iDreamPost
android-app
ios-app

తీరిన బుమ్రా వికెట్ల కరువు…ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ఆధిపత్యం

తీరిన బుమ్రా వికెట్ల కరువు…ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ఆధిపత్యం

ఇటీవల న్యూజిలాండ్ గడ్డపై ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో పూర్తిస్థాయి కోటాలో మొత్తం 30 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 5.56 ఎకానమీతో 167 సమర్పించుకొని ఒక్క వికెట్ కూడా సాధించలేదు.భారత్ జట్టులోకి బుమ్రా అరంగేట్రం చేసిన తర్వాత ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టని తొలి సిరీస్ ఇదే కావడం విశేషం.గతంలో జస్‌ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌ల పాదాల వద్ద సంధించే యార్కర్లకి బ్యాట్స్‌మెన్ ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా స్టంప్ గాల్లోకి ఎగురుతాయి. అలాంటిది న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బుమ్రా బౌలింగ్‌లో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు కూడా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి బంతిని బౌండరీ లైన్ దాటించారు.దీంతో బుమ్రా బౌలింగ్ పదును తగ్గిపోయిందేమోనని మాజీ క్రికెటర్లు,విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

బుమ్రా వికెట్లు పడగొట్టాడోచ్….

న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో బుమ్రా అద్భుత బంతులతో బౌలింగ్‌ చేసి రెండు వికెట్లు పడగొట్టి తన వికెట్ల కరువును తీర్చుకున్నాడు.ఈ మ్యాచ్‌లో 11 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా మునుపటి తన బౌలింగ్ పదును ప్రదర్శిస్తూ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఈ స్పీడ్ స్టార్ బౌలింగ్ పై నెలకొన్న సందేహాలను పటాపంచలు చేసి భారత శిబిరంలో ఆనందోత్సవాలు నింపాడు.

బుమ్రాతో పాటు భారత్‌ పేసర్లు మహమ్మద్ షమీ (3/17), ఉమేశ్‌ యాదవ్‌ (2/49), యువ బౌలర్ నవదీప్ సైని (2/58) సత్తా చాటడంతో కివీస్‌ ఎలెవన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే కుప్పకూలింది.దీంతో భారత్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 28 పరుగుల ఆధిక్యం లభించింది.

రాణించిన భారత యువ ఓపెనర్లు:

అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన భారత ఓపెనర్లు రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ బౌలర్లపై ఎదురు దాడి చేసి జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు.యువ ఓపెనర్లు పృథ్వీషా 25 బంతుల్లో 35 పరుగులు, మయాంక్ అగర్వాల్‌ 17 బంతుల్లో 23 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచారు.రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 59 పరుగులు చేయడంతో టీమిండియా ప్రస్తుతం 87 పరుగుల ఆధిక్యంలో ఉంది.తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 263 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.