iDreamPost
android-app
ios-app

Covid Vaccination – వంద‌కోట్ల వ్యాక్సి”నేష‌న్” ..!

Covid Vaccination – వంద‌కోట్ల వ్యాక్సి”నేష‌న్” ..!

క‌రోనా రూపంలో ఎన్న‌డూ లేని కొత్త విప‌త్తును దేశం ఎదుర్కొంది. ఎన్నో అప‌సోపాలు ప‌డింది. ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఆ మ‌హ‌మ్మారిని అడ్డుకోవ‌డం ఎలా? మందు ఎప్పుడు వ‌స్తుంది? అన్న ప్ర‌శ్న‌లు. ఇప్ప‌ట్లో క‌ష్ట‌మే. మూడు నాలుగేళ్ల‌యినా ప‌ట్టవచ్చ‌న్న వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. ఏడాదిలోపే మ‌హ‌మ్మారిని నిలువ‌రించే మందు (వ్యాక్సిన్ ) క‌నిపెట్టేశారు భార‌తీయ వైద్య నిపుణులు. వ్యాక్సిన్ వ‌చ్చాక .. ఇంత త్వ‌ర‌గా ఎలా సాధ్య‌మైంద‌న్న కొత్త అనుమానాలు. ఆయా కంపెనీలు ప్ర‌యోగాలు స‌రిగానే నిర్వ‌హించాయా? అన్న ప్ర‌శ్న‌లు. ముందు వాళ్లు వేసుకున్న చూద్దాంలే అని కొంద‌రిలో వేచి చూసే ధోర‌ణి. అలా నెమ్మ‌దిగా ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ డ్రైవ్ సెకండ్ వేవ్ ఉధృతికి దూసుకెళ్లింది. క‌ట్ చేస్తే.. తొమ్మిది నెల‌ల్లోనే వంద కోట్ల డోసుల మార్క్ ను అధిగ‌మించింది భార‌త్.

దేశంలో 2021 జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. మొదటి దశలో కోవిడ్‌ వారియర్స్‌కు టీకాలు ఇచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్ ఒక‌టి నుంచి సెకండ్‌ ఫేజ్‌లో 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇవ్వ‌డం ప్రారంభించారు. ఆ తర్వాత మే నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేస్తున్నారు. ఐతే వ్యాక్సిన్ ప్రారంభంలో కొన్ని రకాల భయాలు, అపోహలతో టీకా పంపిణీ నెమ్మదిగా సాగినా..సెకండ్‌వేవ్‌ కరోనా విజృంభణతో వ్యాక్సినేషన్ ఊపందుకుంది. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబరు 17న ఏకంగా రెండున్నర కోట్ల డోసుల వ్యాక్సిన్ వేసి రికార్డు సృష్టించారు. మొత్తంగా గురువారం (21-21) ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొమ్మిది నెల‌ల్లోనే వంద కోట్ల డోస్‌ల మార్క్‌ను అధిగమించి రికార్డు సృష్టించింది.

గ‌ణాంకాల‌ను ప‌రిశీలిస్తే.. అమెరికాలో ఇచ్చిన వ్యాక్సిన్ డోసుల కన్నా రెట్టింపు, జపాన్‌లో కన్నా ఐదు రెట్లు, జర్మనీలో కన్నా తొమ్మిది రెట్లు, ఫ్రాన్స్‌లో కన్నా ప‌ది రెట్లు అధికంగా భార‌త్ లో వ్యాక్సిన్ డోసులు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సినేషన్‌ను ఓ ఉద్యమంలా చేపట్టింది కేంద్రం. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లతో టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. చైనా తర్వాత వందకోట్ల డోసుల మార్క్‌ను క్రాస్‌ చేసిన రెండో దేశంగా నిలిచింది భారత్‌. 275 రోజుల్లోనే వందకోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయడంతో వ్యాక్సిన్‌ వేడుకలు నిర్వహిస్తోంది కేంద్రం. ఈ సందర్భంగా ఢిల్లీ RML ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ సంబరాల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ.

వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డ్‌ సృష్టించామన్నారు ప్రధాని మోదీ. ఈ రోజును గోల్డెన్‌ డేగా అభివర్ణించారు. 130 కోట్ల మంది ప్రజల సమష్టి స్ఫూర్తిని చూశామన్నారు. వందేళ్ళలో అతి పెద్ద మహమ్మారిపై పోరాటంలో దేశానికి 100 కోట్ల వ్యాక్సిన్ డోసులతో బలమైన రక్షణ కవచం లభించిందని చెప్పారు. 2021 అక్టోబరు 21 చరిత్రలో ఓ ప్రత్యేకమైన రోజుగా నిలుస్తుందన్నారు. ఈ విజయం భారత దేశానికి, ప్రతి భారతీయునికి దక్కుతుందని తెలిపారు. దేశంలోని వ్యాక్సిన్ తయారీ కంపెనీలు, వ్యాక్సిన్ రవాణాలో పాలుపంచుకున్నవారు, వైద్య రంగంలో నిపుణులు, టీకాలు ఇచ్చిన సిబ్బంది, తదితరులందరికీ మోదీ ధన్యవాదాలు తెలిపారు.

Also Read : Punjab Congress Siddu – సీఎం ఎవరైనా.. సిద్ధూ తీరు అంతేనా?