ని విస్తరింపజేసిన ఘట్టాలు, విక్రమాదిత్యుని పాలన, అక్బర్ చక్రవర్తి, మొఘల్ సామ్రాజ్యానికి చెందిన చిత్రాలతో రాజ్యాంగాన్ని అలంకరించారు. ప్రేమ్ బిహారీ 1966 ఫిబ్రవరి 17న స్వర్గస్తులయ్యారు.