iDreamPost
iDreamPost
చారిత్రాత్మక 1000 వన్డేను భారత్ కైవసం చేసుకుంది. ఒకనాటి పసికూన ప్రపంచంలోనే అత్యధిక వన్డేలు అడిన జట్టుగా ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక ఈ వన్డేలో వెస్టిండీస్‌పై సునాయాసంగా విజయం సాధించింది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. 177 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన భారత్ కేవలం 28 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజేతగా నిలిచింది. 1000 వ వన్డేకు నాయకత్వం వహించిన అరుదైన ఘనత సాధించిన కెప్టెన్ రోహిత్‌శర్మ బాధ్యతాయుతంగా ఆడి జట్టు గెలుపులో కీలకంగా వ్యవహరించాడు.
రోహిత్ 51 బంతులలో 60 పరుగులు (10×4, 1×6) చేసి ఔటయ్యాడు. అతనికి మరో ఓపెనర్ కిషన్ (28 పరుగులు) తోడవ్వడంతో తొలి వికెట్‌కు వీరిద్దరూ కలిసి 84 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ ఔట్ కావడంతోపాటు మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ (8 పరుగులు), పంత్ (11 పరుగులు) ఔటయ్యారు. 116 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోవడంతో విండీస్ జట్టులో కొంత ఆశలు రేకెత్తాయి. అయితే యాదవ్ (34 పరుగులు), హూదా (26 పరుగులు) నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. విండీస్ బౌలింగ్‌లో జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు టాస్ ఓడిన వెస్టిండీస్ జట్టు భారత్ జట్టు ఆహ్వానం మేరకు తొలిగా బ్యాటింగ్ చేసింది. 43.5 ఓవర్లలో కేవలం 176 పరుగులకే ఆల్ ఔట్ కావడం విశేషం. జట్టులో హోల్డర్ ఒక్కరే 57 పరుగులు చేశాడు. ఓపెనర్లు హోప్ (8), కింగ్ (13), బ్రావో (18) పరుగులకు ఔట్ కాగా, కెప్టెన్ పోలార్డ్, హూస్సేన్‌లు సున్నా పరుగులకే పెవీలియన్ బాట పట్టారు. చివరిలో అలెన్ 29, జోసెఫ్ 13 పరుగులు చేయడంతో వెండిస్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేసింది. భారత్ జట్టులో చాహల్ 4 వికెట్లు, సుందర్ 3, కృష్ణ 2, సిరాజ్ ఒకటి చొప్పున వికెట్లు తీశారు.