iDreamPost
android-app
ios-app

ఇండియా క్లీన్‌స్వీప్‌

  • Published Feb 11, 2022 | 4:10 PM Updated Updated Feb 11, 2022 | 4:10 PM
ఇండియా క్లీన్‌స్వీప్‌

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. మూడు వన్డేలు గెలిచి తన ఆధిక్యతను చాటుకుంది. ఇక్కడ నరేంద్ర మోడీ స్టేడియంలో శుక్రవారం జరిగిన మూడవ వన్డేలో అన్నిరంగాల్లోను భారత్‌ ఆధిపత్యం చెలాయించింది. భారత్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ లు తక్కువ స్కోర్ లకే పెవిలియన్‌కు చేరినా శ్రేయాస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌లు భారీ స్కోర్లు చేయగా, తరువాత సుందర్‌, ఛహర్‌లు రాణించడంతో భారత్‌ జట్టు గౌరవప్రదమైన స్కోర్‌ 265 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన వెస్టిండీస్‌ జట్టు కేవలం 169 పరుగులకే ఆల్‌ఔట్‌ కావడంతో భారత్‌ జట్టు 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి రెండు వన్డేలు గెలిచిన భారత్‌ జట్టు ఈ వన్డే విజయంతో మూడు వన్డేలు గెలిచినట్లయింది. ఈ సిరీస్‌ విజయం కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు పెద్ద మైలురాయి కానుంది.

266 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన వెస్టిండీస్‌ జట్టు వికెట్లు టపటపా రాలిపోయాయి. భారత్‌ బౌలర్లు లైన్‌అండ్‌లెంగ్త్‌ తప్పకపోవడంతో స్కోర్‌ చేసేందుకు, వికెట్లు కాపాడుకునేందుకు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లు అపసోపాలు పడ్డారు. ముఖ్యంగా ఛాహర్‌, సిరాజ్‌లు చేలరేగిపోయారు. అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లతోపాటు ఇతర బ్యాట్స్‌మెన్‌లు సైతం విఫలంకావడంతో జట్టు కేవలం 169 పరుగులకే ఆల్‌ఔట్‌ అయ్యింది. ఓపెనర్లు హోప్‌ (5 పరుగులు), కింగ్‌ (14 పరుగులు)లు తక్కువ పరుగులు చేసి పెవిలియన్‌ చేరారు. వీరితోపాటు బ్రావో (19 పరుగులు), బ్రూక్స్‌లు సున్నా, హోల్డర్‌ ఆరు పరుగులకే పెవిలియన్‌ చేరారు. జట్టు కెప్టెన్‌ పూరాన్‌ 34 పరుగులు చేశాడు. విండిస్‌ జట్టు ఒకానొక సమయంలో కేవలం 82 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు వంద పరుగులు చేరుతుందనే నమ్మకం కూడా కలగలేదు. చివరిలో జోసెఫ్‌ 29 పరుగులు, స్మిత్‌లు 36 పరుగులు చేయడంతో వెస్టిండీస్‌ జట్టు గౌరవ ప్రదమైన స్కోర్‌ చేసింది. వాల్స్‌ 13 పరుగులు చేయగా, రోచ్‌ సున్నా పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత్‌ బౌలర్లు సిరాజ్‌, కృష్ణలు మూడు చొప్పున, ఛాహర్‌, యాదవ్‌లు రెండు చొప్పున వికెట్లు తీశారు. 

అంతకుముందు భారత జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (13 పరుగులు), శిఖర్‌ ధావన్‌ (10) పరుగులకే వెనుదిరిగారు. వీరితోపాటు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సున్నా పరుగులకే పెవీలియన్‌ బాట పట్టాడు. జట్టు స్కోర్‌ 16 వద్ద ఉండగానే రోహిత్‌, కోహ్లీలు ఔట్‌కావడంతో భారత్‌ జట్టుపై వత్తిడి పెరిగింది. 42 పరుగుల వద్ద శిఖర్‌ ధావన్‌ ఔట్‌కావడంతో వెస్టిండీస్‌ జట్టులో ఆశలు రేకెత్తాయి. ఈ సమయంలో జట్టు స్కోర్‌ పెంచే బాధ్యతను శ్రేయాస్‌ అయ్యర్‌, పంత్‌లు భుజాల మీద వేసుకున్నారు. అయ్యర్‌ 80 పరుగులు (9×4), పంత్‌ 56 పరుగులు (6×4, 1×6) చేసి జట్టు స్కోర్‌ను పెంచారు. వీరిద్దరూ నాల్గవ వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తరువాత యాదవ్‌ ఆరు పరుగులకే ఔట్‌కాగా, సుందర్‌ 33 పరుగులు, ఛాహర్‌ 38 పరుగులు చేసి ఔట్‌కాగా, యాదవ్‌ ఐదు పరుగులు, సిరాజ్‌ 4 పరుగులకే ఔటయ్యారు. భారత్‌ జట్టు 50 ఓవర్లలో 265 పరుగులకు ఆల్‌ఔట్‌ అయ్యింది. విండీస్‌ జట్టులో హోల్డర్‌ 4, జోసెఫ్‌, వాల్ష్‌ 2 చొప్పున వికెట్లు తీశారు.