iDreamPost
android-app
ios-app

సిడ్నీ మైదానంలో అదానీకి వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శన..!

  • Published Nov 27, 2020 | 10:48 AM Updated Updated Nov 27, 2020 | 10:48 AM
సిడ్నీ మైదానంలో అదానీకి వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శన..!

కరోనా మహమ్మరి వలన సుదీర్గ అంతరాయం తరువాత ఆస్ట్రేలియా దేశంలో సిడ్నీ వేదికగా ప్రారంభం అయిన భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ లో ఊహించని అంతరాయం ఎదురైంది. మ్యాచ్ 6వ ఓవర్ లోకి రాగానే ఒక్కసారిగా ఒక యువకుడు ప్లకార్డ్ పట్టుకుని మైదానం మద్యలోకి రావడంతో ఒక్కసారిగా కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆస్ట్రేలియా దేశంలో భారత్ పారిశ్రామిక దిగ్గజం అయిన అదానీకి వ్యతిరేకంగా ఆ ప్లాకార్డులు ఉండటంతో అక్కడి అధికారులు వెంటనే అప్రమత్తం అయి వారిని మైదానం నుండి బయటికి పంపివేశారు. అదానీకి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో ఆక్కడి ప్రజలు నిరసన వ్యక్తపరచడానికి ఆదేశంలో రాబోయే అదానీ ప్రాజెక్టే కారణం అని తెలుస్తోంది.

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో అదానీ సంస్థ కార్మైకెల్ బొగ్గు గనిని దాదాపు రూ. 81 వేల కోట్లు అంచనా వ్యయంతో ఏర్పాటు చేసే పనిలో ఉంది. ఇందుకోసం ఎస్‌బీఐ నుంచి 1 బిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల రుణాన్ని తెచ్చే ప్రయత్నం కూడా ఆ సంస్థ చేస్తుంది. ఇది ఇలా ఉంటే అదానీ సంస్థ ప్రాజెక్టు ఫలితంగా పర్యావరణం దెబ్బతింటుందని, భారీ స్థాయిలో గ్రీన్ హౌజ్ వాయువులు విడుదలవుతాయనీ, భూగర్భ జలాలతో పాటు స్థానిక సముద్ర తీరాలు కూడా దెబ్బతింటాయని ఆ దేశంలో కోంతమంది ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తమ వాదనని వినిపిస్తున్నారు. అలాగే ఆ ప్రాజెక్టు వస్తే తమ ప్రాంత యువతకు ఉద్యోగాలు లభిస్తాయనే ఆశభావం వ్యక్తం చేశే వారు కూడా ఉన్నారు.

అదానీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో రాజకీయ దుమారం కూడా అదే స్థాయిలో రేగింది. ఆస్ట్రేలియన్ గ్రీన్స్ పార్టీ మాజీ నాయకుడు, పర్యావరణ కార్యకర్త బాబ్ బ్రౌన్ నాయకత్వంలో ‘స్టాప్ అదానీ కాన్వాయ్’ అనే ఆందోళన జరిగింది. ఈ నేపధ్యంలో ఈ రోజు జరుగుతున్న ఆస్ట్రేలియా, భారత్ క్రికెట్ మ్యాచ్ లో ఆదేశానికి చెందిన పర్యావరణ ప్రేమికులు కోంతమంది ‘1 బిలియన్ డాలర్ అదానీ రుణం వద్దు’ అనే ప్లకార్డులతో మైదానంలోకి వచ్చి కోద్ది సమయం అంతరాయం కలిగించారు. దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.